logo

భారీ పేలుళ్లకే షారిఖ్‌ కుట్ర?

అనుమానిత తీవ్రవాది మహ్మద్‌ షారిఖ్‌ రేవునగరి మంగళూరులో భారీ పేలుళ్లకు కుట్ర పన్నాడని జాతీయ తనిఖీ దళం గుర్తించింది.

Published : 03 Dec 2022 00:37 IST

పేలుడు జరిగింది ఈ ఆటోలోనే.. (పాతచిత్రం)

మంగళూరు, న్యూస్‌టుడే : అనుమానిత తీవ్రవాది మహ్మద్‌ షారిఖ్‌ రేవునగరి మంగళూరులో భారీ పేలుళ్లకు కుట్ర పన్నాడని జాతీయ తనిఖీ దళం గుర్తించింది. కంకనాడిలో నవంబరు 19న కుక్కర్‌ బాంబు పేలుడు ఘటనలో గాయపడి కోలుకుంటున్న నిందితుడి విచారణను ఎన్‌ఐఏ ముమ్మరం చేసింది. పేలుడు సంభవించిన ప్రాంతంలో స్థానిక పోలీసులు స్వాధీనపరుచుకున్న ఐదు లీటర్ల కుక్కర్‌, తొమ్మిది వోల్టుల సామర్థ్యం ఉన్న మూడు బ్యాటరీలు, పాడైన ప్రింటెడ్‌ సర్క్యూట్ బోర్డులు, పలు ఎలక్ట్రిక్‌ పరికరాలను అధికారులు జప్తు చేసుకున్నారు. మైసూరులోని బాడుగ ఇంటి నుంచీ పలు వస్తువులు, రసాయనాలు, పేలుడు పదార్థాలను ఇప్పటికే స్వాధీనపరుచుకున్నారు. ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలతో నిందితుడు భారీ పేలుళ్లకు ప్రణాళిక రూపొందించుకున్నాడని అంచనాకు వచ్చారు. మైసూరు, మంగళూరు, తీర్థహళ్లి, హుబ్బళ్లి, శివమొగ్గలతో పాటు కేరళలలోని పలు ప్రాంతాలకు నిందితుడు వెళ్లి వచ్చాడు. కేరళలోని కాసరగోడు, కణ్ణూరులో షారిఖ్‌ ఇప్పటికే కలుసుకున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. షారిఖ్‌ నుంచి మాదక ద్రవ్యాలను కొనుగోలు చేసిన వారిని గుర్తించి, విచారణ చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేయించుకుని, అతన్ని తమ కేంద్రానికి తీసుకు వెళ్లి విచారణ చేస్తామని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని