logo

రైతుల చెంతకు రాజన్న కోడెలు

దక్షిణకాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామికి భక్తులు సమర్పించే కోడెలను అర్హులైన రైతులకు ఉచితంగా అందించేందుకు ఆలయ అధికారులు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.

Published : 03 May 2024 03:15 IST

కార్యాచరణ రూపొందిస్తున్న ఆలయ అధికారులు

తిప్పాపూర్‌లోని రాజన్న గోశాలలో కోడెలు

న్యూస్‌టుడే, వేములవాడ: దక్షిణకాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామికి భక్తులు సమర్పించే కోడెలను అర్హులైన రైతులకు ఉచితంగా అందించేందుకు ఆలయ అధికారులు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయమై ఆలయ అధికారులు దేవాదాయశాఖ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపారు. ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలను ఆలయ అధికారులు రూపకల్పన చేస్తున్నారు.

రాజన్న ఆలయం కోడె మొక్కులకు ప్రసిద్ధి. స్వామివారిని దర్శించుకున్న భక్తుల్లో ఎక్కువ మంది కోడె మొక్కులు చెలించుకుంటారు. కొందరు ఇంటి వద్ద పెంచినవి, ఇతరుల వద్ద కొనుగోలు చేసిన కోడెలను స్వామివారికి సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. వీటిని ఆలయానికి చెందిన తిప్పాపూర్‌ గోశాలలో సిబ్బంది సంరక్షిస్తుంటారు. ప్రస్తుతం గోశాలలో వేయికి పైగా కోడెలు, ఆవులున్నాయి. జనవరికి ముందు ఈ గోశాల నుంచి రాష్ట్రంలోని వివిధ గోశాలలకు కోడెలను రాష్ట్ర గోశాల ఫెడరేషన్‌ ద్వారా అందజేసేవారు. ఈ గోశాల నుంచి ఇతర గోశాలలకు పంపిణీ చేస్తున్న కోడెలు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు వచ్చాయి. జనవరిలో మహబూబాబాద్‌ జిల్లా తొర్రూర్‌ మండలంలో దుబ్బతండా గోశాలకు వ్యాన్‌లో తరలిస్తున్న 20 కోడెలకు బదులు 24 కోడెలు ఉండటంతో అవి పక్కదారి పడుతున్నాయనేది స్పష్టమైంది. అప్పటి నుంచి రాజన్న కోడెలను అర్హులైన రైతులకు అందించాలనే డిమాండ్‌ ప్రజల నుంచి వచ్చింది. మరోవైపు రాజన్న గోశాల నుంచి ఇతర గోశాలలకు కోడెలను అందజేసే కార్యక్రమాన్ని ఆలయ అధికారులు నిలిపివేశారు. దీంతో గోశాలలో కోడెల సంఖ్య భారీగా పెరిగిపోయింది. దీంతో మేత, వసతి, వైద్యం వంటివి పూర్తి స్థాయిలో అందక చాలా వరకు బక్కచిక్కిపోయాయి. కొన్ని అనారోగ్యంతో మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. ఇటీవల దేవాదాయశాఖ కమిషనర్‌ హనుమంతురావు గోశాలలను పరిశీలించి వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులను ఆదేశించడంతో ప్రత్యేక చర్యలకు అధికారులు ఉపక్రమించారు.


అధికారులతో కమిటీ ఏర్పాటు

భక్తులు రాజన్నకు సమర్పించిన కోడెలను అర్హులైన రైతులు, ఇతర గోశాలలకు పంపిణీ చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో రెవెన్యూ, పోలీస్‌, పశు సంవర్థకశాఖ, ఆలయ అధికారితో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించి అర్హులైన వారికి పంపిణీ చేసేందుకు ఈ కమిటీ రైతుకు సంబంధించిన పూర్తి వివరాలను క్షేత్ర స్థాయిలో సేకరించనుంది. తరవాత అర్హులైన వారిని గుర్తించి ఎంపిక చేసిన రైతుల ఆధార్‌ కార్డు, సంతకాలు సేకరించిన తరవాత కోడెలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు విక్రయించకుండా ఒప్పందం పూర్తి చేసిన తరవాత అందజేయనున్నారు. పంపిణీ చేసే ప్రతి కోడెకు ట్యాగ్‌ తప్పనిసరిగా అమర్చి రైతులకు పంపిణీ చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రైతులు తీసుకెళ్లిన తరవాత వాటి పర్యవేక్షణపై నిఘా పెట్టనున్నారు. దీంతో పాటు తక్కువ మొత్తంలో నిబంధనలకు లోబడి ఉన్న ఇతర గోశాలలకు అగ్రిమెంట్‌ ప్రకారం కోడెలను అందజేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఈ కార్యక్రమం కార్యరూపం దాల్చనుందని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు.


ఆదేశాలు రాగానే...

- కృష్ణ ప్రసాద్‌, రాజన్న ఆలయం, వేములవాడ

దేవాదాయశాఖ కమిషనర్‌ నుంచి ఆదేశాలు రాగానే అర్హులైన రైతులకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే రైతులకు ఉచితంగా కోడెలు పంపిణీకి సంబంధిత కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపించాం. పూర్తి స్థాయిలో గైడ్‌లెన్స్‌ రాగానే పంపిణీ కార్యక్రమం జరుగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని