logo

దావణగెరెలో మోదీ సభ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన కోసం కన్నడిగుల ‘మాంచెస్టర్‌ నగరం’.. దావణగెరె సర్వాంగ సుందరంగా మారిపోతోంది

Published : 24 Mar 2023 04:04 IST

దావణగెరె వీధుల్లో మోదీ రాకకోసం రెపరెపలాడుతున్న కాషాయ పతాకాలు

దావణగెరె, న్యూస్‌టుడే : ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన కోసం కన్నడిగుల ‘మాంచెస్టర్‌ నగరం’.. దావణగెరె సర్వాంగ సుందరంగా మారిపోతోంది. నగర ప్రధాన వీధులన్నీ కాషాయ పతాకాల రెపరెపలతో తులతూగుతున్నాయి. మోదీ ఈ నెల 12న మైసూరు- బెంగళూరు మధ్య కొత్తగా నిర్మించిన జాతీయ రహదారిని ప్రారంభించిన విషయం తెలిసిందే. మరోసారి శనివారం రాష్ట్రానికి విచ్చేస్తున్నారు. బెంగళూరులో మహదేవపురం-కేఆర్‌పురం మధ్య కొత్తగా నిర్మించిన మెట్రో రైలు సేవలను ఆయన ఉదయమే ప్రారంభించి.. రైల్లో ప్రయాణిస్తూ, కొందరు ప్రయాణికులతో ముఖాముఖి మాట్లాడతారు. సత్యసాయి ఆశ్రమం నుంచి మహదేవపుర మెట్రో స్టేషన్‌ వరకు రోడ్‌షో నిర్వహిస్తారు. చిక్కబళ్లాపుర సమీపంలోని ముద్దేనహళ్లిలో కొత్తగా నిర్మించిన వైద్య కళాశాలనూ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి దావణగెరెకు కదలివెళతారు. వెన్నెనగరిగా పేరొందిన ఈ వాడలో రోడ్‌షో నిర్వహించే ప్రధాని.. విజయ సంకల్ప రథయాత్ర ముగింపు సమావేశాలు ‘మహా సంగమ’లో పాల్గొంటారని కమలనాథులు తెలిపారు. దావణగెరెలో సమావేశాన్ని నిర్వహించే మైదానంలో పార్టీ నాయకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. మహా సంగమకు వచ్చే వారికి ఆసనాలు, భోజన సదుపాయాలు, హోమాలను నిర్వహించేందుకు ప్రత్యేక వేదికలను పూర్తి చేశారు. ఈ నెలాఖరులోగా కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని కార్యక్రమాలను కమలనాథులు చకచకా పూర్తి చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని