logo

గవర్నర్‌ దత్తత గ్రామంలో.. సాగని చదువులు

ఆవరణంతా దట్టంగా పెరిగిన పిచ్చి మొక్కలతో అధ్వానంగా ఉన్న ఈ చిత్రాన్ని చూస్తే ఇదేదో మూసి వేసిన పాఠశాల భవనం అనుకుంటారు. కానీ ఈ భవనం ఉన్న గ్రామానికి రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది.

Published : 26 Jul 2023 04:16 IST

అశ్వారావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే : ఆవరణంతా దట్టంగా పెరిగిన పిచ్చి మొక్కలతో అధ్వానంగా ఉన్న ఈ చిత్రాన్ని చూస్తే ఇదేదో మూసి వేసిన పాఠశాల భవనం అనుకుంటారు. కానీ ఈ భవనం ఉన్న గ్రామానికి రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై దత్తత గ్రామంలోని బడి దుస్థితి ఇది. మారుమూల అటవీ ప్రాంతాల్లో జీవనం సాగించే కొండరెడ్ల జీవన విధానాన్ని మెరుగుపర్చేందుకు రాష్ట్రంలో మూడు జిల్లాల్లో ఆరు కొండరెడ్ల గ్రామాలను రాష్ట్ర గవర్నర్‌ దత్తత తీసుకున్నారు. అందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గోగులపూడి ఒకటి. ఈ గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలే ఇది.

ఉపాధ్యాయులను సర్దుబాటు చేసినా..

ఈ పాఠశాలలో ఒకటి నుంచి అయిదు తరగతులు చదువుతున్న 18 మంది విద్యార్థులున్నారు. వేసవి సెలవులకు ముందు ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయుడు 370 జీవోలో బదిలీపై సొంత జిల్లాకు వెళ్లారు. అప్పటి నుంచి ఇక్కడ ఉపాధ్యాయులను ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ఈ గ్రామానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పండువారిగూడెం ప్రాథమికోన్నత పాఠశాల నుంచి ముగ్గురు ఉపాధ్యాయులు నెలకు ఒకరు చొప్పున విధులు నిర్వహించే విధంగా స్థానిక ఎంఈవో కృష్ణయ్య సర్దుబాటు చేశారు. వారు సక్రమంగా విధులకు రాకపోవడంతో ఏ రోజు పాఠశాల తెరుస్తారో తెలియని పరిస్థితి నెలకొందని, వారంలో మూడు, నాలుగు రోజులు పాఠశాల మూసే ఉంటుందని గ్రామస్థులు తెలిపారు. దీంతో చదువులు సజావుగా సాగక విద్యార్థులు చదువుల్లో వెనుకబడుతున్నారు. అంతేకాదు పాఠశాల భవనం చుట్టూ పిచ్చి మొక్కలు, ఎండిపోయిన చెట్లు ఉండటంతో విషసర్పాలు గదుల్లోకి వచ్చే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకుని శాశ్వతంగా ఉపాధ్యాయున్ని నియమించడంతోపాటు పాఠశాల ఆవరణను శుభ్రం చేయించాలని వారు కోరుతున్నారు.

* ఈ విషయమై ఎంఈవో కృష్ణయ్యను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై నియమించామని, వారు సక్రమంగా విధులకు వెళ్తున్నామని చెపుతున్నారన్నారు. గైర్హాజరు విషయం తన దృష్టికి రాలేదని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

గోగులపూడిలోని బడి దుస్థితి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు