logo

ఉత్కంఠంగా విద్యావర్ధక సంఘం ఎన్నికలు

వీరశైవ విద్యావర్ధక సంఘం నూతన అధ్యక్షుడిగా అల్లం గురుబసవరాజ్‌, కార్యదర్శిగా అరవింద్‌ పాటీల్‌లు నాటకీయ పరిణామాల మధ్య ఎన్నికయ్యారు.

Published : 28 Mar 2024 03:03 IST

అధ్యక్షుడిగా అల్లం గురుబసవరాజ్‌
కార్యదర్శిగా అరవింద పాటీల్‌
నాటకీయ పరిణామాల మధ్య పోరు

బళ్లారి, న్యూస్‌టుడే : వీరశైవ విద్యావర్ధక సంఘం నూతన అధ్యక్షుడిగా అల్లం గురుబసవరాజ్‌, కార్యదర్శిగా అరవింద్‌ పాటీల్‌లు నాటకీయ పరిణామాల మధ్య ఎన్నికయ్యారు. పూర్తి ఆధిక్యత సాధించినా యువకుల బృందం అధ్యక్ష స్థానం కోల్పోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు. వి.వి.సంఘం అధ్యక్ష, సభ్యులు ఎన్నిక బుధవారం ఉదయం గాంధీనగర్‌ మొదటి రహదారిలోని వి.వి.సంఘం కార్యాలయంలో నిర్వహించారు. సభ్యులు ఆశ్చర్యపోయే విధంగా సీనియర్‌ బృందానికి తక్కువ కార్యవర్గ సమితి సభ్యులున్నా యువకుల సంఘంలో అంతర్గత విభేదాల కారణంగా అధ్యక్ష స్థానం సీనియర్‌ బృందం కైవసం చేసుకొంది.

రహస్య ఓటింగ్‌ పద్ధతి

నగరంలోని వీరశైవ విద్యావర్ధక సంఘం కార్యాలయంలో పూర్వ అధ్యక్షుడు రామనగౌడ అధ్యక్షతన సభ్యులు ఎన్నిక ప్రారంభమైంది. ఉదయం 11గంటలకు అధ్యక్ష స్థానానికి చేతులెత్తి ఎన్నుకోవాలని యువకుల  బృందం కోరింది. దీనికి సీనియర్‌ బృందం తిరస్కరించింది. ఇరువురి మధ్య కొంత సేపు వాగ్వాదం జరిగింది. చివరికి రహస్య ఓటింగ్‌ పద్ధతిలో నిర్వహించాలని తీర్మానించారు. సీనియర్‌ బృందం నుంచి అధ్యక్ష స్థానానికి అల్లం గురుబసవరాజ్‌, యువకుల బృందం నుంచి మహంతేశ్‌ పోటీ పడ్డారు. రహస్య ఓటింగ్‌ పద్ధతిలో అల్లం గురుబసరాజ్‌కు 17 ఓట్లు, మహంతేశ్‌కు 12 ఓట్లు పడ్డాయి. ఉపాధ్యక్ష ప్థానం జానెకుంటె బసవరాజ్‌కు 16 ఓట్లు, యువకుల బృందం నుంచి ఉపాధ్యక్ష స్థానానికి పోటీ చేసిన సాహుకార్‌ సతీశ్‌బాబుకు 13 ఓట్లు పడ్డాయి.ఉపాధ్యక్షుడు జానెకుంటె బసవరాజ్‌ ఎన్నికయ్యారు. కార్యదర్శిగా సీనియర్‌ బృందం నుంచి పోటి చేసిన డా.అరవింద్‌ పాటీల్‌కు 16 ఓట్లు, యువకుల బృందం నుంచి రుద్రగౌడకు 13 ఓట్లు దక్కాయి. సహాయ కార్యదర్శి పంపనగౌడ, సీనియర్‌ బృందం నుంచి క్యాత్యాయిని మరిదేవయ్య పోటీ పడగా, పంపనగౌడ ఎన్నికయ్యారు. కోశాధికారి బైలువద్దిగేరి ఎర్రిస్వామి ఎంపికయ్యారు.

నిరుత్సాహంలో యువకుల బృందం

మూడేళ్ల తర్వాత వి.వి.సంఘం కార్యవర్గ సమితి సభ్యులు ఎన్నిక జరిగింది. మొత్తం 30 మంది కార్యవర్గ సభ్యులు ఎన్నిక కావల్సి ఉండగా, యువకుల బృందానికి 16, సీనియర్‌ బృందానికి 13, ఒకరు స్వతంత్రులుగా గెలుపొందారు. అధికారం కోసం యువకుల బృందంలో అంతర్గత విభేదాలు వచ్చాయి.ఆ బృందంలో అత్యధిక ఓట్లు సాధించిన భాగ్యలక్ష్మి, మహంతేశ్‌ అధ్యక్ష స్థానానికి పోటీ పడ్డారు. దీంతో వారి మధ్య అంతర్గత విభేదాలు వచ్చాయి. సీనియర్‌ బృందం సభ్యులు అధ్యక్ష, కార్యదర్శి తదితర స్థానాలు కైసవం చేసుకున్నారు. సీనియర్‌ బృందం నుంచి గెలుపొందడంతో సంబరాలు చేశారు. ఈ బృందంలో ప్రముఖ న్యాయవాది ఉడేద బసవరాజ్‌, ప్రభుస్వామి, ఎర్రిస్వామి బూదిహళ్‌ మఠ, ఎన్‌.వీరభద్రగౌడ, ప్యాట్యాల్‌ బసవరాజ్‌, యల్లనగౌడ శంకరబండ, ప్రతాపగౌడ, రూపనగుడి బసవరాజ్‌ తదితరులు ఉన్నారు. వి.వి.సంఘం కార్యవర్గ సమితిలో అత్యధిక ఓట్లు సాధించిన భాగ్యలక్ష్మి అధ్యక్ష స్థానం కోల్పోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు. కార్యవర్గ సమితి స్థానానికి రాజీనామా చేయగా, ఆ రాజీనామా పత్రాన్ని అధ్యక్షుడు ఆమోదించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని