logo

వంద మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తే లక్ష్యం

వంద మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తిని చేరుకోవడానికి సింగరేణి సంస్థ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది. దేశంలో బొగ్గు అవసరాలు పెరిగే అవకాశం ఉండటంతో దానికి అనుగుణంగా ఉత్పత్తి లక్ష్యాలను పెంచుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు చేసుకుంటోంది.

Published : 23 May 2024 03:29 IST

సింగరేణి భవిష్యత్తు ప్రణాళికల
న్యూస్‌టుడే, గోదావరిఖని

బొగ్గు నింపుతున్న షావల్‌ యంత్రం

వంద మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తిని చేరుకోవడానికి సింగరేణి సంస్థ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది. దేశంలో బొగ్గు అవసరాలు పెరిగే అవకాశం ఉండటంతో దానికి అనుగుణంగా ఉత్పత్తి లక్ష్యాలను పెంచుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు చేసుకుంటోంది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న సింగరేణి రానున్న అయిదేళ్లలో 100 మిలియన్‌ టన్నుల వార్షిక లక్ష్యం సాధించాలన్న దిశగా ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రస్తుతం వెంటనే కొత్త గనులు ప్రారంభించుకునే అవకాశాలు లేకపోవడంతో ఉన్న వాటిని విస్తరిస్తూ ఉత్పత్తి పెంచుకోవాలని భావిస్తుంది. రానున్న కాలంలో కొన్ని గనుల్లో బొగ్గు నిక్షేపాలు అంతరించే అవకాశం ఉంది. వాటి స్థానంలో కొత్త గనులు ఏర్పాటు చేసుకోవడానికి సమయం పడుతుంది. దీంతో అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా పాత వాటిని విస్తరించుకుంటూ ఉత్పత్తి పెంచుకోవాలని ప్రణాళికలు చేసుకుంటోంది. ఇప్పటి వరకు సింగరేణి సంస్థ 1700 మిలియన్‌ టన్నుల బొగ్గును వెలికి తీసింది. ఇంకా నిల్వ ఉన్న 1400 మిలియన్‌ టన్నుల బొగ్గును వెలికి తీసేందుకు ఉన్న గనులను విస్తరించి ఉత్పత్తి చేయాలని భావిస్తోంది. ఇప్పటి వరకు 300 మీటర్ల నుంచి 600 మీటర్ల లోతులో ఉన్న బొగ్గును మాత్రమే వెలికి తీసింది. రానున్న కాలంలో అంతకంటే ఎక్కువ లోతులో ఉన్న నిల్వలను వెలికి తీయాల్సి ఉంటుంది.

ఏడాదిలో రెండు గనుల మూసివేత

రానున్న ఏడాది కాలంలో రెండు ఓసీపీలు మూసివేయనున్నారు. ఏడాది వరకు బొగ్గు నిక్షేపాలు పూర్తిగా వెలికి తీసే అవకాశం ఉండటంతో వాటిని మూసివేయనున్నారు. రామగుండం రీజియన్‌లోని ఓసీపీ-1తో పాటు శ్రీరాంపూర్‌ ప్రాంతంలోని రామకృష్ణాపూర్‌ ఓసీపీల్లో బొగ్గు నిక్షేపాలు పూర్తి కావస్తున్నాయి. వాటిని వచ్చే ఏడాది నాటికి దాదాపుగా మూసివేసే అవకాశం ఉంది. ముందుగా రామకృష్ణాపూర్‌ ఓసీపీలో బొగ్గు నిక్షేపాలు పూర్తి కానున్నాయి. ఆ తర్వాత రామగుండంలోని ఓసీపీ-1 గనిలో సైతం నిక్షేపాలు పూర్తయ్యే అవకాశం ఉంది.

విస్తరణపై యాజమాన్యం దృష్టి

ప్రస్తుతం సింగరేణి సంస్థ గనుల విస్తరణ ద్వారానే సంస్థను నిలబెట్టాలని భావిస్తుంది. కొత్త గనులు వెంటనే వచ్చే అవకాశం లేకపోవడంతో మూసివేసే గనుల పరిసర ప్రాంతాల్లో ఉన్న బొగ్గు నిక్షేపాలను వెలికి తీసేందుకు ప్రాజెక్టుల విస్తరణపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే రామగుండం ప్రాంతంలో మూసివేసిన కొన్ని భూగర్భ గనులు, ఓసీపీ-1 ప్రాంతాన్ని కలుపుకొని రామగుండం మెగా ఓసీపీని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు చేసుకుంది. అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు ఓసీపీ, మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణాపూర్‌ ఓసీపీ, ఎంవీకే, గోలేటి ఓసీపీలుగా విస్తరించేందుకు ప్రణాళికలు చేసుకుంది. వీటితో పాటు కొత్తగూడెంలోని వీకే ఓసీపీ, జేకే ఓసీపీలను విస్తరించి బొగ్గు ఉత్పత్తి పెంచుకోవాలని భావిస్తుంది.

అందుబాటులోకి 28 మిలియన్‌ టన్నులు..

కొత్తగా విస్తరించనున్న గనుల ద్వారా సంస్థకు 28 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి అందుబాటులోకి రానుంది. వంద మిలియన్‌ టన్నుల వార్షిక లక్ష్యం సాధించేందుకు దృష్టి సారించిన సింగరేణి ప్రస్తుతం 72 మిలియన్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి సాధించేందుకు లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీనికి తోడు మరో 28 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధిస్తే 100 మిలియన్‌ టన్నులకు చేరుకుంటుంది. కొత్తగా ఒడిశాలో ఏర్పాటు చేయనున్న నైనీతో పాటు విస్తరణ గనుల ద్వారా 28 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి అందుబాటులోకి రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు