logo
Published : 30/11/2021 03:21 IST

నిర్వహణ లేక.. నిరుపయోగంగా మారి

పట్టణ ప్రజల ఆరోగ్యంకోసం పురపాలక శాఖ ఆధ్వర్యంలో ఓపెన్‌ జిమ్‌లను ఏర్పాటు చేశారు. లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన పరికరాలు పర్యవేక్షణ, రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ఊడిపోతున్నాయి. ఫ్లాట్‌ఫాం మీద ఏర్పాటు చేసిన టైల్స్‌ దెబ్బతిని కసరత్తులు చేసేందుకు ఇబ్బందిగా మారింది. ప్రారంభించడంలో అధికారులు చూపించిన శ్రద్ధ నిర్వహణలో చూపెట్టడం లేదు. దీంతో వ్యాయామశాలలు ఏర్పాటు చేసినా నిరుపయోగంగా మారుతున్నాయి. పురపాలికల్లో ఓపెన్‌ జిమ్‌ల పరిస్థితులపై ‘న్యూస్‌టుడే’ పరిశీలన కథనం..


లోపించిన నాణ్యత

కోరుట్ల: కోరుట్ల పట్టణం కల్లూర్‌రోడ్‌లో మూడేళ్ల క్రితం రూ.10 లక్షలతో ఏర్పాటు చేసిన ఓపెన్‌ జిమ్‌ నిర్వహణ లోపంతో ఆధ్వానంగా మారింది. సిమెంట్‌ పుట్టింగ్‌ కుంగిపోవడంతో టైల్స్‌ దెబ్బతిన్నాయి. రబ్బర్‌ టైల్స్‌ లేచిపోవడంతోపాటు జిమ్‌ పరికరాలు కూలిపోయి ఊడిపోయాయి. పరికరాల ద్వారా కసరసత్తులు చేయడం ఇబ్బందిగా మారింది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల గ్రౌండ్‌లో టీయూఎఫ్‌ఐడీసీ రూ.15 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన ఓపెన్‌ జిమ్‌ను జూన్‌ 2021న ప్రారంభించారు. పరికరాల నిర్మాణ కోసం ఏర్పాటు చేసిన సిమెంట్‌ బెడ్‌ క్యూరింగ్‌ సక్రమంగా చేపట్టకపోవడంతో నాణ్యతలోపించింది. జిమ్‌ ప్రారంభ సమయంలోనే టైల్స్‌ పగిలిపోయి పరికరాలు వంగిపోయాయి. దెబ్బతిన్న పరికాలను సరిచేయించకుండా వదిలేశారు.  


ప్రతిపాదనల్లోనే..

ధర్మపురి: పట్టణంలో ప్రజా వ్యాయామశాల ప్రతిపాదనలకే పరిమితమైంది. రెండేళ్ల కిత్రం రూ.6 లక్షలను మంజూరు చేశారు. పట్టణంలో హన్‌మాన్‌ కూడలి వద్ద గల స్థలంలో వ్యాయామశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆరోగ్యం, ఆహ్లాదం అందించేలా ప్రణాళికను సిద్ధం చేశారు. నిధులు మంజూరైనా పనులు చేపట్టడానికి గుత్తేదారులు ముందుకురాకపోవడంతో పెండింగ్‌లో నిలిచిపోయింది. ఈ విషయంపై పుర కమిషనర్‌ రమేశ్‌ను వివరణ కోరగా ఓపెన్‌ జిమ్‌ నిర్మాణం కోసం చర్యలు చేపడుతూ.. పెండింగ్‌ పనులు పూర్తయ్యేలా చూస్తామని తెలిపారు.


ప్రజారోగ్యంపై పట్టింపేదీ?

రాయికల్‌ పట్టణం: రాయికల్‌ పట్టణం మేజర్‌ గ్రామ పంచాయతీ నుంచి పురపాలక సంఘంగా 2018లో ఏర్పడింది. పట్టణంలో 12 వార్డులకు గాను సుమారు 20 వేల జనాభా ఉంది. రాయికల్‌ పురపాలక సంఘం సమగ్ర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కోసం రూ.25 కోట్లు టీయూఎఫ్‌ఐడీసీ నిధులను మంజూరు చేశారు. ఒత్తిళ్ల నుంచి బయట పడడానికి, ఆరోగ్యంగా ఉండడానికి నేటి తరం అంతా ధ్యానం, యోగా, వ్యాయామం పైనే దృష్టి సారిస్తున్నారు. పట్టణంలో వివిధ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులపైనే చిన్నపాటి వ్యాయామాలు చేస్తున్నారు. అన్ని వసతులతో కూడిన వ్యాయామశాలను ఏర్పాటు చేస్తే ప్రజా ఆరోగ్యం వెల్లివిరుస్తుంది.


ఊడిపోతున్నాయి..

మెట్‌పల్లి పట్టణం: రెండేళ్ల క్రితం పట్టణంలోని అంబేడ్కర్‌ పార్కుతో పాటు మినీస్టేడియంలో బహిరంగ వ్యాయామశాలలు(ఓపెన్‌ జిమ్‌)లను ఏర్పాటు చేశారు. నిర్వహణ పట్టించుకోకపోవడంతో పరికరాలను గుర్తుతెలియని వారు తొలగించారు. ప్రస్తుతం స్టేడియంలో ఉన్న జిమ్‌ పరికరాలు చాలా వరకు ఊడిపోయాయి. జిమ్‌లో ఫ్లాట్‌ఫాం రబ్బర్‌ షీట్లను తొలగించడంతో అందహీనంగా కనిపిస్తుంది. అంబేడ్కర్‌ పార్కులోని జిమ్‌లో పరికరాలు ఊడిపోయాయి. బల్దియా ఆధ్వర్యంలో రెండు జిమ్‌ల ఏర్పాటుకు అధికారులు స్థలాలను గుర్తించారు.  


శిక్షకులను ఏర్పాటు చేస్తే ప్రయోజనం

జగిత్యాల క్రీడావిభాగం: పట్టణంలో ఆరు ప్రాంతాల్లో ఓపెన్‌ జిమ్‌లను ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఖిలాగడ్డ, శ్రీవివేకానంద మైదానంలోని ఓపెన్‌ జిమ్‌ల వద్ద సందడి నెలకొంది. యువత, మధ్య వయస్కులతో పాటు, చిన్న పిల్లలు సైతం వ్యాయామం చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేయకపోవడంతో చీకట్లోనే అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు శిక్షకులు లేకపోవడం ప్రధాన ఆటంకంగా మారింది. వ్యాయామం చేసేవారు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ప్రొటీన్లు తదితర పౌష్టికాహారంపై అవగాహన పెంపొందించే విధంగా అర్హత కలిగిన శిక్షకులను ఏర్పాటు చేస్తే ఆసక్తి కనబరిచే అవకాశం ఉంది.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని