logo

రూ.12.50 లక్షల నగదు పట్టివేత

జగిత్యాల పట్టణంలోని వివిధప్రాంతాల్లో బుధవారం పోలీసులు తనిఖీలు నిర్వహించి సరైన పత్రాలు లేని రూ.9.20 లక్షలను పట్టుకున్నారు.

Published : 09 May 2024 04:42 IST

జగిత్యాల, న్యూస్‌టుడే: జగిత్యాల పట్టణంలోని వివిధప్రాంతాల్లో బుధవారం పోలీసులు తనిఖీలు నిర్వహించి సరైన పత్రాలు లేని రూ.9.20 లక్షలను పట్టుకున్నారు. తహసీల్‌చౌరస్తాలో బీర్‌పూర్‌ మండలం మంగెళ గ్రామానికి చెందిన గుర్రం రాజేశం వద్ద రూ.2.50 లక్షలు, పాతబస్టాండ్‌లో జగిత్యాలలో మండలం గొల్లపల్లికి చెందిన పుల్ల శివ వద్ద రూ.2.90 లక్షలు, కొత్తబస్టాండ్‌లో షేక్‌ సాదుల్ల వద్ద రూ.2 లక్షలు, జంబిగద్దె వద్ద సారంగాపూర్‌ మండలం లచ్చక్కపేటకు చెందిన కొలగాని సురేష్‌ వద్ద రూ.1.80 లక్షలు స్వాధీన పర్చుకున్నారు. మోచిబజార్‌లో గుండేటి శ్రీనివాస్‌ వద్ద రూ.28,800 విలువైన టీషర్టులను పట్టుకుని ఎన్నికల అధికారులకు అప్పగించినట్లు ఎస్సై మన్మదరావు తెలిపారు.  


మెట్‌పల్లి: మెట్‌పల్లి పట్టణంలో ఇద్దరి వద్ద రూ.3.30 లక్షలు పట్టుకున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. బుధవారం కొత్తబస్టాండ్‌ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్ర వాహనాలపై ఎలాంటి ఆధారాలు లేకుండా ఒకరు రూ.1.80 లక్షలు, మరొకరు రూ.1.50 లక్షలు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుకున్న నగదును ఎన్నికల గ్రీవెన్స్‌ కమిటీకి అప్పగించినట్లు తెలిపారు.


కరీంనగర్‌లో రూ.2.09 లక్షలు..

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: పార్లమెంటు ఎన్నికల సందర్భంగా చేపట్టిన వాహన తనిఖీల్లో ఒక వాహనదారు నుంచి రూ.2.09 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకటో ఠాణా సీఐ సరిలాల్‌ తెలిపిన ప్రకారం... నగరంలోని రాజీవ్‌చౌక్‌ వద్ద ఒకటో ఠాణా పోలీసుల వాహనాలు తనిఖీ చేశారు. తిలక్‌రోడ్డుకు చెందిన పెద్ది రాధాకృష్ణ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా పోలీసులు అతన్ని తనిఖీ చేయగా ఆ నగదు లభించింది. వాటికి సంబంధించి ఎలాంటి పత్రాలు చూపకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకొని త్రిమెన్‌ కమిటీకి అప్పగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని