logo

ప్రతి మహిళకు నెలకు రూ.1500

తెదేపా సూపర్‌ సిక్స్‌ పథకాల్లో భాగంగా ప్రతి మహిళకు రూ.1500 అందజేస్తామని ఎమ్మిగనూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని 33, 34వ వార్డుల్లో ప్రచారం చేశారు.

Published : 05 May 2024 02:55 IST

34వ వార్డులో ప్రచారం చేస్తున్న తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: తెదేపా సూపర్‌ సిక్స్‌ పథకాల్లో భాగంగా ప్రతి మహిళకు రూ.1500 అందజేస్తామని ఎమ్మిగనూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని 33, 34వ వార్డుల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైకాపా పాలనలో చెత్త, ఇంటి పన్ను, కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలపై భారం వేశారని ఆరోపించారు. ఐదేళ్లలో అభివృద్ధిని విస్మరించి, దౌర్జన్యాలకు పాల్పడి రాష్ట్రాన్ని నాశనం చేశారని ధ్వజమెత్తారు. తెదేపా హయాంలో ఎమ్మిగనూరు పట్టణానికి శాశ్వత తాగునీటి పథకం కింద రూ.146 కోట్లు మంజూరు చేస్తే వైకాపా పాలనలో నిధులు విడుదల చేయకుండా వదిలేశారని మండిపడ్డారు. ఎమ్మిగనూరు అభివృద్ధికి పైసా ఖర్చు చేయలేదన్నారు. నాయకులు షాబీర్‌, సిరాబుద్ధీన్‌, వీరేష్‌, రామకృష్ణనాయుడు, కొండయ్యచౌదరి, రాందాస్‌గౌడు, భాస్కర్‌ పాల్గొన్నారు.

చేనేతల సంక్షేమానికి పెద్దపీట: ఎంపీ సంజీవ్‌

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: తెదేపా అధికారంలోకి రాగానే చేనేతల సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని కర్నూలు ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌ పేర్కొన్నారు. శనివారం ఎమ్మిగనూరులోని సంజీవ్‌నగర్‌ కాలనీలో చేనేత ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఐదేళ్ల వైకాపా పాలనలో చేనేతలకు చేసింది శూన్యమన్నారు. నేతన్న నేస్తం కింద నిబంధనలు పెట్టి తక్కువ మంది కార్మికులకు పథకం అమలు చేసి పేదల కడుపుకొట్టారని ఆరోపించారు. తెదేపా అధికారంలోకి రాగానే ప్రతి కార్మికుడికి నేతన్న నేస్తం కింద రూ.24 వేలు అందజేస్తామన్నారు. పట్టు మగ్గాలపై నేస్తున్న కార్మికులకు 200 యూనిట్లు, పవర్‌ లూమ్‌ మగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తామన్నారు. చేనేత కార్మికులను వైకాపా పూర్తిగా విస్మరించిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. తెదేపా ప్రభుత్వంలో చేనేతల కోసం టెక్స్‌టైల్‌ పార్కు తెస్తే వాటిని వైకాపా ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. చేనేత సంఘం నాయకులు మల్లికార్జున, మిన్నప్ప, ఈరన్న, వెంకటేశ్‌, శ్రీనివాసులు, లక్ష్మన్న, తెదేపా నాయకులు రామకృష్ణనాయుడు, రాందాస్‌గౌడు, రంగన్న, సోమన్న, నజీర్‌ తదితరులు పాల్గొన్నారు.

రానున్నది తెదేపా ప్రభుత్వమే

ఆలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో రానున్నది తెదేపా ప్రభుత్వమేనని తెదేపా రాష్ట్ర కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఉన్నారు. ఆలూరులోని తెదేపా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా ప్రభుత్వంలో ప్రజలపై తీవ్ర భారం పడిందని విమర్శించారు. ఓ వైపు పథకాల రూపంలో నగదును అందిస్తూనే.. మరో వైపు వారి వద్ద నుంచి లాగేసుకున్నారన్నారు. అలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కూటమి ఆధ్వర్యంలో ప్రకటించిన మేనిఫెస్టోకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి నారాయణరెడ్డి, మార్కెట్‌ యార్డు మాజీ ఛైర్మన్‌ రాంనాథ్‌యాదవ్‌, నాయకులు నరసప్ప, కొమ్మురామాంజి, కిషోర్‌, వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

 

ఎన్నికల్లో వైకాపాకు పతనం తప్పదు

ఓర్వకల్లు, న్యూస్‌టుడే: ఎన్నికల్లో వైకాపాకు పతనం తప్పదని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు. ప్రచారంలో భాగంగా మండలంలోని తిప్పాయిపల్లె, బ్రాహ్మణపల్లె, శకునాల తదితర గ్రామాల్లో శనివారం రోడ్‌షో నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తుంగలో తొక్కారని మండిపడ్డారు. తెదేపా హయాంలో జరిగిన అభివృద్ధే తప్ప వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. రానున్న ఎన్నికల్లో తెదేపాకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా తెదేపా మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్‌రెడ్డి, మండల కన్వీనర్‌ గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని