logo
Published : 03/12/2021 02:38 IST

చేరింది ఒకచోట... చదువుతున్నది మరోచోట

టీసీ నిబంధన ఎత్తివేత ఫలితం

పాఠశాలకు వస్తున్న విద్యార్థినులు

* సిరిసిల్లలోని కుసుమ రామయ్య జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రవేశం పొందిన ఆరో తరగతి విద్యార్థిని ప్రస్తుతం గీతానగర్‌ జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతోంది. ఆ విద్యార్థిని తరగతులకు ఎందుకు రావడం లేదని ఉపాధ్యాయులు ఆరా తీయగా రెండు పాఠశాలల్లో ప్రవేశం పొందినట్లు తేలింది.
* సిరిసిల్లలోని గీతానగర్‌ జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రవేశం పొందిన నలుగురు పిల్లలు నెహ్రూనగర్‌ జిల్లా పరిషత్‌ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 8వ తరగతి వరకు టీసీ నిబంధన తీసేయడంతో విద్యార్థులు ఈ విధంగా ఒక పాఠశాలలో ప్రవేశం పొంది, ఇంకో బడిలో చదువుతున్నారు.

న్యూస్‌టుడే, సిరిసిల్ల (విద్యానగర్‌)

కరోనా కారణంగా అన్ని రంగాలు కుదేలయ్యాయి. ప్రజలు ఆర్థికంగా బలహీనపడ్డారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రభుత్వం టీసీ లేకుండానే ఆధార్‌ కార్డుతో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశం పొందేలా అనుమతించింది. దీంతో విద్యార్థులు ఒక పాఠశాలలో నమోదై ఇంకో బడికి వెళుతున్నారు. దీంతో ఉపాధ్యాయులు పిల్లల సంఖ్యను అంచనా వేయలేకపోతున్నారు.
ఒక పాఠశాల తమ విద్యార్థి వివరాలను ఛైల్డ్‌ ఇన్ఫో నుంచి తొలగిస్తేనే ఇంకో పాఠశాలలో నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. టీసీ నిబంధన లేకపోవడంతో విద్యార్థులు ఒక బడిలో ప్రవేశం పొంది మరోచోట విద్యనభ్యసిస్తున్నారు. ఆధార్‌ కార్డుతో చేర్చుకొని పాఠాలు బోధిస్తున్న పాఠశాల, తమ విద్యార్థుల పేరును తొలగించాలని పూర్వపు పాఠశాలకు రిక్వెస్ట్‌ పెట్టినప్పటికీ వారు స్పందించడం లేదు. ప్రభుత్వం గడువు తేదీ నిర్ణయించకపోవడంతో యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఫీజులు వసూలు చేసుకోవాలని ప్రైవేట్ పాఠశాలలు, విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపించుకోవడానికి, ఇతర కారణాలతో ప్రభుత్వ పాఠశాలలు పిల్లల వివరాలను ఛైల్డ్‌ ఇన్ఫో నుంచి తొలగించడం లేదు. ఇటువంటి సందర్భంలో మండల్‌ రిసోర్స్‌ సెంటర్‌ (ఎంఆర్‌సీ) వారైనా వారం రోజుల్లోగా వివరాలను పాత పాఠశాల నుంచి తొలగించాలి. కానీ వారూ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఛైల్డ్‌ ఇన్ఫోనకు, పాఠశాల హాజరు రిజిస్టర్‌కు పొంతన ఉండటం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

  ఇంకా అయిదుగురు రావాల్సి ఉంది
-అనురాధ, నెహ్రూనగర్‌ జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని

ప్రస్తుతం మా పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల పూర్వపు పాఠశాల వివరాలు, మా  బడిలో నమోదై తరగతులకు రాని వారి వివరాలు సేకరిస్తున్నాం. ఇంకా అయిదుగురు  రావాల్సి ఉంది. టీసీ నిబంధన లేకపోవడంతో ఒక పాఠశాలలో నమోదై మరోచోట చదువుతున్నారు. దీంతో ఛైల్డ్‌ ఇన్ఫోలో విద్యార్థుల వివరాలు నమోదు చేసే అవకాశం లేకుండా పోతుంది.
ప్రైవేటు పాఠశాలలకు ఇబ్బందులు
-శ్రీనివాస్‌గౌడ్‌, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు

ప్రభుత్వం టీసీ నిబంధన తొలగించడంతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. టీసీ లేకపోవడం వల్ల పూర్వపు పాఠశాలలో విద్యార్థి వ్యక్తిగత వివరాలకు, నూతన బడిలోని వివరాలకు పొంతన ఉండదు. భవిష్యత్తులో స్టడీ సర్టిఫికేట్స్‌ కావాల్సినప్పుడు పిల్లలు కూడా ఇబ్బందులు పడతారు. అదేవిధంగా ఆధార్‌కార్డులో వివరాలు తరచూ మార్చుకోవాల్సి వస్తుంది.
  పరిశీలన చేయిస్తున్నాం
- డి.రాధాకిషన్‌, జిల్లా విద్యాధికారి

పాఠశాలల యాజమాన్యాలు సహకరించాలి. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల స్థోమతకు తగ్గట్టుగా ఫీజుకు రాజీ పడి టీసీలు ఇవ్వాలి. జిల్లాలో జరుగుతున్న ఈ సంఘటనలపై వెరిఫికేషన్‌ చేయిస్తున్నాం. ఇబ్బందులు లేకుండా చూస్తాం. ఏదో ఒక పాఠశాలలోనే విద్యార్థుల పేరు ఉండేలా చూస్తాం.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని