logo

పట్టించుకుంటేనే పంటలకు దన్ను

జిల్లాకు సాగునీరందించే శ్రీరాంసాగర్‌ జలాశయంలోకి వరదనీటిరాక ప్రారంభంకాగా నీటినిల్వ కనిష్ఠస్థాయికి చేరిన తరువాత ఆయకట్టుకు వదలనున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లోని కాలువల చివరి ఆయకట్టు క్రమంగా నీటిపారకానికి దూరమవుతోంది.

Published : 25 Jun 2022 06:42 IST

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు చివరి ఆయకట్టులో దుస్థితి
న్యూస్‌టుడే, జగిత్యాల వ్యవసాయం

లైనింగ్‌ దెబ్బతిన్న ప్రధాన కాలువ

జిల్లాకు సాగునీరందించే శ్రీరాంసాగర్‌ జలాశయంలోకి వరదనీటిరాక ప్రారంభంకాగా నీటినిల్వ కనిష్ఠస్థాయికి చేరిన తరువాత ఆయకట్టుకు వదలనున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లోని కాలువల చివరి ఆయకట్టు క్రమంగా నీటిపారకానికి దూరమవుతోంది. శ్రీరాంసాగర్‌ జలాశయం నుంచి కాలువనీళ్లు వస్తున్నా చివరి భూములకు నీరందక రైతులు పంటలను పూర్తిస్థాయిలో పండించలేకపోతున్నారు. శ్రీరాంసాగర్‌ కాకతీయ ప్రధాన కాలువ జిల్లా నుంచే వెళ్తుండగా పలు డిస్ట్రిబ్యూటరీల ద్వారా ఉపకాలువలు, పిల్లకాలువల ద్వారా పంటలకు మళ్లిస్తారు. ప్రధాన కాలువతో పాటుగా డిస్ట్రిబ్యూటరీలు, ఇతర కాలువల లైనింగ్‌ చాలాచోట్ల దెబ్బతినగా చెట్లు పెరగటం, షట్టర్లు, కట్టలు శిథిలంకావటం తదితర కారణాలతో కాలువల్లో నీటి తరలింపు సామర్థ్యం తగ్గింది. 9 వేల క్యూసెక్కుల సామర్థ్యంగల కాకతీయ కాలువలోనే ప్రస్తుతం 6 వేల క్యూసెక్కులకు మించి నీటిని తరలిస్తే గండ్లు పడుతుండటంతో తక్కువనీటినే వదులుతున్నారు. యూటీలు, డ్రాపులు, సూపర్‌ ప్యాసేజ్‌లు, అక్విడెక్టులు తదితర నిర్మాణాలు దెబ్బతినటంతో ఏ కాలువనిండా నీటిని తరలించలేని పరిస్థితి తలెత్తింది. కాలువల్లో నిండుగా నీటిని వదలకపోగా ఉన్ననీటిని మోటార్ల ద్వారా పంటలకు పారిస్తుండటంతో జిల్లాలో దాదాపుగా 39 వేల ఎకరాల చివరి ఆయకట్టుకు నీరందని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రూ.92 కోట్లతో చేపట్టిన పనులను పూర్తిచేయటం, ఇంకనూ 70 వరకు పనులకు నిధులను కేటాయించి సకాలంలో చేపడితేనే ఆయకట్టులో పంటలకు సాగునీటి దన్ను కలుగుతుంది.
 చేపట్టాల్సినవి
* వర్షాల సంధికాలంలో నిర్మాణాలు, మరమ్మతులను చేపట్టాలి, వరదకాలువ నుంచి కాకతీయ కాలువలోకి నీటిని తరలించేలా మల్యాల మండలంలో చేపట్టిన అనుసంధాన కాలువ నిర్మాణాన్ని, ఇతర మరమ్మతు పనులను పూర్తిచేయాలి.
* అన్ని ప్రాంతాల్లోనూ పరాధీనమైన ప్రాజెక్టు భూములను స్వాధీనం చేసుకుని అన్నికాలువలకు లైనింగ్‌ చేపట్టాలి. దెబ్బతిన్న నిర్మాణాలకు మరమ్మతులు చేయటం, నూతనంగా నిర్మించి చివరిభూముల వరకు నీటిని తరలించేలా చూడాలి.
* రోళ్లవాగు ప్రాజెక్టును రూ.62 కోట్లతో ఆధునికీకరిస్తున్నా దీనికి ఎస్సారెస్పీ నీటితోనే నింపాల్సి ఉంటుంది. ఎస్సారెస్పీ నిండని సందర్భాల్లో 2.5 టీఎంసీల సామర్థ్యం కలిగిన రోళ్లవాగులోకి గోదావరి నీటిని ఎత్తిపోసేలా బీర్‌పూర్‌ మండలం రంగసాగర్‌వద్ద ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలి.
్య ప్రధాన కాకతీయ కాలువతో పాటుగా వరదకాలువనుంచి చెరువులు, కుంటల్లోకి నీటిని తరలించే తూములు, కాలువల నిర్మాణాన్ని పూర్తిచేయాలి. గొలుసుకట్టు చెరువుల్లోకి నీటిని తరలిస్తే భూగర్భ జలమట్టం పెరిగి పంపుసెట్లద్వారానూ నీటిని పారించవచ్చు.
* గోదావరి నుంచి జిల్లాలోని 26 గ్రామాలకు తలపెట్టిన ఎత్తిపోతల పథకాలను పూర్తిచేయాలి. ఇదివరకున్న పథకాలకు మరమ్మతులు జరపటంతో పాటుగా ఎత్తిపోతలను పొడిగిస్తే ఆయకట్టేతర మండలాలకూ ప్రయోజనం కలుగుతుంది. వాగులపై తలపెట్టిన 75 చెక్‌డ్యాంల నిర్మాణాన్ని పూర్తిచేయాలి.
* గతంలో మాదిరిగా సాగునీటి సంఘాలను నియమించి వీటికి కాలువలు, చెరువుల నిర్వహణ, ఆజమాయిషీ, స్థానిక మరమ్మతుల బాధ్యతలను అప్పగించాలి. జిల్లాలోని అన్ని వ్యవసాయ సంబంధిత పనులకు నిధులను కేటాయించి అదనులో నిర్మాణ పనులను పూర్తిచేస్తే రైతులకు మేలు కలుగుతుంది.


  శ్రీరాంసాగర్‌ గరిష్ఠ నీటినిల్వ 90.313 టీఎంసీలు
   ప్రస్తుతమున్న నీటినిల్వ 21.233 టీఎంసీలు
   ఎస్సారెస్పీకి వస్తున్న ఇన్‌ఫ్లో 4,514 టీఎంసీలు
   జిల్లాలో మొత్తం ఆయకట్టు 1.63 లక్షల ఎకరాలు
  చివరికి నీరందని ఆయకట్టు 39 వేల ఎకరాలు
  ఇటీవల మరమ్మతులకు వెచ్చింపు రూ. 92 కోట్లు
   మరమ్మతులు పూర్తయినవి 63 శాతం
   అవసరమున్న మరమ్మతులు 70 పనులు


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని