logo

దేశాభివృద్ధికి యువతే దారిదీపం

ప్రపంచంలో భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలని ఎమ్మెల్సీ ఏచరెడ్డి సతీశ్‌ పేర్కొన్నారు.

Published : 01 May 2024 02:27 IST

నేతలను సన్మానిస్తున్న నేతలు

బళ్లారి, న్యూస్‌టుడే: ప్రపంచంలో భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలని ఎమ్మెల్సీ ఏచరెడ్డి సతీశ్‌ పేర్కొన్నారు. భాజపా యువ మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం గాంధీభవనంలో ఏర్పాటు చేసిన యువ సంకల్ప సమావేశాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పదేళ్ల పాటు ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీపై ఒక్క ఆరోపణ రాలేదు. దేశ భద్రత, అభివృద్ధి కోసం రోజుకు 20 గంటల పాటు శ్రమిస్తున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించారు. ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా ఆరోగ్య రక్షణకు ప్రజలకు అనుకూలం కోసం పలు పథకాలు తీసుకుని వచ్చారన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది. మీతో పాటు మీ స్నేహితులు, కుటుంబసభ్యులకు ప్రచారం చేసి భాజపా ఓటు వేయించాలని కోరారు. మాజీ శాసనసభ్యుడు గాలి సోమశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ దేశంలో పూర్తి స్థాయిలో సీట్లలో పోటీ చేయలేదంటే కాంగ్రెస్‌ పార్టీ ఏ స్థాయికి దిగిజారి పోయిందో అర్థమవుతుందన్నారు. దేశానికి మోదీ అవసరం, బళ్లారి నియోజకవర్గానికి బి.శ్రీరాములు కూడా అవసరం ఉందన్నారు. శత్రువులకు వణుకు పుట్టించిన నరేంద్ర మోదీకి మరోసారి ఓటు వేసి కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ సైనికులుగా శ్రమించాలన్నారు. రాష్ట్ర యువమోర్చా ఉపాధ్యక్షుడు బాళెకాయి మాట్లాడుతూ సమావేశంలో పాల్గొన్న యువత సంకల్పం చేయాలన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ప్రకాశ్‌ రాజ్‌ సోమవారం బళ్లారిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో భాజపా అభ్యర్థి బి.శ్రీరాములు, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మాట్లాడటం తగదన్నారు. విధానపరిషత్‌ ప్రతిపక్షనేత రవికుమార్‌ మాట్లాడుతూ భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగం మార్పు చేస్తారని కాంగ్రెస్‌ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రాజ్యాంగం రాసిన డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ను రెండు సార్లు ఓడించారని విమర్శించారు. యువ మోర్చా నేత సిద్ధార్థసింగ్‌, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు మాట్లాడారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుకుమార్‌ మోకా, వీరశేఖర్‌రెడ్డి, కె.ఎస్‌.దివాకర్‌, గోనాళ్‌ మురహరిగౌడ, హనుమంతప్ప, మహేశ్వరస్వామి, మల్లనగౌడ, కోనంకి తిలక్‌, పుష్పలత, అడవిస్వామి, అరుణ్‌, బాలచంద్ర, సుధాకర్‌, భారత్‌బాబు పాల్గొన్నారు.

సింధనూరు క్లబ్‌ కాకతీయలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న సీటీ.రవి

భాజపాలో అన్నీ పేదల సంక్షేమ పథకాలే

సింధనూరు: పదేళ్లుగా మోదీ దేశాన్ని విజయపథంలో ముందుకు నడుపుతున్నారు. జన్‌ధన్‌ నుంచి జలజీవన్‌ మిషన్‌ వరకూ అన్నీ పేదల సంక్షేమ పథకాలే..ఇవి అట్టడుగునున్న ప్రతి సగటుజీవికి అందుతున్నాయి..ఇవి అమలు కావాలంటే ప్రధానిగా మోదీ మళ్లీ రావాలని భాజపా జాతీయ కార్యదర్శి సి.టి.రవి పేర్కొన్నారు. ఆయన మంగళవారం స్థానిక శ్రీసత్యాగార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన భాజపా మండల, మహాశక్తికేంద్రాల ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. దేశ రక్షణ కోసం ఈసారీ మోదీ ప్రధాని కావలసిందే అన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం మోదీ పాటుపడుతుంటే..కాంగ్రెస్‌, ఇండియా మిత్రపక్షాలు ఓటు బ్యాంకు కోసం పాటుపడుతున్నాయని విమర్శించారు. దేశంలో, రాష్ట్రంలో వీస్తున్న మోదీ..మోదీ అనే నినాదపు గాలిలో కాంగ్రెస్‌, ఇండియా కూటమి కొట్టుకుపోవడం ఖాయం అన్నారు. మోదీ నినాదం వినలేక కాంగ్రెస్‌ వారికి విరేచనాలు పట్టుకుంటున్నాయని, అందుకే చెంబులు పట్టుకున్నారని హేళన చేశారు. జేడీఎస్‌ నాయకుడు బసవరాజ్‌ నాడగౌడ, కె.కరియప్ప మాట్లాడారు. మాజీ ఎంపీలు కె.వి. శివరామేగౌడ, మాజీ ఎమ్మెల్యేలు ప్రతాప్‌గౌడ, బ్యాగవాట బసవనగౌడ పాల్గొన్నారు.

కార్యకర్తలే పార్టీకి యజమానులు

సిరుగుప్ప: భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలే యజమానులు.. మనది కుటుంబ పార్టీ కాదని భాజపా నాయకుడు, మాజీ మంత్రి సి.టి.రవి పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం పట్టణంలోని వైష్ణవి హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో కార్యకర్తలకు స్ఫూర్తి నింపే సమావేశం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 140 కోట్ల ప్రజలు తన కుటుంబంగా గుర్తించి నిత్యం కష్టపడుతూ పదేళ్లుగా అనేక సంక్షేమ, అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారు. మరోసారి మోదీ ప్రధానమంత్రి కావాలని కోరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి భాజపా విజయ సాధనలు, కాంగ్రెస్‌ వైఫల్యాలను ఓటర్లకు వివరించి కమలం గుర్తుకు ఓటు వేయించాలని పిలుపునిచ్చారు. మాజీ శాసనసభ్యుడు ఎం.ఎస్‌.సోమలింగప్ప, పార్లమెంటు మాజీ సభ్యుడు శివరామేగౌడ మాట్లాడారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కార్యక్రమానికి హాజరైన యువనేతలు, కార్యకర్తలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని