logo

ఏటా ముప్పు.. ఏదీ కనువిప్పు

జిల్లాలోనే రెండో అతి పెద్ద పట్టణం కోరుట్లలో ఏటా వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురవుతున్నా శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టడంలో పాలకులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.

Published : 23 May 2024 03:13 IST

కోరుట్లలో జలమయమవుతున్న లోతట్టు కాలనీలు
న్యూస్‌టుడే, కోరుట్ల

ప్రకాశంరోడ్‌లో జలమయమైన లోతట్టు ప్రాంతం (పాతచిత్రం)

జిల్లాలోనే రెండో అతి పెద్ద పట్టణం కోరుట్లలో ఏటా వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురవుతున్నా శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టడంలో పాలకులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. జులై వచ్చిందంటే ఎప్పుడు వరదలు ముంచెత్తుతాయోనని పట్టణ ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రకాశంరోడ్, అయిలాపూర్, ఝాన్సిరోడ్, అయిలాపూర్‌రోడ్, ఆదర్శనగర్, తాళ్ల చెరువు కింది ప్రాంతాల్లోని కాలనీలు పూర్తిగా జలమయమవుతున్నాయి. రోడ్లపై మూడు అడుగుల మేర రోజుల తరబడి వరద నీరు పొంగి ప్రవహిస్తుంది. ఇళ్లలోకి వరదనీరు చేరి ప్రజలు రోజుల తరబడి బయటకు రాని పరిస్థితులు నెలకొంటాయి. ఇళ్లు వరదల్లో చిక్కుకోవడంతో ఖాళీ చేయాల్సిన దుస్థితి ఉంటుంది. ఏటా అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి వరద ముంపు ప్రాంతాలను సందర్శించి వెళ్లడం తప్ప శాశ్వత చర్యలు చేపట్టడం లేదు.

కాలువలపై పట్టింపేదీ..?

కోరుట్ల మున్సిపల్‌ పరిధిలోని ఏఖీన్‌పూర్‌ స్తంభాల చెరువు నిండిన తర్వాత అక్కడి నుంచి పట్టణంలోని పీతిరికుంట, కంచరకుంట, మద్దుల చెరువు, లస్కగౌడ్‌కుంట, బొల్లికుంట, అయిలాపూర్‌ పాడిచెరువు, పెద్దచెరువులను కలుపుతూ గతంలో గొలుసుకట్టు చెరువులు, కాలువలు ఉండేవి. స్తంభాల చెరువు మత్తడి దూకిన నీరు షరాబుకుంట, తాళ్లచెరువులో చేరిన తర్వాత మత్తడి దూకి కాలువ ద్వారా కోరుట్లలోని ఫుల్‌వాగులో కలుస్తుండేది. స్తంభాల చెరువు కిందున్న చెరువులు, కుంటలు, కాలువలు చాలావరకు ఆక్రమణకు గురయ్యాయి. ప్రధాన కాలువలు తరచూ కోతకు గురవుతున్నాయి. దీంతో వరద నీరు రోడ్లు, కాలనీలను ముంచెత్తుతోంది. కంచరకుంటకు వెళ్లే కాలువ బీలాల్‌పుర, ఏసుకోనిగుట్ట వద్ద దెబ్బతిని తరచూ కోతకు గురవుతోంది. కంచరకుంట మత్తడి నుంచి పారే నీరు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో ఆదర్శనగర్‌ పూర్తిగా జలమయమవుతోంది. మద్దుల చెరువు మత్తడి కిందున్న ప్రకాశంరోడ్‌లోని కాలువ పట్టా భూమిలో ఉండటంతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు కాలువను ఆక్రమించుకోవడంతో 10-15 అడుగులు ఉన్న కాలువ 3, 4 అడుగులకు కుచించుకుపోయాయి. ఈ కాలువను పలువంకలుగా మల్చడంతో నీరు సరిగా ముందుకుసాగక రోడ్డుపై ప్రవహిస్తుంది.

రోజుల తరబడి నీటిలోనే..

కోరుట్ల పట్టణంలోనే అత్యంత లోతట్టు ప్రాంతం ప్రకాశంరోడ్, ఝాన్సిరోడ్, అయిలాపూర్‌రోడ్‌ కాలనీలు చిన్నపాటి వర్షానికే పూర్తిగా జలమయమవుతున్నాయి. పైప్రాంతం నుంచి వచ్చే వర్షపు నీరంతా మురుగు కాలువల ద్వారా ముందుగా మద్దుల చెరువులో చేరుతోంది. స్తంభాల చెరువు నీరు కాలువ ద్వారా కంచరకుంటకు చేరి అక్కడి నుంచి మత్తడి దూకి ఆదర్శనగర్‌ నుంచి వచ్చి మద్దుల చెరువులో కలుస్తుంది. దీనికితోడూ గాంధీరోడ్, తిలక్‌రోడ్, గోదాంరోడ్, చిన్నతోటవాడ, అయిలాపూర్, ప్రకాశంరోడ్‌ల నుంచి మురుగు కాలువ ద్వారా వర్షపు నీరు లోతట్టు ప్రాంతానికి చేరుతుంది. మద్దుల చెరువు మత్తడి నుంచి వచ్చే నీరు మురుగు కాలువలో వేగంగా పారుతుండటంతో అదే కాలువలో ప్రకాశంరోడ్‌లోని పలు మురుగు కాలువల నీరు కలుస్తుంది. దీంతో మురుగు కాలువలలో నీరు వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా వరద ముంపునకు గురవుతున్నాయి. రోజుల తరబడి కాలనీలు వరద నీటిలో చిక్కుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని