logo

కాసులు కురిపించిన కార్తికం

దక్షిణకాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి కార్తిక మాసం కాసులు కురిపించింది.

Updated : 26 Nov 2022 06:33 IST

నెలలో రాజన్న ఆలయ ఆదాయం రూ. 8.25 కోట్లు
న్యూస్‌టుడే, వేములవాడ

రాజన్న ఆలయం

దక్షిణకాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి కార్తిక మాసం కాసులు కురిపించింది. నెల రోజులకు రూ.8,25,45,228ల ఆదాయం సమకూరింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది కాస్త తగ్గినా రూ.కోట్లలో రావడం ఊరటనిచ్చింది.

కార్తిక మాసం సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల భక్తులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ మాసం మొత్తం రోజూ ఆలయంలో సందడి నెలకొంది. కార్తిక మాసంలో (26.10.2022 నుంచి 22.11.2022 వరకు) ఆలయంలోని వివిధ విభాగాల ద్వారా భారీగానే ఆదాయం వచ్చింది. కార్తికంలో స్వామివారిని దర్శించుకునేందుకు ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. శుక్ర, ఆది, సోమవారాల్లో 50 వేల మంది పైగా వచ్చారు. కొన్ని సోమవారాల్లో 60 వేల మంది పైగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మిగతా రోజుల్లోనూ పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకొని వివిధ పూజా కార్యక్రమాలలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు హుండీలల్లో నగదు, బంగారం, వెండి వస్తువులను కానుకల రూపంలో వేశారు. ఆలయంలో జరిగే కల్యాణాలు, కేశ ఖండనం, అభిషేక, అన్నపూజలు, కుంకుమ పూజ కార్యక్రమాల్లో భారీగా పాల్గొన్నారు. ముఖ్యంగా శ్రీరాజరాజేశ్వరస్వామి అభిషేక ప్రియుడు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు అభిషేక పూజలను చేయించి మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్నకు అత్యంత ప్రీతిపాత్రమైన కోడె మొక్కులను వేలాది మంది చెల్లించుకున్నారు. నెల మొత్తం వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులతో సందడి నెలకొంది. గత ఏడాది కార్తిక మాసంలో కంటే ఈ ఏడాది ఆదాయం కొంత తగ్గింది. గత ఏడాది రూ.8,94,61,011లు సమకూరగా ఈ ఏడాది రూ.8,25,45,228లు వచ్చింది. గత ఏడాదితో పోల్చితే ఈసారి ఆలయ హుండీ, ప్రసాదాలు, కోడె మొక్కులు ద్వారా ఆలయానికి ఆదాయం భారీగానే వచ్చినా మొత్తంగా చూస్తే మాత్రం రూ.69,15,783 తగ్గింది.


భక్తులు అధికంగా వచ్చినా...

- నవీన్‌, ఏఈవో, రాజన్న ఆలయం

కార్తిక మాసంలో ఆలయానికి గత ఏడాది కంటే కొంత ఆదాయం తగ్గింది. స్వామివారి దర్శనానికి భక్తులు అధికంగా వచ్చినప్పటికీ వివిధ విభాగాల ద్వారా రావాల్సిన ఆదాయం కొంత తగ్గింది. గత ఏడాది కంటే ఈసారి కార్తిక మాసంలో రూ.69 లక్షల వరకు తగ్గింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని