logo

రైతు బిడ్డ.. హ్యాట్రిక్‌ హీరో.. లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఆయనది రికార్డు!

కృష్ణ- తుంగభద్ర నదుల మధ్య విస్తరించిన రాయచూరు లోక్‌సభ నియోజకవర్గానికి ఓ ప్రత్యేక ఉంది. రాజకీయ కుటుంబ నేపథ్యం లేని ఒక సాధారణ రైతు బిడ్డ అరికెరె వెంకటేశ్‌నాయక్‌ నాలుగుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో విజయఢంకా మోగించి.. అరుదైన రికార్డు నమోదు చేశారు.

Updated : 11 Apr 2024 09:47 IST

రాయచూరు, న్యూస్‌టుడే : కృష్ణ- తుంగభద్ర నదుల మధ్య విస్తరించిన రాయచూరు లోక్‌సభ నియోజకవర్గానికి ఓ ప్రత్యేక ఉంది. రాజకీయ కుటుంబ నేపథ్యం లేని ఒక సాధారణ రైతు బిడ్డ అరికెరె వెంకటేశ్‌నాయక్‌ నాలుగుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో విజయఢంకా మోగించి.. అరుదైన రికార్డు నమోదు చేశారు. మూడుసార్లు వరసగా గెలిచి హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకున్నారు. ఇంత వరకూ జరిగిన 17 లోక్‌సభ ఎన్నికల్లో నాయక్‌ రికార్డును ఎవరూ అధిగమించలేదు. దేవదుర్గ తాలూకా అరికెర జడ్పీ సభ్యుడైన వెంకటేశ్‌నాయక్‌ను 1991 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా ప్రకటించారు. తొలి ప్రయత్నంలోనే సునాయాసంగా విజయాన్ని దక్కించుకున్నారు. 1996లో జనతాదళ్‌ అభ్యర్థి రాజా రంగప్పనాయక్‌ చేతిలో పరాజయం తప్పలేదు. 1998, 1999, 2004లో వరుస విజయాలను సొంతం చేసుకున్నారు. 2009లో పార్టీ టికెట్‌ నిరాకరించింది. ఆప్పటి ఎన్నికల నాటికి రాష్ట్రంలో భాజపా అధికారంలో ఉంది. అప్పటి మంత్రి గాలి జనార్దనరెడ్డి మద్దతుదారుడైన కమలం పార్టీ అభ్యర్థి ఫక్కీరప్పను ఎదుర్కోవడం నాయక్‌కు కష్ట సాధ్యమని భావించి రాజా వెంకటప్ప నాయక్‌ (సురపుర)ను కాంగ్రెస్‌ బరిలో నిలిపింది. ఫక్కీరప్ప స్వల్ప ఆధిక్యతతో నెట్టుకొచ్చారు. 2009లో రాయచూరు లోక్‌సభను ఎస్టీకి రిజర్వు చేశారు. అంత వరకు జనరల్‌ ఉండేది. 1991 నుంచి 2004 వరకు ఎస్టీ వర్గీయులే ఎంపీగా గెలవడం విశేషమే.
ః 2013 విధానసభ ఎన్నికల్లో దేవదుర్గలో కాంగ్రెస్‌ గెలవాలని వెంకటేశ్‌నాయక్‌ను ఎన్నికల రంగంలోకి దించారు. త్రిముఖ పోటీలోనూ నెగ్గుకొచ్చారు. ఎంపీగా అనుభవం గడిచినందున రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతారని పార్టీ శ్రేణులు ఆశించాయి. దురదృష్టవశాత్తు ఎమ్మెల్యే అయిన కొన్ని నెలలకే రైలు ప్రమాదంలో ఆయన మృతిచెందారు. సౌమ్యుడు కావవడంతో పాతికేళ్లకుపైగా రాజకీయంగా మనుగడ సాధించారు. రాయచూరు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా సేవలందించారు. దేవదుర్గ 2016 ఉప ఎన్నిక, 2018, 2023 విధానసభ ఎన్నికల్లో వెంకటేశ్‌నాయక్‌ కుటుంబ సభ్యులు దేవదుర్గ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎంపీ ఎన్నికల్లో వెంకటేశ్‌నాయక్‌ పెద్ద కుమారుడు బి.వి.నాయక్‌ ఎమ్పీ అయ్యారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రస్తుత ఎన్నికల్లో భాజపా నుంచి ఎంపీ టికెట్‌ ఆశించి భంగపడ్డారు. వెంకటేశ్‌నాయక్‌ చిన్న కుమారుడు రాజశేఖర్‌నాయక్‌, కోడలు శ్రీదేవినాయక్‌ కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా ఉన్నారు. శ్రీదేవినాయక్‌ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దేవదుర్గలో పోటీ చేసి పరాజయాన్ని మూటగట్టుకున్నారు. దేవదుర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, భాజపా నాయకుడు శివనగౌడనాయక్‌కు వెంకటేశ్‌నాయక్‌ తాత వరుస.

వెంకటేశ్‌నాయక్‌ (పాతచిత్రం)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని