logo

శోకసంద్రంలో ముంచొద్దు..!

వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు యువత, చిన్నారులు ఈతకెళ్తుంటారు. వీరిలో ఎక్కువమంది వ్యవసాయ బావులను ఆశ్రయిస్తున్నారు. ఇంకొందరు చెరువులు, వాగులు, కుంటల్లో సైతం జలకాలాడుతున్నారు.

Updated : 18 Apr 2024 06:37 IST

ఈత సాధన వేళ జాగ్రత్తలు మేలు..

ఇల్లెందు గ్రామీణం, న్యూస్‌టుడే: వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు యువత, చిన్నారులు ఈతకెళ్తుంటారు. వీరిలో ఎక్కువమంది వ్యవసాయ బావులను ఆశ్రయిస్తున్నారు. ఇంకొందరు చెరువులు, వాగులు, కుంటల్లో సైతం జలకాలాడుతున్నారు. ఈ ప్రయత్నంలో తమకు ఈత రాకున్నా ఎలాంటి పర్యవేక్షణ లేకుండా, జాగ్రత్తలు తీసుకోకుండా తోటివారితో కలిసి జలాశయంలో దూకుతూ ప్రమాదవశాత్తు మృత్యువాత పడుతున్నారు. సరదా మాటున విషాదం చోటుచేసుకుంటుండటంతో బాధిత కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోతున్నాయి. ఈత కోసం వెళ్లి మృత్యువాత పడుతున్న ఘటనల్లో ఎక్కువగా చిన్నారులు, యువతే ఉంటున్నారు. కొద్ది రోజుల్లో వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈత నేర్చుకోవాలన్న ఉత్సాహంతో చిన్నారులు బావులు, వాగులు, వంకలబాట పట్టే ఆస్కారం ఉంది.


ఉభయ జిల్లాల్లో ప్రమాదాలకు కారణాలివి..

  • స్నేహితులతో సరదాగా జలాశయాలకు వద్దకు వెళ్లే చిన్నారులు ఈతకొట్టే వారి ఉత్సాహాన్ని చూసి తమకు రాకున్నా అప్పటికప్పుడు నీళ్లలో దిగి చనిపోతున్నారు.
  • ఈత నేర్చుకునే క్రమంలో ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండానే కొందరు దూకుతున్నారు. ట్యూబ్‌లు, సేఫ్‌గార్డ్స్‌ వంటివి ధరించకుండా మృత్యువాత పడుతున్నారు.
  • రక్షణ సామగ్రితోపాటు నిపుణుల పర్యవేక్షణ చాలా అవసరం. తల్లిదండ్రులు ఈ విషయాన్ని విస్మరిస్తున్నారు.
  • వాగులు, కుంటలు, బావుల్లోకి దిగే క్రమంలో లోతు అంచనా వేయకపోవడం ప్రధాన సమస్య. ఎత్తునుంచి దూకే ప్రయత్నంలో అడుగున ఏముందో తెలియకపోవడంతో ప్రమాదాల బారినపడుతున్నారు. కొందరు మట్టి, బురదలో కూరుకపోతున్నారు. ఇలాంటి ఘటనల్లో ఈత వచ్చిన వారు సైతం మృత్యువాత పడుతున్నారు.
  • ఒక్కోసారి నీళ్లలో మునిగిపోతున్న వారిని కాపాడే క్రమంలో ఈతగాళ్లు సైతం ప్రమాదాల బారినపడుతున్నారు.
  • కొత్త ప్రదేశాలపై అవగాహన లేకుండా సాహసాలు చేస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. విహార యాత్రకు వెళ్లేవారు, ముఖ్యంగా స్నేహితులతో కలిసి కొత్త ప్రాంతాల్లో బావులు, నదులు చెరువులు, నీటి ప్రవాహ కాలువల్లో ఈత కొట్టేందుకు ఉత్సాహం చూపిస్తారు. లోతు అంచనా వేయకుండా దూకుతూ ప్రమాదం కొనితెచ్చుకుంటున్నారు.
  • కాలువల్లో తక్కువ లోతు ఉంటుందనే ఉద్దేశంతో విద్యార్థులు అందులో దిగి ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు.

ఉసూరుమన్న ప్రాణాలెన్నో..

  • ఇల్లెందు మండలం మామిడిగుండాలలో ఈ నెల 11న ఈతకు వెళ్లిన యువకుడు భిక్షపతి దుర్మరణం పాలయ్యాడు. అప్పుడప్పుడూ వెళ్తున్న వ్యవసాయ బావి అయినప్పటికీ తగిన జాగ్రత్త తీసుకోకపోవటంతో నీట మునిగాడు. చాలా లోతుగా ఉన్న బావిలో అతని ఆచూకీ కనుగునేందుకు రెండు గంటలు పట్టింది.
  • పాల్వంచ మండలం సూరారం గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి గత నెల మిత్రులతో సరదాగా గ్రామ సమీప చెరువులో ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డాడు.
  • చుంచుపల్లి మండలానికి చెందిన యువకుడు రాంబాబు హోలీ వేడుకల అనంతరం సమీపంలోని వాగులో మిత్రులతో స్నానానికి వెళ్లి దుర్మరణం పాలయ్యాడు.
  • గత జనవరిలో కిన్నెరసాని కాలువలో సరదాగా ఈతకు వెళ్లిన టేకులపల్లి మండలం సీతరాంపురం గ్రామానికి చెందిన విద్యార్థి అజయ్‌ ప్రమాదవశాత్తు కాలువలో మునిగి మృతిచెందాడు.  
  • గతేడాది భద్రాచలంలో ఆరుగురు విద్యార్థులు గోదావరి వద్దకు వెళ్లగా అందులో ఇద్దరు వాసు, అక్బర్‌ నీటిలో గల్లంతై విగత జీవులుగా మారారు.

‘‘ఈతలో ప్రావీణ్యం చాలా ముఖ్యం. నిపుణుల పర్యవేక్షణలోనే ఇది సాధ్యం. లేకపోతే సరదా కాస్తా విషాదంగా మారే ఆస్కారం ఉంది. నీరు నిల్వ ఉండే చెరువులు, కుంటల్లో బురద, నాచులో చిక్కుకొని పోయి చనిపోతున్నారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితిలో ఈత జోలికెళ్లొద్దు. ప్రమాదవశాత్తు నీట మునిగిన వారికి శ్వాసగానీ, పల్స్‌లేని సమయాల్లో సీపీఆర్‌ ద్వారా ప్రాణాలు దక్కించే అవకాశం ఉంది. దీనిపై అవగాహన ఉండాలి.’’

జయకృష్ణ, ఉమ్మడి ఖమ్మం జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి (ఎఫ్‌ఏసీ)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని