logo

అకాల వర్షం.. అన్నదాతల కలవరం

రైతన్న జీవితాలతో ప్రకృతి చెలగాటమాడింది. అనుగ్రహానికి బదులు ఆగ్రహాన్ని చూపించడంతో వారి జీవితాలు అతలాకుతలం అయ్యాయి. స్వేదం చిందించిన వారికి కన్నీరే మిగిలింది. ప్రకృతి విలయతాండవానికి వారి ఆశలు నీరుగారిపోయాయి.

Published : 07 May 2022 07:10 IST

తాటిపాకలో ముద్దయిన ధాన్యం

రాజోలు, మామిడికుదురు, ఆత్రేయపురం, న్యూస్‌టుడే: రైతన్న జీవితాలతో ప్రకృతి చెలగాటమాడింది. అనుగ్రహానికి బదులు ఆగ్రహాన్ని చూపించడంతో వారి జీవితాలు అతలాకుతలం అయ్యాయి. స్వేదం చిందించిన వారికి కన్నీరే మిగిలింది. ప్రకృతి విలయతాండవానికి వారి ఆశలు నీరుగారిపోయాయి. శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురవడంతో రైతులు కలవరానికి గురయ్యారు. మెరుపులు, ఉరుములతో మామిడికుదురు, పరిసర గ్రామాల్లో కురిసిన భారీ వర్షానికి పలువీధులు జలమయమయ్యాయి. కోతకు సిద్ధంగా ఉన్న దాళ్వా వరి చేలు కొంతమేర ఒరిగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షంతో కుదేలవుతున్నారు. ప్రకృతి కరుణిస్తే ప్రతి సీజన్లోనూ అరటి రైతుకు బంగారం పండుతుంది. ఆత్రేయపురం మండలంలో మరి కొద్దిరోజుల్లో గెలలు కోతకు వస్తాయి అని ఎదురుచూస్తున్న తరుణంలో ఈ విపత్తు సంభవించిందని రైతులు వాపోయారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని వారు వాపోతున్నారు.

నీట మునిగిన వరి పంట

అల్లవరం: అల్లవరం మండలం బెండమూర్లంకలో ప్రధాన కాలువ వద్దనుంచి ఓడలరేవు గ్రామంలోని ఓఎన్జీసీ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్న టెర్మినల్‌కు నీటిని తరలించే ఫైప్‌లైను పగలడంతో వరిపంట నీట మునిగింది. గురువారం రాత్రి పైపులైను పగిలిపోవడంతో శుక్రవారం ఉదయానికి అరగట్లపాలెంలోని యాళ్ల దొరబాబు పొలంలో వరి పనలు సుమారు ఏడెకరాల్లో మునిగాయి. మునిగిన పంటను కూలీలతో ఒడ్డుకు చేర్చారు. నీటిలో నానిపోవడంతో రంగు మారుతుందని ఆయన వాపోతున్నారు. నిరంతరం పర్యవేక్షించాల్సిన అధికారుల అలసత్వం కారణంగానే ఇలా జరిగిందని, చర్యలు చేపట్టాలని స్థానికులు అంటున్నారు. శనివారం ఉదయం ఓఎన్జీసీ విపత్తుల నిర్వహణ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని, నీటి మళ్లింపును నిలిపివేసి పరిస్థితిని సమీక్షించారు.

కాట్రేనికోన: కోనసీమలోని పలు ప్రాంతాల్లో నాలుగు రోజులుగా అకాల వర్షపు జల్లులు కురుస్తుండడంతో రైతులు తీవ్ర ఇక్కట్లుపడుతున్నారు. మేఘాలు కమ్మేయగానే కళ్లాల్లో ధాన్యం, కుప్పలు, బస్తాలపై బరకాలు వేసుకోవడం, అంతలోనే ఎండ కాయడంతో మళ్లీ ఆరబెట్టడం చేస్తున్నారు. శుక్రవారం అకస్మాత్తుగా వర్షం కురవడంతో వరి పనలు, కొన్నిచోట్ల ఎండబెట్టిన ధాన్యం తడిచాయి. దీనిపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండించిన పంట చేతికొచ్చేవరకు వరుణుడు కరుణిస్తాడో, లేదోనని వారంతా ఆవేదనతో ఉన్నారు.

నీట మునిగిన వరి పనలు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని