logo

అగ్రనేతల గడ్డపై ఎవరిదో విజయం?

బళ్లారి లోక్‌సభ నియోజకవర్గం నుంచి  1999లో కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, భాజపా నుంచి ఫైర్‌బ్రాండ్‌గా ప్రత్యేక గుర్తింపు పొందిన దిల్లీ మాజీ ముఖ్యమంత్రి సుష్మాస్వరాజ్‌ బరిలో నిలిచారు.

Published : 20 Apr 2024 04:13 IST

సోనియాకు పట్టం కట్టిన చరిత్ర
భాజపాకు పునాది వేసిన సుష్మా

బళ్లారి, న్యూస్‌టుడే: బళ్లారి లోక్‌సభ నియోజకవర్గం నుంచి  1999లో కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, భాజపా నుంచి ఫైర్‌బ్రాండ్‌గా ప్రత్యేక గుర్తింపు పొందిన దిల్లీ మాజీ ముఖ్యమంత్రి సుష్మాస్వరాజ్‌ బరిలో నిలిచారు. అగ్రనేతల మధ్య పోటీ బళ్లారికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. అప్పటి వరకు కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా ఉన్న బళ్లారి జిల్లాలో భాజపా జెండా ఎగురవేయాలని జాతీయ స్థాయి నేతలు విశ్వ ప్రయత్నాలు చేశారు. కన్నడిగుల మనసు గెలవడానికి భాజపా అభ్యర్థి సుష్మాస్వరాజ్‌ కన్నడ అధ్యాపకులతో ప్రత్యేక శిక్షణ పొంది..కన్నడంలో మాట్లాడటం నేర్చుకున్నారు. సోనియాగాంధీ హిందీలోనే మాట్లాడేవారు.


తిష్టవేసిన పార్టీ నాయకత్వం

1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సోనియాగాంధీ తరఫున అప్పటి కేపీసీసీ అధ్యక్షుడు ఎస్‌.ఎం.కృష్ణతో పాటు గులాం నబీ ఆజాద్‌, తదితర నేతలు బళ్లారిలోనే మకాం వేసి ప్రచారం చేశారు. అప్పట్లో ప్రియాంకాగాంధీ, వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి సైతం ప్రచారం చేశారు. భాజపా అభ్యర్థి సుష్మాస్వరాజ్‌ తరఫున అటల్‌ బిహారీ వాజపేయీ, ఎల్‌.కె.అద్వానీ, వెంకయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్‌ తెదేపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో సోనియాకు 4,14,650 ఓట్లు రాగా, సుష్మాస్వరాజ్‌కు 3,58,550 ఓట్లు వచ్చాయి. సుష్మాస్వరాజ్‌పై సోనియా 56,100 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందడమే కాకుండా జిల్లాలోని విధానసభ నియోజకవర్గాల్లో మొత్తం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. అనంతరం సోనియాగాంధీ బళ్లారి లోక్‌సభ స్థానానికి రాజీనామా చేసి, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం అమేథి పార్లమెంట్‌ సభ్యురాలిగా కొనసాగారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన కోళూరు బసవనగౌడ గెలుపొందారు.


కమల వికాసానికి సుష్మాస్వరాజ్‌ పునాది

నాటి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన సుష్మాస్వరాజ్‌ ఓడిపోయినా..బళ్లారి జిల్లాలో భాజపాకు గట్టి పునాది వేశారు. 2004 నుంచి జిల్లాను భాజపాకు కంచుకోటగా మార్చారు. ఆమెకు తోడుగా బళ్లారి రెడ్డి బ్రదర్స్‌, బి.శ్రీరాములు శ్రమించారు. 1991లో మొదటిసారిగా బళ్లారి లోక్‌సభ నియోజకవర్గం నుంచి  ప్రముఖ ఇంజినీర్‌ కె.నాగభూషణం పోటీ చేశారు.ఈ ఎన్నికల్లో భాజపాకు కేవలం 84,837 ఓట్లు మాత్రమే వచ్చాయి. 1996లో జరిగిన ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా ప్రముఖ న్యాయవాది ఇందుశేఖర్‌ పోటీ చేసి 43,286 ఓట్లు సాధించారు. 1999లో సుష్మాస్వరాజ్‌ 3,58,550 ఓట్లు సాధించి బళ్లారి జిల్లాలో భాజపాకు పునాది వేశారు.

వికసించిన కమలం

1999లో సుష్మాస్వరాజ్‌ ఓటమి పాలైనా ప్రాణాలు ఉన్నంత వరకు ఏటా బళ్లారికి వరమహాలక్ష్మి వ్రతానికి వస్తానని ప్రకటించారు. దానికి అనుగుణంగా ఏటా వరమహాలక్ష్మీ వ్రతానికి రావడంతోపాటు రెడ్డి బ్రదర్స్‌, బి.శ్రీరాములు సామూహిక వివాహాలు చేయడం ప్రారంభించారు. భాజపా జనంలోకి వెళ్లింది. మొదటి సారిగా 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా పోటీ చేసిన గాలి కరుణాకర్‌రెడ్డి గెలుపొందారు. 2009లో జె.శాంత కాంగ్రెస్‌ అభ్యర్థి ఎన్‌.వై.హనుమంతప్పపై 2243 ఆధిక్యతతో గెలుపొందారు. 2014లో బి.శ్రీరాములు, 2018లో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి వి.ఎస్‌.ఉగ్రప్ప, 2019లో భాజపా అభ్యర్థి వై.దేవేంద్రప్ప గెలుపొందారు. జిల్లాలో గ్రామ పంచాయతీ స్థాయి నుంచి లోక్‌సభ వరకు అభ్యర్థులను గెలిపించుకుని బళ్లారి జిల్లాను భాజపాకు కంచుకోటగా మార్చారు. ప్రస్తుతం జరిగే లోక్‌సభ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి బి.శ్రీరాములు, కాంగ్రెస్‌ అభ్యర్థి ఇ.తుకారాం బరిలో నిలిచారు. ఇద్దరు మధ్య గట్టి పోటీ నెలకొంది.

1999లో జరిగిన లోక్‌సభ ఎన్నిక దేశంలోనే బళ్లారి లోక్‌సభ స్థానం ప్రత్యేక గుర్తింపు పొందింది. తాజా ఎన్నికల్లో ఈ స్థానం నుంచి బి.శ్రీరాములు, ఇ.తుకారం ప్రధాన పార్టీల నుంచి బరిలోకి దిగారు. పోటాపోటీగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. విజయం ఎవరిని వరిస్తుందోనని సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని