logo

గిరిజన పంచాయతీల అభివృద్ధికి రూ.600 కోట్లు

రాష్ట్రవ్యాప్తంగా గిరిజన పంచాయతీల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఈ ఏడాది రూ.600 కోట్లు ఖర్చు చేస్తుందని గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. వచ్చే వారం పది రోజుల్లోనే కొత్త

Published : 25 May 2022 01:44 IST

మంత్రి సత్యవతి రాథోడ్‌

ఖమ్మంలో గిరిజన భవనాన్ని ప్రారంభిస్తున్న మంత్రి సత్యవతి రాథోడ్‌,

చిత్రంలో మంత్రి అజయ్‌, ఎంపీ నామా, డీసీసీబీ ఛైర్మన్‌ నాగభూషయ్య, కలెక్టర్‌ గౌతమ్‌ తదితరులు

ఈటీవీ, ఖమ్మం: రాష్ట్రవ్యాప్తంగా గిరిజన పంచాయతీల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఈ ఏడాది రూ.600 కోట్లు ఖర్చు చేస్తుందని గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. వచ్చే వారం పది రోజుల్లోనే కొత్త పంచాయతీల్లో నూతన భవనాలకు రూ.25 లక్షల చొప్పున మంజూరు చేస్తామన్నారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి మంగళవారం ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. గిరిజనులను ఓటుబ్యాంకు రాజకీయాల కోసం వాడుకోవాలని కాంగ్రెస్‌, భాజపా చూశాయన్నారు. 75 ఏళ్లలో గిరిజనులకు కాంగ్రెస్‌, భాజపా చేసిందేమీ లేదన్నారు. గిరిజన జాతి అవసరాలను తెలుసుకుని మరీ.. అభివృద్ధి వైపు నడిపిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. విద్య ఒక్కటే గిరిజన జాతిలో మార్పు తెస్తుందని భావించి సీఎం కేసీఆర్‌ గిరిజన విద్యను బలోపేతం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 3,146 కొత్త గిరిజన పంచాయతీలు ఏర్పాటు చేసిన ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. భాజపాకు చిత్తశుద్ధి ఉంటే గిరిజన రిజర్వేషన్లు పెంచిన తర్వాతే ప్రజల దగ్గరికి వెళ్లాలని సూచించారు. దేశానికి తెలంగాణ ఐకాన్‌గా మారుతుందని మంత్రి పువ్వాడ అజయ్‌ పేర్కొన్నారు. ప్రతీ పల్లె మురిసే విధంగా గ్రామాలను అభివృద్ధి చేస్తుంటే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి మాత్రం కనిపించడం లేదని మండిపడ్డారు. రచ్చబండలు, పాదయాత్రల పేరుతో వస్తున్న వలస పక్షులకు ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. రాష్ట్ర అభివృద్ధిని నిలువరించేందుకు భాజపా కుట్రలు చేస్తుందని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఈ కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. దిల్లీ కన్నా గొప్పగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చేయాలన్న సంసల్పంతో సీఎం కేసీఆర్‌ ఉన్నారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని