logo

లక్ష ఓట్ల ఆధిక్యం కాంగ్రెస్‌ లక్ష్యం

‘ప్రతి ఇంటికి వెళ్లండి.. చేసిన ప్రగతిని చెప్పండి.. కరీంనగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావుకు లక్ష ఓట్ల ఆధిక్యతను అందించాలి’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

Updated : 01 May 2024 07:15 IST

జమ్మికుంట సభలో సీఎం రేవంత్‌

రాజేందర్‌రావును గెలిపించాలని కోరుతున్న రేవంత్‌రెడ్డి

కరీంనగర్‌ (ఈనాడు), జమ్మికుంట, హుజూరాబాద్‌, గ్రామీణం, పట్టణం (న్యూస్‌టుడే) : ‘ప్రతి ఇంటికి వెళ్లండి.. చేసిన ప్రగతిని చెప్పండి.. కరీంనగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావుకు లక్ష ఓట్ల ఆధిక్యతను అందించాలి’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మంగళవారం హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని జమ్మికుంటలో నిర్వహించిన జనజాతర బహిరంగ సభకు సీఎం హాజరవడం హస్తం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. సీఎం హోదాలో తొలిసారి రేవంత్‌రెడ్డి రావడంతో నాయకులు, కార్యకర్తలు సభను విజయవంతం చేసేందుకు శ్రమించారు. ఎండలు మండుతుండటంతో జనాల తరలింపుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. జమ్మికుంటలో దారి పొడుగునా స్వాగత తోరణాలతోపాటు పెద్దఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సభాస్థలిలో భారీ కటౌట్‌లు ప్రత్యేకాకర్షణగా నిలిచాయి.

సభకు హాజరైన జనం


సైడ్‌లైట్స్‌

  • హెలికాప్టర్‌లో జమ్మికుంటకు వచ్చిన సీఎం సభా వేదికపైకి సాయంత్రం 4 గంటలకు వచ్చారు.
  • నియోజకవర్గ ఇన్‌ఛార్జి వొడితల ప్రణవ్‌తోపాటు వేదికపై ఉన్నవారు సీఎంకు కండువాలు కప్పారు.
  • సీపీఐ, సీపీఎం నాయకులు, మహిళా కాంగ్రెస్‌ నేతలు సీఎంకు పుష్పగుచ్ఛాలనిచ్చారు.
  • బిజిగిరిషరీఫ్‌ దర్గా, ఇల్లందకుంట సీతారామాలయాల అభివృద్ధికి నిధులివ్వాలని ప్రణవ్‌ సీఎంని కోరారు.
  • స్థానిక ఎమ్మెల్యే అనుచరులు కబ్జాలకు పాల్పడుతున్నారని సమ్మిరెడ్డి వినతిని అందించారు.
  • కనుగులకు చెందిన న్యాయవాది సంజీవరెడ్డి సీఎం సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.
  • మానకొండూర్‌ ఎమ్మెల్యేగా కవ్వంపల్లి సత్యనారాయణ బదులుగా ఆరెపల్లి మోహన్‌ అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేర్కొనడంతో సభికులు ఆశ్చర్యపోయారు.

చేసిన అభివృద్ధిని చెప్పి ఓట్లడగండి

భాజపా అభ్యర్థి బండి సంజయ్‌ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చెప్పి ఓట్లు అడగాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. తాను ఎంపీగా ఉన్న సమయంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. భార్య పుస్తెల తాడును అమ్మి ఎన్నికల్లో గెలిచానని చెప్పిన సంజయ్‌కు కోట్లాది రూపాయలు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన నాయకుడు రేవంత్‌రెడ్డి అని కొనియాడారు. భాజపా పదేళ్ల పాలనలో సామాన్యుడికి ఒరిగిందేమీ లేదన్నారు. మోదీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయన్నారు. బండి సంజయ్‌ను ఓడించి తనను గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన విప్‌ ఆది శ్రీనివాస్‌, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, నాయకులు కేకే మహేందర్‌రెడ్డి, ఆరెపల్లి మోహన్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, సీపీఎం జిల్లా క్యారదర్శి వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని