logo

బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం

తాము 40 ఏళ్లుగా రాజకీయాలకతీతంగా ప్రజలకు సేవ చేస్తున్నామని, 20 రోజుల ముందు వచ్చిన ఓ వ్యక్తి ప్రజలకు సేవ చేస్తామని.. ఓటేయండి అని అంటున్నారని.. ఆ మాటలు నమ్మొద్దని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టి.జి.భరత్‌ కోరారు.

Published : 29 Mar 2024 06:12 IST

సమావేశంలో మాట్లాడుతున్న టి.జి.భరత్‌

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: తాము 40 ఏళ్లుగా రాజకీయాలకతీతంగా ప్రజలకు సేవ చేస్తున్నామని, 20 రోజుల ముందు వచ్చిన ఓ వ్యక్తి ప్రజలకు సేవ చేస్తామని.. ఓటేయండి అని అంటున్నారని.. ఆ మాటలు నమ్మొద్దని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టి.జి.భరత్‌ కోరారు. కర్నూలు పెద్దపడఖానాలో గురువారం నిర్వహించిన జయహో బీసీ సభలో పాల్గొని మాట్లాడారు. తాము గెలిచినా.. ఓడినా కర్నూలు ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటున్నామన్నారు. కర్నూలులో ఇప్పుడే నీటి కష్టాలు మొదలయ్యాయని చెప్పారు. నీటి కష్టాలను దృష్టిలో పెట్టుకొని తన తండ్రి టీజీ వెంకటేశ్‌ 2014 ఎన్నికలకు ముందు చెక్‌డ్యామ్‌ నిర్మించాలని జీవో తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఆయన ఓడిపోయిన తర్వాత వచ్చిన పాలకులు ఆ జీవోను పక్కన పెట్టేశారన్నారు. బీసీల కోసం చంద్రబాబు నాయుడు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురానున్నారని పేర్కొన్నారు. బీసీ ఉప ప్రణాళిక అమలులో భాగంగా ఏడాదికి రూ.30 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. వైకాపా నేతలు చెప్పే గాలి మాటలకు మోసపోవద్దని.. రానున్న ఎన్నికల్లో తెదేపాను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ పరమేష్‌, కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ బీసీ సెల్‌ అధ్యక్షుడు సత్రం రామకృష్ణుడు, బీసీ సెల్‌ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ సంజీవలక్ష్మి, తిరుపాల్‌బాబు, విజయలక్ష్మి, శ్రీనివాసులు, బాలు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని