logo

మరుగుదొడ్ల వినియోగంపై సర్వే

పల్లెల్లో సంపూర్ణ పారిశుద్ధ్యం అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ఆధ్వర్యంలో ఇంటికో వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించడమే కాకుండా వినియోగించుకునేలా ప్రజల్లో చైతన్యం కల్పిస్తోంది. జనావాసాల్లోని వృథానీటిని ఎక్కడికక్కడే భూమిలోకి ఇంకించేలా ఇంకుడు గుంతల నిర్మాణానికి పెద్దపీట వేస్తోంది.

Published : 18 Jan 2022 02:34 IST

● మండలానికి రెండు గ్రామాలు ఎంపిక


సర్వే వివరాలు సేకరిస్తున్న సిబ్బంది

పెద్దపల్లి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: పల్లెల్లో సంపూర్ణ పారిశుద్ధ్యం అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ఆధ్వర్యంలో ఇంటికో వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించడమే కాకుండా వినియోగించుకునేలా ప్రజల్లో చైతన్యం కల్పిస్తోంది. జనావాసాల్లోని వృథానీటిని ఎక్కడికక్కడే భూమిలోకి ఇంకించేలా ఇంకుడు గుంతల నిర్మాణానికి పెద్దపీట వేస్తోంది. అపరిశుభ్ర వాతావరణంతోనే వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు నిధులను ఖర్చు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్య చర్యలపై జాతీయ కుటుంబ ఆరోగ్యసర్వే ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర స్థాయిలో సర్వేచేయాలని వారం రోజుల రోజుల క్రితం ఆదేశించింది. మండలానికి రెండు గ్రామాలను ఎంపికచేసి ఇరవై ఇళ్లలో సమాచారం సేకరించాలని సూచించింది. జిల్లాలో 13 గ్రామీణ మండలాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో సర్వే తుదిదశకు చేరింది.

ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా...

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి, ఇంకుడుగుంత నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తున్నారు. చాలాచోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లు అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. నిరాక్షరాస్యత, అవగానరాహిత్యంతో వినియోగించడంలేదు. ఫలితంగా బహిరంగ మలమూత్ర విసర్జన చేయడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. రూ.కోట్ల నిధులు ఖర్చైనా ప్రభుత్వ ఆశయం నెరవేరడంలేదు. దీంతో పల్లెల్లో పారిశుద్ధ్యం, ప్రజల ఆరోగ్యంపై ప్రతిఏటా జాతీయ స్థాయిలో దీనిని చేపడుతున్నారు. ఇందులో తేలిన లోపాలను సరిదిద్దుకోనున్నారు.

వివరాల సేకరణ ఇలా...

జిల్లాలో 1,30,500 కుటుంబాలు ఉండగా 1,28,563 వ్యక్తిగత మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయి. 13 గ్రామీణ మండలాల్లో రెండు గ్రామాల చొప్పున ఎంపిక చేశారు. ఎంపీడీవో, ఎంపీవో పర్యవేక్షణలో సర్వే కొనసాగుతోంది.

● ఎంపికైన గ్రామాల్లో ఇరవై ఇళ్లలో వివరాలను సేకరించాలి. ఇంటిలో అసలు మరుగుదొడ్డి ఉందా? వాటిని వినియోగిస్తున్నారా? ఇంకుడు గుంత ఉందా? ఇళ్లకు మురుగు కాలువ దగ్గరలో ఉందా? అనే వివరాలను నమోదు చేస్తున్నారు.

● గ్రామంలో చెత్త సేకరణ ఎలా ఉంది? చెత్తను ఎక్కడికి తరలిస్తున్నారు? డంపిగ్‌ యార్డు, సెగ్రిగేషన్‌ షెడ్డు నిర్మించారా? వీటిని వినియోగిస్తున్నారా? సెగ్రిగేషన్‌ షెడ్డు వాడుకోవడంతో అదనపు ఆదాయం లభిస్తుందా? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.

● జాతీయ స్థాయిలో సర్వే నిర్వహణ బాధ్యతలు స్థానిక అధికారులకు అప్పజెప్పడంపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఈసర్వే చేసేది. స్థానిక అధికారులు సర్వే చేయడంతో వాస్తవాలు వెలుగులోకి రావడంలేదనే విమర్శలున్నాయి. గ్రామంలో అన్ని వనరులు ఉన్న ఇళ్ల వద్దకు వెళ్లి సర్వే చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.


క్షేత్రస్థాయిలో పక్కాగా...

- రాఘవులు, స్వచ్ఛభారత్‌ మిషన్‌ జిల్లా సమన్వయకర్త

జిల్లాలో పక్కాగా సర్వే చేస్తున్నాం. ఎంపిక చేసిన గ్రామంలో అధికారులు వాస్తవ పరిస్థితిని సేకరిస్తున్నారు. అన్ని మండలాల్లో వివరాల సేకరణ పూర్తయింది. నివేదిక పంపిస్తున్నారు. పూర్తి సమాచారం వచ్చిన వెంటనే ఉన్నతాధికారులకు నివేదించనున్నాం.


జిల్లాలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే స్వరూపం

గ్రామీణ మండలాలు: 13

ఎంపికైన గ్రామాలు: 20

జిల్లా జనాబా(2011 ఆధారంగా): 4,91,319

జిల్లాలో కుటుంబాలు: 1,30,500

వ్యక్తిగత మరుగుదొడ్లు: 1,28,563

ఇంకుడుగుంతలు: 52,745

సెగ్రిగేషన్‌ షెడ్లు: 266


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని