logo

ఎమ్మెల్యే పేరు చెప్పి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు

తమ పంచాయతీలో ఏ అభివృద్ధి పని ప్రారంభించినా ఎమ్మెల్యే పేరు చెప్పి అడ్డుకుంటున్నారని నంద్యాల జిల్లా గడివేముల మండలం చిందుకూరు సర్పంచి అనసూయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 27 Nov 2022 02:34 IST

మండల సమావేశంలో తెదేపా సర్పంచి ఆవేదన

సమస్యలు చెబుతున్న చిందుకూరు సర్పంచి అనసూయమ్మ

గడివేముల, న్యూస్‌టుడే : తమ పంచాయతీలో ఏ అభివృద్ధి పని ప్రారంభించినా ఎమ్మెల్యే పేరు చెప్పి అడ్డుకుంటున్నారని నంద్యాల జిల్లా గడివేముల మండలం చిందుకూరు సర్పంచి అనసూయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అధ్యక్షతన గడివేములలో శనివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేస్తున్నట్లు చెప్పారు. ఈసందర్భంగా అనసూయమ్మ మాట్లాడుతూ.. తమ గ్రామంలో ఏ పనీ చేయనీయడం లేదన్నారు. రైతు భరోసా కేంద్రం నిర్మిస్తామంటే స్థలంపై అభ్యంతరాలు చెబుతున్నారని తెలిపారు. పనులు చేయకుండానే రూ.3.30 లక్షలు చెల్లించాలని నోటీసులు ఇచ్చారని, పనులు చేయనప్పుడు నిధులు ఎందుకివ్వాలని ప్రశ్నించారు. గ్రామంలో పైపులైను పనులు చేస్తుంటే ఎమ్మెల్యే చెప్పారని నిలిపివేశారని చెప్పారు. చేతిపంపుల మరమ్మతుల కోసం సామగ్రిని తెచ్చి సచివాలయంలో దించిన పది నిమిషాల్లోనే జడ్పీటీసీ సభ్యుడు వద్దన్నారని వెనక్కి తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో కొందరు ఉపాధి పనులకు వెళ్లకుండానే బిల్లులు తీసుకుంటున్నారని ఆరోపించారు. చనిపోయిన వారు కూడా ఉపాధి పనులు చేసినట్లు చూపి నిధులు కాజేశారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి పనులను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోబోమని చెప్పారు. ఉపాధి పనులు చేయకున్నా బిల్లులు తీసుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంపీపీ నాగమద్దమ్మ, జడ్పీటీసీ సభ్యుడు ఆర్‌బీ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని