logo

ఉక్కపోతతో తల్లీబిడ్డల ఉక్కిరిబిక్కిరి

భానుడి భగభగలకు ఉదయం 9 గంటలు దాటితే ఇళ్ల నుంచి బయటకు రావడానికి జనం భయపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎండలు 40 డిగ్రీల కంటే అధికంగానే ఉంటున్నాయి.

Published : 20 Apr 2024 05:02 IST

కరీంనగర్‌ ఎంసీహెచ్‌లో ఇబ్బందులు
దాతలు ముందుకొస్తే ఉపశమనం

ఇంటి నుంచి తెచ్చుకున్న ఫ్యాన్లతో బాలింతలు

న్యూస్‌టుడే, కరీంనగర్‌ సంక్షేమ విభాగం: భానుడి భగభగలకు ఉదయం 9 గంటలు దాటితే ఇళ్ల నుంచి బయటకు రావడానికి జనం భయపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎండలు 40 డిగ్రీల కంటే అధికంగానే ఉంటున్నాయి. కరీంనగర్‌ మాతా, శిశు ఆసుపత్రిలో పరిస్థితి దారుణంగా ఉంది. బాలింతలు శిశువులు ఉక్కపోతతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఒక్కో బాలింత వద్దకు బంధువులు ఇద్దరు, ముగ్గురు వస్తుండడంతో వార్డు మొత్తం ఉక్కపోతతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా మారుతోంది. వార్డులలో రెండు పడక మంచాలకు కలిపి ఒక్క ఫ్యాన్‌ ఉండడంతో అది సరిపోక ఇంటి నుంచి పంకాలు తెచ్చుకుంటున్నారు. నల్గొండ జిల్లా ఆసుపత్రిలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏసీలు బిగించారు. మన వద్ద పాలకులు, దాతలు స్పందించి ఏసీలు, కూలర్లు అందిస్తే బాగుంటుందని గర్భిణులు, బాలింతలు కోరుతున్నారు.

స్వచ్ఛమైన గాలి లేకపోతే..

కరీంనగర్‌ మాతా, శిశు ఆరోగ్య కేంద్రానికి ప్రతి రోజు 200కు పైగా గర్భిణులు ఓపీకి వస్తుంటారు. ఇక్కడ స్థలం తక్కువగా ఉండడం ఓపీ ఎక్కువగా ఉండటంతో ఫ్యాన్ల గాలి సరిపోవడం లేదు. ఆసుపత్రి ఫైల్‌నే విసనకర్రలా వాడుతున్నారు. గర్భిణులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతుంటారు. అందులో స్వచ్ఛమైన గాలి చల్లగా లేకపోతే వారి పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. నాలుగు బాలింతల వార్డులలో ఎప్పుడు 100 మందికిపైగా ఉంటారు. సాధారణ ప్రసవమైన వారు మూడు రోజులకు ఇంటికి వెళ్తుండడంతో వాళ్లకు ఇబ్బంది ఏమి ఉండదు. శస్త్రచికిత్స చేసిన మహిళలు ఏడు రోజులు ఆసుపత్రిలో ఉండాలి. ఉక్కపోతకు వార్డులో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఉక్కపోత కారణంగా కుట్లు మానకపోగా, చెమటతో ఇన్‌ఫెక్షన్‌ వచ్చే ప్రమాదముంది.

నల్గొండ కావాలి ఆదర్శం

నల్గొండ జిల్లా మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలో ఎండ వేడికి బాలింతల ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని గుర్తించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాలింతల వార్డులకు 32 ఏసీలను ఏర్పాటు చేయించారు. ఇక్కడి పాలకులు, స్వచ్ఛంద సంస్థలు నాయకులు స్పందిస్తే ఇక్కడ గర్భిణులు, బాలింతలకు కొంత ఉపశమనంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఆసుపత్రిలోని వార్డులలో నాలుగు ఏసీలతోపాటు పది కూలర్లు అవసరం ఉన్నాయి.

చిన్నారుల అవస్థలు

వార్డుల్లో బాలింతలతోపాటు ముక్కుపచ్చలారని శిశువులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రెండు మంచాలకు కలిపి ఒక ఫ్యాన్‌ ఉండడంతో పలువురు ఇళ్ల నుంచి తెచ్చుకుంటున్నారు. విపరీతమైన వేడితో శిశువులు ఇబ్బందిపడుతున్నారు. బాలింతలకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని దాతలెవరైనా ముందుకొస్తే ఏసీలు, కూలర్లు ఏర్పాటు చేస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్‌  వీరారెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని