logo

పుణ్యక్షేత్రం అభివృద్ధికి హామీ ఏది?

వేములవాడలో భాజపా ఎన్నికల సభకు వచ్చి రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్న ప్రధాని మోదీ దక్షిణ కాశీగా పేరొందిన ఆలయ అభివృద్ధికి మొండి చేయి చూపారని కరీంనగర్‌ భారాస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు.

Published : 09 May 2024 04:47 IST

రాంపూర్‌(కరీంనగర్‌), మానకొండూర్‌, న్యూస్‌టుడే: వేములవాడలో భాజపా ఎన్నికల సభకు వచ్చి రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్న ప్రధాని మోదీ దక్షిణ కాశీగా పేరొందిన ఆలయ అభివృద్ధికి మొండి చేయి చూపారని కరీంనగర్‌ భారాస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. కరీంనగర్‌లోని తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఆలయంతోపాటు జిల్లా అభివృద్ధికి ప్రధాని ఏమైనా హామీలు ఇస్తారని ప్రజలు ఆశించగా, ఒక్క రూపాయి నిధులను ప్రకటించలేదు. ఎంతో చరిత్ర గల ఈ పుణ్యక్షేత్రం గురించి సభలో ఒక సెకను కూడా మాట్లాడలేదు. ఒక్క హామీ ఇవ్వలేదు. కేంద్రం ప్రవేశపెట్టిన ప్రసాద్‌ పథకం కింద వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం ఆలయాలను చేర్చాలని నేను ఎంపీగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రికి విన్నవించా. భారాస ప్రభుత్వ హయాంలోనే వేములవాడలోని 32 ఎకరాల గుడి చెరువులో మట్టి నింపి రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేశాం. దేవుడి పేరుతో రాజకీయాలు చేసే ఎంపీ బండి సంజయ్‌ ఈ పుణ్యక్షేత్రం అభివృద్ధికి నిధులు ఇవ్వాలని ఎందుకు అడగలేదు. అభివృద్ధి గురించి ఆలోచించని ఎంపీ సంజయ్‌ కావాలా? నిత్యం అభివృద్ధికి తపన పడే వినోద్‌కుమార్‌ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలి’’. అని అన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీలు ఎల్‌.రమణ, భానుప్రసాదరావు, మేయర్‌ వై.సునీల్‌రావు, పౌరసరఫరాల సంస్థ మాజీ ఛైర్మన్‌ రవీందర్‌సింగ్‌, నాయకులు చల్ల హరిశంకర్‌, కార్పొరేషన్ల మాజీ ఛైర్మన్లు భూపతిరెడ్డి, అక్బర్‌, నాయకులు పి.అనీల్‌కుమార్‌, కుల్దీప్‌, వాజిద్‌, జి.హరిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


మానకొండూర్‌, శంకరపట్నం : మార్పు పేరుతో కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను మోసం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌ అన్నారు. మానకొండూర్‌, శంకరపట్నంలలో బుధవారం రాత్రి ఎమ్మెల్సీ రమణ, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌లతో కలిసి రోడ్‌ షోలు నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ తీసుకొచ్చిన మార్పుతో ఏ మండలంలో చూసినా పంటలు ఎండిపోయాయని.. భారాస హయాంలో ఏడాది పొడవునా నీళ్లు ఉండేవని వివరించారు.  భారాస జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, జడ్పీటీసీ సభ్యులు శ్రీనివాస్‌రెడ్డి, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని