logo

ఖమ్మం గుమ్మంలో రాజకీయ వేఢీ

శాసనసభ ఎన్నికలకు గడువు సమీపిస్తున్నకొద్దీ రాజకీయ వేడి రాజుకుంటోంది. ప్రధాన పార్టీలు ప్రజాక్షేత్రంలో తలమునకలవుతున్నాయి. ఇందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వేదికవుతోంది.

Updated : 13 Jun 2023 06:16 IST

ఈ టీవీ,ఖమ్మం

శాసనసభ ఎన్నికలకు గడువు సమీపిస్తున్నకొద్దీ రాజకీయ వేడి రాజుకుంటోంది. ప్రధాన పార్టీలు ప్రజాక్షేత్రంలో తలమునకలవుతున్నాయి. ఇందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వేదికవుతోంది. భాజపా, కాంగ్రెస్‌ అగ్రనేతలు ఖమ్మం దారి పడుతుండటం, వామపక్ష పార్టీలు సైతం ఇక్కడి నుంచే ఎన్నికల క్షేత్రంలోకి దిగేలా కార్యాచరణ రూపొందించుకోవడంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంటోంది.  

చంద్రబాబు రాకతో తెలుగు తమ్ముళ్లలో జోష్‌

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు  గతేడాది ఆఖరులో ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభకు హాజరై పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపారు. రాబోయే ఎన్నికలకు సన్నద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం సీపీఎం ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలు జరిగాయి. కేరళ సీఎం పినరయి విజయన్‌ హాజరై సమరోత్సాహం నూరిపోశారు.

భారాస ఆవిర్భావ సభతో మొదలు..

జాతీయ రాజకీయాల్లో సత్తా చాటాలన్న లక్ష్యంతో ఈ ఏడాది ఆరంభంలోనే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ.. ఆవిర్భావ సభను ఖమ్మంలో నిర్వహించారు. ఉద్యమాల గుమ్మం ఖమ్మంలో పురుడు పోసుకున్న భారాస.. జాతీయ రాజకీయాల్లో రాణిస్తుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. కొత్తగూడెం వేదికగా ప్రజాగర్జన పేరిట ఆదివారం నిర్వహించిన భారీ బహిరంగ సభతో సీపీఐ.. ఎర్రదండును కదనరంగంలోకి దింపింది.

భాజపా అగ్రనేతల రాక..

ఖమ్మంలో గురువారం జరిగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా బహిరంగ సభను కమలదళం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పార్టీకి బలం లేదన్న చోటే సత్తా చాటాలనే తలంపుతో ఉంది. సభకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, పొరుగున ఉన్న జిల్లాల నుంచి జనాలను సమీకరించేందుకు ఆపార్టీ నాయకులు వ్యూహాలు పన్నుతున్నారు. జులైలో కొత్తగూడెంలో మరో భారీ బహిరంగ సభ నిర్వహించాలని  యోచిస్తున్నారు. ఆ సభకు ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు కసరత్తు చేస్తున్నారు.   నెల వ్యవధిలోనే ఇద్దరు అగ్రనేతల పర్యటనతో పార్టీ నాయకులు, శ్రేణుల్ని   ఎన్నికల క్షేత్రంలోకి దించేలా భాజపా ప్రణాళికలు రచిస్తోంది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని