logo

లోకాయుక్తకు మంచి రోజులు

లోకాయుక్త.. ఈ పేరు 2016 మార్చి వరకు ఓ సంచలనం. కర్ణాటక లోకాయుక్త స్ఫూర్తితో అన్నా హజారే వంటి నేత లోక్‌పాల్‌ బిల్లు కోసం దిల్లీలో ఆందోళన చేశారంటే ఆ సంస్థ సామర్థ్యం గురించి ప్రత్యేకంగా విశ్లేషణలు అవసరం లేదు. సామాజిక మాధ్యమం ఊసు లేని

Published : 12 Aug 2022 01:18 IST

 అవినీతిపరుల ఆటకట్టు సాధ్యమేనా?

ఈనాడు, బెంగళూరు : లోకాయుక్త.. ఈ పేరు 2016 మార్చి వరకు ఓ సంచలనం. కర్ణాటక లోకాయుక్త స్ఫూర్తితో అన్నా హజారే వంటి నేత లోక్‌పాల్‌ బిల్లు కోసం దిల్లీలో ఆందోళన చేశారంటే ఆ సంస్థ సామర్థ్యం గురించి ప్రత్యేకంగా విశ్లేషణలు అవసరం లేదు. సామాజిక మాధ్యమం ఊసు లేని సమయంలోనూ జస్టిస్‌ ఎన్‌.వెంకటాచల నేతృత్వంలో కర్ణాటక లోకాయుక్త జాతీయ స్థాయిలో సంచలనాలు సృష్టించింది. 1996 నుంచి పదేళ్ల పాటు వెంకటాచల నేతృతంలోని లోకాయుక్త విధానసౌధను కూడా విడిచిపెట్టకుండా అవినీతిపరుల ఆటకట్టించింది. ఆపై వచ్చిన జస్టిస్‌ సంతోశ్‌ హెగ్డే ఏకంగా ముఖ్యమంత్రిని కూడా జైలుకు పంపేంత స్థాయిలో అవినీతిని బట్టబయలు చేశారు. 2011 మార్చిలో బేలెకేరి-గోవా నౌకాశ్రయాల వద్ద అక్రమంగా తరలిస్తున్న ఇనుప ఖనిజాన్ని పట్టుకున్న జస్టిస్‌ సంతోశ్‌ హెగ్డే ఈ కేసులో రూపొందించిన నివేదికలో అతి పెద్ద తిమింగళాల పేర్లను జతచేశారు. ఈ అవినీతిలో భాగస్వామిగా తేలిన అప్పటి ముఖ్యమంత్రి బి.ఎస్‌.యడియూరప్ప ఏకంగా 23 రోజుల పాటు జైలులో ఉన్నారు. అప్పటి వరకు రాష్ట్రానికే పరిమితమైన లోకాయుక్త ఈ యడియూరప్ప కేసుతో జాతీయ స్థాయిలో సంచలన సంస్థగా మారుమోగింది.
 

* 1988 లోకాయుక్త చట్టం ప్రకారం ఈ సంస్థ ఎన్నికల కమిషనర్‌ మాదిరి స్వతంత్ర సంస్థ. ముఖ్యమంత్రి మొదలు ఏ ప్రజా ప్రతినిధినైనా విచారించే అధికారమున్న లోకాయుక్తను 2016లోని సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా నిర్వీర్యం చేసిందన్న ఆరోపణలు నేటికీ వినిపిస్తాయి. లోకాయుక్తకు ఉన్న సర్వాధికారాలను అవినీతి నిరోధక దళం (అనిద)కు బదిలీ చేయటం, లోకాయుక్తలో నమోదైన కేసులన్నీ అనిద నేతృత్వంలోనే విచారణ చేయాలంటూ నాటి సర్కారు చట్టసవరణ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశంతో ప్రజా ప్రతినిధులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఆదేశాలను సవాలు చేస్తూ అదే ఏడాది ఏప్రిల్‌లో హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి.

సుదీర్ఘ పోరాటాలు
ప్రభుత్వ అంగ సంస్థగా ఏర్పాటైన అనిదపై ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, పలు పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సామాజిక కార్యకర్త ఎస్‌.ఆర్‌.హిరేమఠ్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ, కర్ణాటక రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు రవి కృష్ణారెడ్డి వంటి వారు సుదీర్ఘకాలంగా 2016 ఆదేశాలు, అనిద అక్రమాలపై ఆందోళన చేశారు. లోకాయుక్తలో నమోదైన కేసులు, అందులోనూ ప్రజా ప్రతినిధులు, అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్పడిన అవినీతిపై రుజువులతో సహా గుర్తించి ఫిర్యాదు చేసినా వాటి విచారణలో అనిద నిర్లక్ష్యంగా వ్యహరిస్తోందని వీరంతా ఆరోపించారు. దాదాపు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే అనిద పని చేస్తుందంటూ హైకోర్టులో వాదనలు వినిపించాయి.
* అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే లోకాయుక్తను పునరుద్ధరిస్తామని భాజపా తమ 2018 ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది. ఎట్టకేలకు గురువారంతో తమ మాట నెరవేర్చుకుంది.


‘అనిద’ అధికారాలు రద్దు
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : అవినీతి నియంత్రణ దళం (అనిద) అధికారాలను రద్దు చేస్తూ కర్ణాటక ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇకపై కేసుల విచారణను అనిద స్వతంత్రంగా నిర్వహించడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. లోకాయుక్త అనుంధ సంస్థగా అనిద పని చేసేందుకు అవకాశం కల్పిస్తూ గురువారం ఆదేశాలు ఇచ్చింది. ఆ సంస్థ ఏర్పాటును ప్రశ్నిస్తూ బెంగళూరు న్యాయవాదుల సంఘం, సమాజ పరివర్తన సముదాయం దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని జస్టిస్‌ బి.వీరప్ప నేతృత్వంలోని పీఠం విచారించింది. లోకాయుక్తకు సమానమైన స్థానాన్ని ఇవ్వడంలో చట్టబద్ధత లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. లోకాయుక్త, ఉపలోకాయుక్తలను అర్హత ఆధారంగా నియమించాలని, కులం ఆధారంగా కాదని న్యాయమూర్తి సూచించారు. లోకాయుక్త చట్టాలను సవరించి, ఆ సంస్థకు ఎక్కువ అధికారాలను ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ధర్మాసనం అభిప్రాయపడింది. పులిలా ఉన్న లోకాయుక్తను కాగితం పులిలా చేశారంటూ పలు సంస్థలు ఆరోపించాయి. లోకాయుక్తకు పూర్తి అధికారాలు ఇచ్చిన సమయంలో అవినీతిపరులు వణికిపోయేవారని న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షుడు ఎ.పి.రంగనాథ్‌ గుర్తు చేశారు. లోకాయుక్తను నిర్వీర్యం చేసేందుకే అనిదను ఏర్పాటు చేశారని సమాజ పరివర్తన సముదాయం వ్యవస్థాపక ప్రతినిధి ఎస్‌.ఆర్‌.హీరేమఠ్‌ పలు సందర్భాల్లో ఆరోపించారు. అవినీతిపరులను బెదిరించి సొమ్ము చేసుకునేందుకే అనిదకు నేతృత్వం వహిస్తున్నారని జస్టిస్‌ హెచ్‌.పి.సందేశ్‌ గతంలో విమర్శించారు.



తీర్పు పాఠం చదివి చెబుతా
హైకోర్టు ఆదేశాల పూర్తి సారాంశం నాకు తెలియదు. ఆ ఆదేశాలను చదివిన తర్వాత స్పందిస్తా. ఏసీబీ రద్దు చేయటమంటే లోకాయుక్తకు పునరుజ్జీవం వచ్చినట్లు కాదు. ఈ విషయంలో కోర్టు తీర్పును స్వాగతించాల్సిందే.

- సిద్ధరామయ్య, విపక్ష నేత


సౌధను శుద్ధి చేయండి
విధానసౌధ మూడో అంతస్తును పరిశుభ్రం చేయండి. అనిదను రద్దు చేసినంత మాత్రాన అవినీతిని ఆటకట్టినట్లు కాదు. లోకాయుక్తతో అంతా మంచే జరుగుతుందని నేను భావించటం లేదు. అనిద ఏర్పాటు చేసినప్పుడే నేను దానిని వ్యతిరేకించా. నా ప్రభుత్వంలో ఆ సంస్థను రద్దు చేయాలని చూసినా సాధ్యపడలేదు. ముందు ప్రభుత్వంలోని అవినీతిని అడ్డుకోండి.    

   - కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి


మంచి అధికారులు అవసరం
 కేవలం అనిదను రద్దు చేయటమే కాదు.. లోకాయుక్త అధికారాలపైనా స్పష్టత అవసరం. మంచి అధికారులను నియమించే బాధ్యత కూడా కోర్టు తీసుకోవాలి. ప్రజా ప్రతినిధుల్లో ఆందోళన ఉన్నా అంతకంటే ఎక్కువగా ప్రజల మనోభావాలు ఎంతో అవసరం.

- జస్టిస్‌ సంతోష్‌హెగ్డే


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని