logo

మళ్లీ విజృంభన

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గతేడాది చివరి వరకూ కేవలం పదుల సంఖ్యలోనే ఉన్న కొవిడ్‌ కేసుల సంఖ్య చాపకింద నీరులా విస్తరిస్తోంది. కుటుంబాలకు కుటుంబాలే వైరస్‌ బారిన పడుతున్నాయి. జనవరిలో ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 2,360 మంది వైరస్‌ బారినపడ్డారు.

Published : 19 Jan 2022 05:57 IST

పరీక్షల కోసం బారులుదీరిన జనం

ఈటీవీ, ఖమ్మం, కొత్తగూడెం వైద్యవిభాగం, న్యూస్‌టుడే: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గతేడాది చివరి వరకూ కేవలం పదుల సంఖ్యలోనే ఉన్న కొవిడ్‌ కేసుల సంఖ్య చాపకింద నీరులా విస్తరిస్తోంది. కుటుంబాలకు కుటుంబాలే వైరస్‌ బారిన పడుతున్నాయి. జనవరిలో ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 2,360 మంది వైరస్‌ బారినపడ్డారు. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పితో బాధితులు వైరస్‌ బారిన పడుతున్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారుల పరిశీలనలో తేలింది.  

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది 55,210 పరీక్షలు నిర్వహించగా 1,830 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి జిల్లాలో 51,710 పరీక్షలు నిర్వహించగా 530 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పదో తేదీ వరకు రోజుకు 30కి దాటకుండా కేసులు నమోదైనా.. ఆ తర్వాత కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కొత్త ఏడాది సంబరాలు, భద్రాచలంలో ముక్కోటి వేడుకలు, ఆ తర్వాత సంక్రాంతి పండగ సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి బంధువులు రాకపోకలు, కుటుంబాలతో ప్రయాణాలు సాగించడం, పండగ షాపింగ్‌లు, శుభకార్యాల్లో జన సమూహాలు ఎక్కువగా కనిపించడం వైరస్‌ వ్యాప్తికి కారణమయ్యాయి. చిన్నపాటి లక్షణాలతోనే వైరస్‌ బారినపడుతున్నారు. ఆర్టీసీ, పోలీసు, వైద్యరోగ్యశాఖలో ఉద్యోగులు, సిబ్బంది ఎక్కువ సంఖ్యలో కొవిడ్‌ బారిన పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కేసుల తీవ్రత పెరుగుతోంది.


కొంపముంచిన కోడి పందాలు

ఉమ్మడి జిల్లాలోని ఏపీ సరిహద్దు ప్రాంతాలతోపాటు ఆంధ్ర ప్రాంతంలో నిర్వహించిన కోడి పందేలకు పందెం రాయుళ్లు భారీగా తరలివెళ్లారు. ఈ నెల 14, 15, 16 తేదీల్లో కోడి పందేలు సాగే ప్రాంతాల్లో జనం భారీగా గుమిగూడారు. అక్కడి నుంచి వచ్చిన వెంటనే కొవిడ్‌ లక్షణాలు బయటపడటం, పరీక్షలు చేయించుకోవడంతో కేసులు పెరిగాయి. ఖమ్మం జిల్లాలో 14న 177, 15న 148, 17న 392, 18న 473 కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి జిల్లాలోనూ ఈ మూడు రోజుల్లోనే 180 వరకు పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి కరోనా వార్డులో చేరుతున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం 30 మంది కరోనా బాధితులు ఆస్పత్రిలో చేరారు. వీరిలో నలుగురు శ్వాస సంబంధిత సమస్యలు ఉండటంతో ఆక్సీజన్‌ సదుపాయంతో చికిత్స అందిస్తున్నారు. కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో ఏడుగురు, భద్రాచలం ఆస్పత్రిలో ఒకరు కొవిడ్‌ చికిత్స పొందుతున్నారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 1,62,500 హోం ఐసోలేషన్‌ కిట్లు అందుబాటులో ఉంచారు. సుమారు లక్ష వరకు కరోనా పరీక్షల కిట్లు సిద్ధం చేశారు. భద్రాద్రి జిల్లాలో 90 వేల హోం ఐసోలేషన్‌ కిట్లు, 1,12,000 కరోనా నిర్ధారణ పరీక్షల కిట్లు అందుబాటులో ఉంచారు.


జిల్లాలో మూడోదశ ముప్పును ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాం. ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సీజన్‌ కొరత లేకుండా చూస్తాం. కేసులు ఎక్కువ వస్తున్న ప్రాంతాల్లో అవగాహన శిబిరాలు ఏర్పాటు చేసి అప్రమత్తం చేస్తున్నాం. ప్రజల్లో మరింత చైతన్యం రావాలి. అర్హులందరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలి.    

డాక్టర్‌ శిరీష, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి


కలెక్టరేట్‌లో కలకలం
పలువురు అధికారులు, సిబ్బందికి

కొత్తగూడెం కలెక్టరేట్, న్యూస్‌టుడే: కలెక్టరేట్‌లో కరోనా కలకలం రేపింది. పలువురు ఉన్నతాధికారులతోపాటు వారి వాహనాల డ్రైవర్లకు, కార్యాలయ సిబ్బందికి కొవిడ్‌ సోకింది. మంగళవారం నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పలువురికి పాజిటివ్‌గా తేలింది. కలెక్టరేట్‌లో సుమారు 10 మందికి కొవిడ్‌ రాగా, జిల్లాలోని పలు మండలాల తహసీల్దార్లు, ఆర్‌ఐలకు కూడా నిర్ధారణ అయింది. బుధవారం ప్రభుత్వ కార్యాలయాల అధికారులు, సిబ్బంది బుధవారం నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు.

శానిటైజేషన్‌..

కలెక్టరేట్‌లో పలువురు సిబ్బందికి కొవిడ్‌ సోకడంతో  కార్యాలయం అంతటా శానిటైజేషన్‌ చేశారు.  కలెక్టర్‌ అనుదీప్‌, అదనపు కలెక్టర్‌ కె.వెంకటేశ్వర్లు, డీఆర్వో అశోక చక్రవర్తి ఛాంబర్లతోపాటు పలువురు అధికారుల గదులు, వారి వాహనాలను శానిటైజేషన్‌ చేశారు. ఉత్తర, ప్రత్యుత్తరాలు అందించేందుకు వచ్చేవారు, ఫిర్యాదులు అందించేందుకు వచ్చే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని, మాస్క్‌లేనిదే ఎవరిని లోనికి అనుమతించవద్దని కలెక్టర్‌ సిబ్బందిని ఆదేశించారు.


ఎమ్మెల్యే వనమా కుటుంబ సభ్యులకు..

కొత్తగూడెం పట్టణం, న్యూస్‌టుడే: ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తోపాటు కుటుంబ సభ్యులకు కొవిడ్‌ సోకింది. వెన్నెముక శస్త్ర చికిత్స అనంతరం నెల రోజులుగా హైదరాబాద్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉంటున్న ఎమ్మెల్యేకు సహాయకంగా ఆమె సతీమణి, కూతురు, అల్లుడు ఉంటున్నారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే సతీమణికి అస్వస్థతగా అన్పించడంతో అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. దీంతో ఆమెకు కొవిడ్‌ నిర్ధారణ కావడంతో మిగతా కుటుంబ సభ్యులు పరీక్షలు చేయించుకున్నట్లు వనమా సన్నిహితులు పేర్కొంటున్నారు. అనారోగ్యంగా ఉన్న ఆయనను కలిసేందుకు కొత్తగూడెం నుంచి చాలా మంది హైదరాబాద్‌ వెళ్లారు. దీంతో ఆయనను కలిసిన వారిలో ఆందోళన మొదలైంది. నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధపడుతున్నారు.


140 పాజిటివ్‌ కేసులు

జిల్లా వ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో 140 మందికి పాజిటివ్‌గా తేలిందని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మొత్తం 5,652 మంది నుంచి నమూనాలు సేకరించగా భద్రాచలం డివిజన్‌ పరిధిలోని ఆసుపత్రుల్లో 29 మందికి, కొత్తగూడెం డివిజన్‌ పరిధిలోని ఆసుపత్రుల్లో 111 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పాతకొత్తగూడెం యూపీహెచ్‌సీలో 14, రామవరం యూపీహెచ్‌సీలో 15, కొమరారం పీహెచ్‌సీలో 10 మందికి పాజిటివ్‌లు తేలాయి. భద్రాచలం డివిజన్‌ పరిధిలోని చర్ల పీహెచ్‌సీలో అధికంగా 10 కేసులు నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని