logo

ఉద్యోగుల ఓట్లు గల్లంతు

పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎన్నికల విధులను సక్రమంగా నిర్వహించడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో వందలాది మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఇబ్బందులకు గురయ్యారు. ఎక్కడా సరైన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించలేదు.

Published : 07 May 2024 06:40 IST

తొలిరోజు తీవ్ర గందరగోళం

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎన్నికల విధులను సక్రమంగా నిర్వహించడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో వందలాది మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఇబ్బందులకు గురయ్యారు. ఎక్కడా సరైన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించలేదు. ఉద్యోగులను పోస్టల్‌ బ్యాలట్‌కు దూరం చేసేందుకు వైకాపాకు కొమ్ముకాసే కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోమవారం చోటుచేసుకున్న కొన్ని ఘటనలు దీనికి ఊతమిస్తున్నాయి. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో మొత్తం 20,351 మంది పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. మొదటి రోజైన సోమవారం జిల్లాలో 6,503 (31.59శాతం) మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకొన్నారు.

ఉత్సాహంగా ముందుకొచ్చారు

జిల్లా వ్యాప్తంగా తొలి రోజు పోస్టల్‌ బ్యాలట్‌ వేసేందుకు అధికారులు, ఉద్యోగులు ఉత్సాహం చూపారు. ఎనిమిది కేంద్రాల వద్ద ఓటేసేందుకు ఉద్యోగులు బారులు తీరారు. ఫెసిలిటేషన్‌ కేంద్రాల వివరాలను ఉద్యోగుల చరవాణి నంబర్లకు సంక్షిప్త సమాచారం పంపారు. సమాచారం అందని ఉద్యోగులు ఫెసిలిటేషన్‌ సెంటర్ల కోసం కొంత ఇబ్బందులు పడ్డారు. ఓటింగ్‌ ప్రక్రియలో ఒక్కో ఉద్యోగి ఓటేసేందుకు 10-15 నిమిషాల సమయం పడుతుంది. మొదటి గంటలో తక్కువ మంది ఓటేశారు. ఆ తర్వాత గంట గంటకు పోలింగ్‌ శాతం పెరుగుతూ వచ్చింది.

ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు 8వ తేదీ వరకు ఓటేసేందుకు అవకాశం కల్పించారు. ఈనెల ఒకటో తేదీ నాటికి ఫారం-12 ఇవ్వలేకపోయినవారికి 7, 8 తేదీల్లో వారు ఓటరుగా ఏ నియోజకవర్గంలో నమోదై ఉంటారో వారి కోసం అక్కడి రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో లేదా ఫెసిలిటేషన్‌ సెంటరులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఇంతకీ మాఓట్లెక్కడ..

పోస్టల్‌ బ్యాలట్‌ ఓటు వేద్దామంటే ఇక్కడ ఓటు లేదని చెబుతున్నారని, నందికొట్కూరు కేంద్రం పరిధిలోనూ తమ ఓట్లు లేవని చెప్పారంటూ నగరంలోని సిల్వర్‌జూబ్లీ కళాశాలలో అధికారులను నిలదీస్తున్న ఉద్యోగులు

పాణ్యం ఓటర్ల పరేషాన్‌

పాణ్యం నియోజకవర్గ పరిధిలో ఓటర్లుగా ఉన్న ఉద్యోగులు 1,250 మంది నందికొట్కూరు, ఆళ్లగడ్డ, డోన్‌, శ్రీశైలం తదితర నియోజకవర్గాలకు పీవోలు, ఏపీవోలుగా విధులు నిర్వహిస్తున్నారు. రెండో విడత ఎక్కడైతే శిక్షణకు హాజరయ్యారో అక్కడ ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకొనే అవకాశం కల్పించారు.. అక్కడ జాబితాల్లో వారి పేర్లు కనిపించలేదు. ఆందోళనకు గురైన వారు కర్నూలు జిల్లా కేంద్రంలోని బి.క్యాంపు ప్రభుత్వం బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పాణ్యం నియోజకవర్గ ఫెసిలిటేషన్‌ సెంటరులో ఓటేసేందుకు వచ్చారు. అక్కడా జాబితాలో వారి పేర్లు లేవని.. తాము ఎక్కడికెళ్లి ఓటేయాలంటూ ఎన్నికల సిబ్బంది, రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో)తో ఉద్యోగులు వాగ్వాదానికి దిగారు. 1,500 మంది ఓటర్ల పేర్లు గల్లంతయితే ఎలా.. వారి పరిస్థితి ఏంటని పాణ్యం ఆర్వో, జేసీ నారపురెడ్డి మౌర్యను పాణ్యం తెదేపా అభ్యర్థి గౌరు చరితారెడ్డి ప్రశ్నించారు. ‘‘ ఓటర్ల వివరాలు, పోస్టల్‌ బ్యాలట్‌ సామగ్రిని నంద్యాల జిల్లా కలెక్టర్‌కు పంపాం.. అక్కడి నుంచి ఆయా నియోజకవర్గాలకు జాబితాను పంపాల్సి ఉంది.. సమాచార లోపంతో పొరపాటు జరిగింది.. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ఎక్కడైతే రెండో విడత శిక్షణ పొందారో అక్కడ మంగళవారం ఓటేయొచ్చు లేదంటే కర్నూలు జిల్లా కేంద్రంలోని పాణ్యం ఫెసిలిటేషన్‌ సెంటరులో ఓటేయాలనుకుంటే.. సదరు ఉద్యోగులు మంగళవారం ఫారం-12 దరఖాస్తులు అందజేస్తే వారికి ఈనెల 8న ఇక్కడే ఓటేసేందుకు అవకాశం కల్పిస్తామని’’ ఆర్వో వివరణ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు