logo

జేఈఈలో జయకేతనం!

జేఈఈ మెయిన్‌, బీఈ, బీటెక్‌లో తొలి పేపర్‌ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్‌ సాధించారు.

Updated : 26 Apr 2024 02:41 IST

వంద పర్సంటైల్‌తో ముగ్గురు కన్నడిగుల మెరుపు 

ఈనాడు, బెంగళూరు : జేఈఈ మెయిన్‌, బీఈ, బీటెక్‌లో తొలి పేపర్‌ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్‌ సాధించారు. మరికొందరు కేటగిరీ స్థాయిల్లో జాతీయ రెండో ర్యాంకు, ఇతర విభాగాల్లో వందలోపు ర్యాంకులతో మెరిశారు. మొత్తం 56 మంది వంద పర్సంటైల్‌ సాధించగా అందులో ముగ్గురు రాష్ట్ర విద్యార్థులున్నారు. వీరిలో ఒక విద్యార్థిని ఉండటం విశేషం. గతేడాదితో పోలిస్తే వంద పర్సంటైల్‌ సాధించిన వారి సంఖ్య ఒకటి పెరిగినా 99 పర్సంటైల్‌లో ఎక్కువ సంఖ్యలో కర్ణాటక విద్యార్థులు ప్రతిభ కనబరచారు.

  •  ఈ పరీక్షల్లో నగర విద్యార్థులు సత్తా చాటారు. వీరిలో శ్రీచైతన్య విద్యా సంస్థలకు చెందిన అనిమేష్‌ సింగ్‌ రాథోడ్‌ కేటగిరీ విభాగంలో జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు, మనోజ్‌ సోహాన్‌ 96, అర్మన్‌ సింఘాల్‌ 542, ఆయుష్‌ రై 552, చిరాగ్‌ గౌడ 572 ర్యాంకులతో పాటు మరో 15  మంది వెయ్యి లోపు ర్యాంకు సాధించగా, 810మంది ఈ పరీక్షలకు అర్హత సాధించినట్లు సంస్థల డైరెక్టర్‌ సీమా బోపణ్ణ, ఏజీఎం సతీశ్‌కుమార్‌లు ఇక్కడ తెలిపారు.
  • అలెన్‌ కెరీర్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సాయి నవనీత్‌ ముకుంద్‌ 41వ ర్యాంకు సాధించగా, ఇదే సంస్థకు చెందిన షాన్‌ థామస్‌ కోషి 100వ ర్యాంకు, బాలకుమారన్‌ పుదుచ్చేరి యూటీ టాపర్‌గా నిలిచారు. ఈ సంస్థకు చెందిన 16మంది విద్యార్థులు 500లోపు, 35మంది వేయిలోపు ర్యాంకులు సాధించినట్లు సంస్థ దక్షిణ భారత జోనల్‌ హెడ్‌ మహేశ్‌ యాదవ్‌ తెలిపారు.

చిన్ననాటి నుంచే దృష్టి..

  • నీట్‌, జేఈఈల కోసం 9వ తరగతి నుంచే శిక్షణ ప్రారంభించినట్లు వంద పర్సంటైల్‌ సాధించిన సాన్విజైన్‌ చెప్పారు. అప్పటి నుంచి పోటీ పరీక్షల్లో నెగ్గాలన్నదే తన లక్ష్యంగా ఉండేదని వివరించారు. రోజుకు ఐదు గంటల పాటు చదివేదానినని, ఏరోజు పాఠాలు ఆరోజే పూర్తిగా చదివినట్లు వివరించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ తర్వాత ఐఐటీ ముంబై లేదా ఐఐఎస్‌సీలో చేరాలన్నది లక్ష్యమని తెలిపారు.

అనుకున్నది సాధించా

వంద పర్సంటైల్‌ వస్తుందని ఊహించినట్లు రాష్ట్రంలో తొలి, జాతీయ స్థాయిలో 41వ ర్యాంకు సాధించిన నవనీత్‌ ముకుంద్‌ తెలిపారు. గంటలకొద్దీ చదవటం కంటే అవగాహనతో కొద్ది గంటలు చదివినా చాలు మంచి ర్యాంకులు సాధించవచ్చు. అడ్వాన్స్‌డ్‌లో మరింత మెరుగైన ర్యాంకు వస్తుందన్న అంచనా ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని