logo

ఆ పనులు పూర్తిచేద్దురూ..

రాజధాని అమరావతిలో నిలిచిన పనులను ప్రాధాన్యతా క్రమంలో దశలవారీగా తిరిగి ప్రారంభించాలని రైతులు సీఆర్డీఏ కమిషనర్‌కు ఇచ్చిన వినతిపత్రంలో కోరారు. బుధవారం సాయంత్రం విజయవాడ సీఆర్డీఏ

Updated : 19 May 2022 02:58 IST

సీఆర్డీఏ కమిషనర్‌కు రాజధాని రైతుల వినతి

ఈనాడు - అమరావతి

రాజధాని అమరావతిలో నిలిచిన పనులను ప్రాధాన్యతా క్రమంలో దశలవారీగా తిరిగి ప్రారంభించాలని రైతులు సీఆర్డీఏ కమిషనర్‌కు ఇచ్చిన వినతిపత్రంలో కోరారు. బుధవారం సాయంత్రం విజయవాడ సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో రైతులు కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ను కలిశారు. రాజధానిలో ప్రతిపాదిత, మధ్యలో ఆగిన వివిధ ప్రాజెక్టుల పనులను తక్షణమే చేపట్టేందుకు కమిషనర్‌ చూపుతున్న చొరవకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. నిర్ణీత కాల వ్యవధిలోగా బృహత్‌ ప్రణాళిక, సీర్డీఏ చట్టం ప్రకారం అన్ని అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. గత మూడేళ్లుగా రైతులకు చెల్లించాల్సిన కౌలును సకాలంలో ఇవ్వడం లేదని, ఈ ఏడాది కూడా ఇంకా జమకాలేదని ఆయన దృష్టికి తెచ్చారు. రూ. 208 కోట్లు డబ్బులు వచ్చాయని, త్వరలో రైతులకు అందిస్తామని వివరించారు. తాము ఆయన దృష్టికి తీసుకొచ్చిన పలు అంశాలకు సీఆర్డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ సానుకూలంగా స్పందించినట్లు రాజధాని రైతులు చెప్పారు. త్వరలో రైతులతో సీఆర్డీఏ అధికారులు సమన్వయ సమావేశం ఏర్పాటు చేసేందుకు ఆయన ఆంగీకరించినట్లు తెలిపారు.

దృష్టికి తీసుకొచ్చిన అంశాలివీ..

* ప్లాట్లలో పెరిగిన కంప, చెట్లను తొలగించాలి. అనధికారికంగా సాగు చేస్తున్న పంటలను తొలగించాలి.

* వర్షా కాలంలో ఇబ్బందులు తలెత్తకుండా కొండవీటి వాగు ప్రాజెక్టును పూర్తి చేయాలి.

* అన్ని సదుపాయాలతో లేఔట్లను అభివృద్ధి చేయాలి.

* అసైన్డ్‌ భూములను క్రమబద్ధీకరించాలి. వీటికి కూడా వార్షిక కౌలు అందజేయాలి.

* హ్యాపీనెస్ట్‌ నిర్మాణాన్ని తక్షణమే ప్రారంభించాలి.

* అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు న్యాయమూర్తులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీసు అధికారుల భవనాల నిర్మాణాలను పూర్తి చేయాలి.

* కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన స్థలాల్లో భవనాలు నిర్మించేలా చూడాలి.

* టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించేలా చొరవ తీసుకోవాలి.

* గ్రామాల సరిహద్దులను గుర్తించి, వాటికి సంబంధించి తుది నోటిఫికేషన్‌ జారీ చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని