logo

‘కన్నడలోనే ప్రాథమిక విద్య’

కర్ణాటకలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలలో ఏడో తరగతి వరకు విద్యార్థులకు కన్నడ భాషను నేర్చుకోవడం తప్పనిసరి చేసేందుకు అనువుగా చట్టాన్ని రూపొందించాలని విశ్వ ఒక్కలిగర మహాసంస్థాన మఠం పీఠాధిపతి చంద్రశేఖరనాథ మహాస్వామి ప్రతిపాదించారు.

Published : 28 Nov 2022 02:52 IST

పునీత్‌ రాజ్‌కుమార్‌ చిత్రంపై పూలరేకులు
చల్లుతున్న ఎంపీ పి.సి.మోహన్‌

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : కర్ణాటకలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలలో ఏడో తరగతి వరకు విద్యార్థులకు కన్నడ భాషను నేర్చుకోవడం తప్పనిసరి చేసేందుకు అనువుగా చట్టాన్ని రూపొందించాలని విశ్వ ఒక్కలిగర మహాసంస్థాన మఠం పీఠాధిపతి చంద్రశేఖరనాథ మహాస్వామి ప్రతిపాదించారు. మాతృభాషలోనే విద్యాభ్యాసాన్ని ప్రారంభిస్తే ఇతర భాషలను త్వరగా నేర్చుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఆయా రాష్ట్రాల్లో ప్రజలు మాతృభాషలోనే ప్రాథమిక విద్యాభ్యాసం చేయడం తప్పనిసరి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. చామరాజపేట బి.ఎస్‌.వెంకటరామ్‌ కళాభవన్‌లో సమాజ సేవకుడు సునీల్‌ కుమార్‌ నేతృత్వంలో డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కూలి కార్మికులు, గూడ్సు ఆటో డ్రైవర్ల సంఘం, అహింద హక్కుల రక్షణ వేదిక ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. శిబిరంలో సేకరించిన రెండు వేల యూనిట్ల రక్తాన్ని రాష్ట్రోత్థాన రక్తనిధికి అందించారు. మాతృభాషలో విద్యాభ్యాసాన్ని పూర్తిచేసిన వారే సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నారని గుర్తు చేశారు. దేశంలో ఏటా ఐదు కోట్ల యూనిట్ల రక్తం అవసరం ఉండగా, 2.5 కోట్ల యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు లోక్‌సభ సభ్యుడు పి.సి.మోహన్‌ తెలిపారు. రక్తదాన శిబిరాలను ఎక్కువగా నిర్వహించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ విషయంపై అపోహలు తొలగించేందుకు వైద్యులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. బెంగళూరు దక్షిణ లోక్‌సభ నియోజకవర్గ సభ్యుడు తేజస్వి సూర్య, చిక్కపేట ఎమ్మెల్యే ఉదయ్‌ గరుడాచార్‌, బెంగళూరు దక్షిణ జిల్లా భాజపా అధ్యక్షుడు ఎన్‌.ఆర్‌.రమేశ్‌, స్థానిక నాయకులు వెంకటేశ్‌ గౌడ, శ్రీకాంత్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని