logo

నాడు సందడిగా.. నేడు సైలెంట్‌గా

ఎన్నికల ప్రచారమంటేనే హంగూ, ఆర్భాటం అధికం.. మైకుల గోల, కార్యకర్తల హంగామా మామూలుగా ఉండదు..అసెంబ్లీ ఎన్నికలు జరిగి 5 నెలలే అయినా లోక్‌సభ ఎన్నికల్లో ఏమాత్రం ఆ సందడి కనిపించడం లేదు.

Updated : 10 May 2024 05:43 IST

మారిన ప్రచార శైలి
అసెంబ్లీ నుంచి లోక్‌సభ ఎన్నికల దాకా ఇలా..

న్నికల ప్రచారమంటేనే హంగూ, ఆర్భాటం అధికం.. మైకుల గోల, కార్యకర్తల హంగామా మామూలుగా ఉండదు..అసెంబ్లీ ఎన్నికలు జరిగి 5 నెలలే అయినా లోక్‌సభ ఎన్నికల్లో ఏమాత్రం ఆ సందడి కనిపించడం లేదు. నేతల చేరికలు మినహా గల్లీలో కార్యకర్తల లొల్లి పెద్దగా లేదు. ఓటర్లను కలుసుకోవడానికి చేసే ప్రయత్నం చాలా తక్కువగా ఉంటోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏ కాలనీలో చూసినా ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు సైతం పోటాపోటీగా ప్రచారం చేసేవారు. ఎక్కడ చూసినా ఎన్నికల వాతావరణమే కనిపించేది. కానీ ప్రస్తుతం ఆ సందడి లేదు. పోలింగ్‌ సమయం దగ్గర పడినా ప్రచార హోరు లేదు.

అపార్టుమెంట్లల్లో..: మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో 22 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక్కొక్క కాలనీ లేదా అపార్టుమెంట్‌, గేటెడ్‌ కమ్యూనిటీలలో మూడేసి సార్లు ప్రచారం చేశారు. కానీ ప్రస్తుతం ఒక్కసారి కూడా కలవని కాలనీలే ఎక్కువగా ఉన్నాయి. గేట్లకు మాత్రం డోర్‌ స్టిక్కర్లను అంటిస్తూ ప్రచారం అయిపోయిందనిపిస్తున్నారు. చాలాచోట్ల కనీసం ఓటర్లను కలిసి మాట్లాడటం కూడా లేదు.


ప్రచారం లేదు.. పని లేదు..: సాధారణంగా ఎన్నికల ప్రచారం అంటే డప్పులు, మైకుల శబ్దాల మోత ఉండేది. అందరూ అభ్యర్థులు, నాయకులు ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అడిగేవారు. వీరి వెంట వందల మంది ప్రచారంలో పాల్గొనేవారు. బల నిరూపణకు, భారీ ప్రదర్శనలకు అడ్డ మీది కూలీలను తెచ్చి ప్రచారం చేయించేవారు. దీంతో ఎంతోమంది కూలీలకు ఉపాధి దొరికేది. మూడు పూటల భోజనం ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదని వాపోతున్నారు.


కానరాని విందులు: ఎన్నికలు అంటేనే ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అభ్యర్థులు, ఆయా పార్టీల నాయకులు ఎన్నో రకాలుగా ఓటర్లరకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించేవారు. ఉదయం అల్పహారాలు, మధ్యాహ్నం మాంసాహార భోజనాలు, రాత్రి మద్యంతో పాటు మళ్లీ మాంసహార విందులుంటాయి. కాలనీ సంక్షేమ సంఘాలకు, కుల సంఘాలతో భేటీలు ఏర్పాటు చేసేవారు. ప్రచారం ముగిసేందుకు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఆ వాతావరణం లేదు.

న్యూస్‌టుడే, ఉప్పల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని