logo

కునుకు పట్టదు.. వణుకు వీడదు

రయ్‌... రయ్‌ మంటూ దూసుకొచ్చే కార్లు.. అడుగడుగునా పోలీసుల తనిఖీలు.. అధికార పార్టీ నేతల అరుపులతో నగరంలోని గాయత్రి ఎస్టేట్‌ వాసులకు నిద్ర కరవైంది.

Published : 24 May 2023 03:17 IST

అధికార పార్టీ నేతల హల్‌చల్‌
భయం గుప్పిట్లో గాయత్రి ఎస్టేట్‌ వాసులు

గాయత్రి ఎస్టేట్‌లోని ఓ కాలనీ వైద్యుల ఇళ్ల ఎదుట బారులు తీరిన వైఎస్సార్‌ జిల్లా వాసుల వాహనాలు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: రయ్‌... రయ్‌ మంటూ దూసుకొచ్చే కార్లు.. అడుగడుగునా పోలీసుల తనిఖీలు.. అధికార పార్టీ నేతల అరుపులతో నగరంలోని గాయత్రి ఎస్టేట్‌ వాసులకు నిద్ర కరవైంది. ప్రశాంత వాతావరణలో ఉంటే ఆ కాలనీ వాసులు భయంభయంతో గడుపుతున్నారు. కనీసం ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గులు వేసే పరిస్థితి కరవైంది.  తల్లి శ్రీలక్ష్మి గుండె జబ్బుతో బాధపడుతోందంటూ కడప ఎంపీ అవినాష్‌రెడ్డి కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్‌లోని విశ్వభారతి ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన్ను అరెస్టు చేసేందుకు సీబీఐ అధికారులొచ్చారు.. అడ్డుకోవాలన్న ఉద్దేశంతో వైకాపా నేతలు ఆసుపత్రి ఎదుట తిష్ట వేశారు. అప్పటి నుంచి అక్కడ బందోబస్తు పెరగడం.. వైకాపా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలొస్తున్నారు. రోడ్లపై వాహనాలు నిలపడం.. నినాదాలు చేయడం.. అడ్డొచ్చేవారిపై దాడులకు దిగడంతో కాలనీ వాసులు భయపడిపోతున్నారు.  

గాయత్రి ఎస్టేట్‌లో ఆసుపత్రులు, వ్యాపారాలకు కేంద్రం. ప్రముఖ వైద్యులంతా అదే కాలనీలో ఉంటారు. అధికార పార్టీ నేతల హంగామాతో కాలనీ వాసులు భయపడుతున్నారు. కొందరు మద్యం తాగి హల్‌చల్‌ చేస్తుండటంతో బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. విశ్వభారతి మార్గం పూర్తిగా మూసివేయటంతో రహదారులపైనే కూర్చోవటం, తినటం, పడుకోవటంతో ఆ మార్గం స్తంభించిపోయింది.  పగలంతా కూలీ పని చేసి రాత్రి నిద్రతో ఉపశమనం పొందే బిర్లాగడ్డకాలనీవాసులకు కునుకు కరవైంది.  అందరినీ దబాయించే పోలీసు అధికారులు వైకాపా నాయకుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకునే ధైర్యం చేయలేకపోతున్నారు. ఏదైనా జరిగితే వ్యవహారం సీఎం కార్యాలయం వరకు వెళ్తుందని భయపడుతున్నారు. పోలీసుల బలహీనతను గ్రహించిన అనినాష్‌రెడ్డి అనుచరులు అందరినీ భయపెడుతున్నారు.

ఎక్కడపడితే అక్కడ వాహనాల నిలిపివేత

రోడ్లపై వైకాపా నేతలు

* గాయత్రి ఎస్టేట్‌ సమీప లాడ్జీల్లో బస చేసిన ఎంపీ అనుచరులు ఇష్టారాజ్యంగా వాహనాలు పార్క్‌ చేస్తున్నారు. ఇళ్లు, దుకాణాలు, ఆసుపత్రులు, క్ల్లీనిక్‌, ఇతర వ్యాపార కేంద్రాల ఎదుట అడ్డంగా నిలిపేస్తున్నారు. పలువురిపై దాడులకు దిగడంతో అడిగే సాహసం చేయలేకపోతున్నారు.

* చాలామంది వ్యాపారులు, క్ల్లీనిక్‌లు మూసివేసి నష్టాలపాలవుతున్నారు. ఓ ఆసుపత్రి నిర్వాహకుడు ఏకంగా తన ఆసుపత్రిలో సగభాగం అతిథిగృహంగా మార్చి వారికి ఇచ్చేశాడు. క్ల్లీనిక్‌ మూతబడటంతో పగటి సమయంలో రోగులు ఇబ్బందిపడుతున్నారు. 24 గంటలూ గుంపులుగా తిరుగుతూ గోల చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని