logo

బోరుమన్న సంగనకల్లు

మైసూరు జిల్లా టి.నరసీపుర రహదారిలో కురుబూరు గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బళ్లారి తాలూకా సంగనకల్లు గ్రామానికి చెందిన తొమ్మిది మందితోపాటు చోదకుడు మృతిచెందడంతో సంగనకల్లు గ్రామం శోకసంద్రంలో మునిగింది.

Published : 30 May 2023 02:47 IST

రోదిస్తున్న మృతుల బంధువులు

బళ్లారి, న్యూస్‌టుడే: మైసూరు జిల్లా టి.నరసీపుర రహదారిలో కురుబూరు గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బళ్లారి తాలూకా సంగనకల్లు గ్రామానికి చెందిన తొమ్మిది మందితోపాటు చోదకుడు మృతిచెందడంతో సంగనకల్లు గ్రామం శోకసంద్రంలో మునిగింది. మృతిచెందిన తొమ్మిది మందిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా మరో కుటుంబానికి చెందిన వారు ముగ్గురు ఉన్నారు. ఇద్దరు ఇంకొక కుటుంబానికి చెందినవారు. మంజునాథ(35) రొట్టెలు తయారు చేసి జీవనం సాగించేవారు. భార్య పూర్ణిమ(30), కుమారుడు కార్తిక్‌(9), మరో కుమారుడు పవన్‌కుమార్‌(8) ఘటనా స్థలిలోనే మృతి చెందారు. చెక్కలీలు తయారు చేసి జీవనం సాగిస్తున్న గాయత్రి(38), శ్రావ్య(5) మృతిచెందగా.. భర్త జనార్దన్‌, కుమారుడు పునీత్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామ ఒన్‌ కేంద్రం, కిరాణా దుకాణం నిర్వహిస్తున్న విజయనగర జిల్లా హగరి గజాపుర గ్రామానికి చెందిన కొట్రేశ్‌(45), భార్య సుజాత(40), కుమారుడు నందీప్‌(23) ముగ్గురూ మృతిచెందారు. విషయం తెలుసుకున్న బంధువులు, కుటుంబసభ్యులు సంగనకల్లు చేరుకుని రోదించారు.

కన్నీరు మున్నీరైన బంధువులు

మంజునాథ కుటుంబంలో మొత్తం ఏడుగురు ఉండగా, వారిలో నలుగురు మృతిచెందారు. మంజునాథ సోదరుడు సురేశ్‌, తల్లి లక్ష్మమ్మ, తండ్రి సాగర్‌ మాత్రమే ఉన్నారు. కొట్రేశ్‌ కుటుంబానికి చెందిన ముగ్గురూ మృతిచెందారు. మనుమరాళ్లను తలచుకుంటూ అజ్జి లక్ష్మమ్మ రోధించడం స్థానికులను కంటతడి పెట్టించింది. యాత్రకు వెళ్లినప్పటి నుంచి నిత్యం చరవాణిలో మాట్లాడేవారని, అంతలోపు దేవుడు చిన్న చూపు చూశాడని కన్నీరు మున్నీరయ్యారు. వారు లేకుండా ఎలా బతకాలని రోదించారు. ప్రమాద దృశ్యాలను చరవాణిలో చూసి మంజునాథ సోదరుడు సురేశ్‌ కన్నీరు పెట్టుకున్నారు. హగరి గజాపుర గ్రామానికి చెందిన కొట్రేశ్‌ కుటుంబం మొత్తం రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో బంధువులు, స్నేహితులు ఇంటికి తరలివచ్చారు. మంగళవారం మృతదేహాలను గ్రామానికి తీసుకురానున్నట్లు తెలిసింది.

శోకసంద్రంలో బాధిత కుటుంబసభ్యులు

వివరాలు సేకరించిన ఏసీ

రోడ్డు ప్రమాదంలో సంగనకల్లు వాసులు మృతిచెందిన విషయం తెలుసుకున్న బళ్లారి ఉప విభాగం ఏసీ హేమంత్‌కుమార్‌ గ్రామంలో పర్యటించి మృతిచెందిన వారి వివరాలు సేకరించారు. సంగనకల్లు నుంచి 12మంది మైసూరు యాత్రకు వెళ్లినట్లు తెలిపారు. వారిలో తొమ్మిది మంది మృతి చెందినట్లు గుర్తించి మైసూరు జిల్లా పాలనాధికారితో మాట్లాడి వివరాలు తెలిపారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిందన్నారు.

బాధిత కుటుంబాలకు శ్రీరాములు పరామర్శ

మాజీ మంత్రి శ్రీరాములు సంగనకల్లు గ్రామంలో పర్యటించి బాధిత కుటుంబసభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం మృతులకు ఒకొక్కరికి రూ.2లక్షలు ప్రకటించిందని, రూ.5లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గాయపడిన వారికి ప్రభుత్వమే మెరుగైన చికిత్స అందజేయాలని కోరారు. మృతదేహాలను తక్షణమే బళ్లారికి తరలించాలని చరవాణిలో మైసూరు డీసీని కోరారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని