logo

గనుల వాటా..జగన్‌ టాటా

గనుల తవ్వకాలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితమయ్యే 10-25 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి పనులకు డీఎంఎఫ్‌ నిధులు వినియోగించుకోవాలని జీవో నంబరు 36 చెబుతోంది.

Updated : 08 May 2024 07:12 IST

పంచాయతీలకు జమ చేయని ప్రభుత్వం
నంద్యాల పట్టణం, బనగానపల్లి

గతం..
గనుల తవ్వకాలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితమయ్యే 10-25 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి పనులకు డీఎంఎఫ్‌ నిధులు వినియోగించుకోవాలని జీవో నంబరు 36 చెబుతోంది. మంచినీరు, విద్య, వైద్య సేవలకు ప్రాధాన్యం ఇవ్వాలని తర్వాత రోడ్లు, ఇతర పనులకు వినియోగించుకోవాలి.

ప్రస్తుతం..
వైకాపా సర్కారు వచ్చాక డీఎంఎఫ్‌ నిధుల వినియోగానికి అవరోధాలు ఎదురవుతున్నాయి. డబ్బుల వినియోగంపై ఆంక్షలు పెట్టడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. డీఎంఎఫ్‌ నిధులతో చేపట్టిన పనుల్లో కదలిక లేకుండా పోయింది.

ఏ సంవత్సరంలో ఏం జరిగింది

  • 2019-2021 మధ్య కాలంలో మైనింగ్‌ లీజుదారుల నుంచి సీనరేజ్‌ ఛార్జీల రూపంలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు ఆదాయం రాలేదు.. వచ్చిన నిధులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. 2021-22, 22-23 సంవత్సరాలకు సంబంధించి ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చింది.
  • జిల్లా విభజన తర్వాత రూ.50 కోట్లపై పంచాయతీ నడిచింది. రెండు జిల్లాలకు సమానంగా పంచాలని జిల్లా విభజన మొదట్లో చెప్పారు. కాదు.. కాదు.. గనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ఎక్కువ నిధులు పంచుకోవాలని తర్వాత సూచించారు.
  • 2023- 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొలిమిగుండ్ల, అవుకు, బేతంచెర్ల, డోన్‌ మండలాల్లో అత్యధికంగా రూ.8 కోట్ల వరకు సీనరేజీ ప్రభుత్వానికి సమకూరింది. కానీ వాటిని పంచాయతీలకు బదిలీ చేయడం లేదు.

ఏటా రూ.60 కోట్ల ఆదాయం

బనగానపల్లి, అవుకు, కొలిమిగుండ్ల, బేతంచెర్ల, పాణ్యం, డోన్‌, ప్యాపిలి, కృష్ణగిరి, వెల్దుర్తి, ఓర్వకల్లు, సి.బెళగల్‌ తదితర మండలాల్లో గనులు ఉన్నాయి. ఒక్క నంద్యాల జిల్లా పరిధిలోనే వెయ్యి వరకు క్వారీలు ఉన్నాయి. ప్రత్యేకించి నాపరాళ్లు, ఇనుప ఖనిజం, సిలికా, క్వార్ట్జ్‌, డోలమైట్‌ గనులు ఉన్నాయి. వీటిని లీజుకు తీసుకున్న వారు సీనరేజి ఛార్జీల్లో 30 శాతం డీఎంఎఫ్‌గా చెల్లించాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాకు సీనరేజీ ఆదాయం రూ.80 కోట్ల వరకు వస్తుంది. ఒక్కో త్రైమాసికానికి సంబంధించి రూ.20 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. కర్నూలు జిల్లాలో రూ.25 కోట్లు, నంద్యాల జిల్లాలో రూ.35 కోట్లు మైనింగ్‌ సీనరేజీ ద్వారా వస్తుంది.

పల్లెలకు పంచని ప్రభుత్వం

గనుల లీజుదారుల నుంచి జిల్లా ఖనిజాభివృద్ధి నిధి (డీఎంఎఫ్‌)కి దండిగా డబ్బులు సమకూరుతున్నాయి. అవి పల్లె ఖాతాకు చేరడం లేదు. ప్రభుత్వ ఆమోదం మేరకు డీపీవో అధికారులు పంచాయతీలకు బదిలీ చేస్తారు. నిబంధనల ప్రకారం ఆదాయంలో 25 శాతం పంచాయతీలకు, 50 శాతం మండల పరిషత్తులకు, 25 శాతం జిల్లా పరిషత్తులకు కేటాయించాలి.  
సీనరేజీ నిధులు పంచాయతీల వారీగా వసూలు చేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నారు. నిధుల కేటాయింపు జరగడం లేదు. కొన్నిచోట్ల గ్రామ పంచాయతీల వారీగా కాకుండా రెవెన్యూ గ్రామం కింద ఆదాయం వచ్చినట్లు చూపుతూ దారి మళ్లిస్తున్నారు. పంచాయతీల వారీగా సీనరేజీని వసూలు చేసినట్లు జిల్లా పంచాయతీ శాఖకు గనుల శాఖ నివేదిక అందించింది. కానీ పంచాయతీల ఖాతాలో జమ కాకపోవడం గమనార్హం.

వినియోగంలో అధికార పెత్తనం

సీనరేజీ నిధులు గనులున్న గ్రామాలకే కేటాయించాల్సి ఉంది. అధికార పార్టీ నేతలు చెప్పిన పల్లెలకు మళ్లిస్తున్నారు. డోన్‌ నియోజకవర్గంలో ఆర్థిక శాఖ మంత్రి సహాయకులు తమ పంట పొలాల్లో రూ.2 కోట్ల డీఎంఎఫ్‌ నిధులతో రోడ్లు వేయించుకున్నారు. దీనిపై గతంలో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. డీఎంఎఫ్‌ నిధుల వినియోగంపై ఆడిట్‌ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారు. గతంలో ఏపీ అకౌంటెంట్‌ జనరల్‌ (ఏజీ) అభ్యంతరం తెలిపినప్పటికీ నిధుల వినియోగంపై ఆడిటింగ్‌ జరగడం లేదు. ప్రజాప్రతినిధులు కలెక్టర్లతో ఒప్పించి తన్నుకుపోతున్నారు. మైనింగ్‌ ప్రాంతాలు కాని చోట్ల వెచ్చించి గనులు ఉండే ప్రాంతాలకు అన్యాయం చేస్తున్నారు.


ఒనగూరని మౌలిక వసతులు

  • బనగానపల్లి నియోజకవర్గంలో పలుకూరు, రామకృష్ణాపురం, దేవనగర్‌, చెర్వుపల్లె, బీరవోలు, రామతీర్థం ప్రాంతాల్లో నాపరాతి గనులెక్కువ. ఒక్క పలుకూరు నుంచే ఏటా రూ.5 కోట్ల వరకు డీఎంఎఫ్‌ ఖాతాలో జమ అవుతున్నాయి. ఆయా ప్రాంతాలకు వెళ్లడానికి ఇప్పటికీ సరైన మార్గం లేదు.
  • కొలిమిగుండ్ల, బనగానపల్లి, ప్యాపిలి, గడివేముల మండలాల పరిధిలో ఆరు సిమెంటు పరిశ్రమలు ఉన్నాయి. నిత్యం వేల టన్నుల ఉత్పత్తి జరుగుతోంది. వెయ్యి మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తికి రూ.27 వేలు జిల్లా ఖనిజాభివృద్ధి (డీఎంఎఫ్‌)కి వెళ్తాయి. ఇలా భారీగా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూరుతున్నా ఆయా ప్రాంతాలు నేటికీ అభివృద్ధికి నోచుకోవడం లేదు.
  • బేతంచెర్ల మండలం ఆర్‌ఎస్‌.రంగాపురం, బుగ్గనపల్లె, చిన్న మల్కాపురం తదితర గ్రామాల్లో ఏడాది కాలంలో ఒక్క అభివృద్ధి పని చేయలేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
  • కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లె, అవుకు మండలం రామాపురం, బేతంచెర్ల మండలం మల్కాపురం, ఎంబాయి, పాణ్యం మండలం తమ్మరాజుపల్లె, ఓర్వకల్లు తదితర ప్రాంతాల్లో సీనరేజీ ఆదాయం రెవెన్యూ గ్రామం కింద వచ్చినట్లు చూపి సమీప పంచాయతీలకు పంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని