logo

ఓటు యంత్రాలకు గట్టి భద్రత

కర్ణాటకలో రెండో విడత ఎన్నికలు జరిగిన 14 లోక్‌సభ నియోజకవర్గాల నుంచి ఈవీఎంలు, వీవీ ప్యాట్లు స్ట్రాంగ్‌ రూమ్‌లకు చేరుకున్నాయి.

Published : 09 May 2024 06:45 IST

బీదర్‌లోని బీవీబీ కళాశాలలోని ఓ స్ట్రాంగ్‌రూంకు గట్టి భద్రత
బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : కర్ణాటకలో రెండో విడత ఎన్నికలు జరిగిన 14 లోక్‌సభ నియోజకవర్గాల నుంచి ఈవీఎంలు, వీవీ ప్యాట్లు స్ట్రాంగ్‌ రూమ్‌లకు చేరుకున్నాయి. గతంలో జరిగిన ఎన్నికలతో పోల్చితే సుమారు మూడు శాతం అధికంగా 70.43 శాతం పోలింగ్‌ నమోదైంది. ఆయా జిల్లా కేంద్రాల్లోని స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు కల్పించారు. ఎన్నికల్లో తమ నియోజకవర్గాల పరిధిలో సుడిగాలి పర్యటనలు, ఓటర్లను మెప్పించేందుకు ఇంటింటి ప్రచారాన్ని చేసిన నాయకులంతా కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం విశ్రాంతి తీసుకున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మూడు రోజుల విశ్రాంతి కోసం తమిళనాడులోని ఊటీకి వెళ్లారు. మంత్రి డాక్టర్‌ హెచ్‌సీ మహదేవప్ప ఊటీ బాటే పట్టారు. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి చిక్కమగళూరుకు వెళ్లారు. మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప, భాజపా అద్యక్షుడు బీవై విజయేంద్ర బెంగళూరులోని తమ నివాసంలో విశ్రాంతి తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి బుధవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన అనంతరం బిడదిలోని తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి, మాజీ ముఖ్యమంత్రులు బసవరాజ బొమ్మై, జగదీశ్‌ శెట్టర్‌, వివిధ నియోజకవర్గాల అభ్యర్థులు మృణాల్‌ హెబ్బాళ్కర్‌ (బెళగావి), వినోద్‌ అసోటి (హుబ్బళ్లి), ప్రభా మల్లికార్జున్‌ (దావణగెరె), రాధాకృష్ణ (కలబురగి), సంయుక్త పాటిల్‌ (బాగల్‌కోటె), ప్రియాంక జార్ఖిహొళి (చిక్కోడి) తదితరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పూర్తిగా విశ్రాంతి తీసుకున్నారు. కొందరు అభ్యర్థులు ఆలయాలకు వెళ్లి పూజలు చేసుకుని, ఇతర ప్రాంతాల పర్యటనకు వెళ్లారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని