logo

తప్పుడు ప్రచారంలో ఆరితేరారు

అబద్ధాలను చెప్పడంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరితేరారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. చెప్పిన అబద్ధాన్ని మరోసారి చెప్పకుండా, కొత్తవి నమ్మించేలా చెప్పడం ఆయనకే చెల్లిందని ఎద్దేవా చేశారు.

Published : 28 Apr 2024 04:55 IST

భాజపా నేతలపై సిద్ధు నిప్పులు

విలేకరుల సమావేశంలో సిద్ధరామయ్య, ప్రియాంక్‌ ఖర్గే, శరణు ప్రకాశ్‌ పాటిల్‌, అజయ్‌సింగ్‌ తదితరులు

కలబురగి, న్యూస్‌టుడే : అబద్ధాలను చెప్పడంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరితేరారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. చెప్పిన అబద్ధాన్ని మరోసారి చెప్పకుండా, కొత్తవి నమ్మించేలా చెప్పడం ఆయనకే చెల్లిందని ఎద్దేవా చేశారు. కలబురగిలో శనివారం నిర్వహించిన సమావేశంలో మంత్రులు శరణు ప్రకాశ్‌ పాటిల్‌, ప్రియాంక్‌ ఖర్గే, ఎమ్మెల్యేలు అజయ్‌ సింగ్‌, బీఆర్‌ పాటిల్‌, ఎమ్మెల్సీ తిప్పణ్ణ కమకనూరుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ముస్లిం ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు కాంగ్రెస్‌ వారికి నాలుగు శాతం రిజర్వేషన్లను ఇచ్చిందని భాజపా విడుదల చేసిన తప్పుడు ప్రకటనపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, తన స్థాయి తగ్గించుకుని అబద్ధాలు చెబుతున్న మోదీకి దేశ ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. దేశ ప్రజలు కాంగ్రెస్‌, ఇతర మిత్రపక్షాలకు మద్దతుగా నిలుస్తున్నారని పలు సమీక్షలు ఇప్పటికే తేటతెల్లం చేశాయని చెప్పారు. నాకు- ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ మధ్య శీతల సమరం కొనసాగుతోందని భాజపా నాయకులు తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని చెప్పారు. కర్ణాటకలో సీఎం, డీసీఎంల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోందని అసోం ముఖ్యమంత్రి హిమాంత్‌ బిస్వాస్‌ శర్మ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, ‘ఆయన ప్రధాని కాదు, భాజపా అధ్యక్షుడూ కాదు, కనీసం కర్ణాటకలో విపక్ష నేతకూడా కాదు. ఆయన వ్యాఖ్యలకు స్పందించే అవసరం కూడా లేదు’ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని