logo

ప్రశ్నించే గొంతుకలపై కత్తి

ఐదేళ్ల వైకాపా పాలనలో ప్రజాస్వామ్యం కనుమరుగైంది. అన్యాయాన్ని ప్రశ్నిస్తే దాడులు.. అక్రమాలపై నిలదీస్తే కేసులు.. నిరసన తెలిపితే అణచివేశారు. అడుగడుగునా జగన్‌ నియంతృత్వ పోకడ ప్రదర్శించారు.

Updated : 08 May 2024 07:13 IST

జగన్‌ ప్రభుత్వంలో అందరూ బాధితులే
న్యూస్‌టుడే, కర్నూలు నేరవిభాగం

ఐదేళ్ల వైకాపా పాలనలో ప్రజాస్వామ్యం కనుమరుగైంది. అన్యాయాన్ని ప్రశ్నిస్తే దాడులు.. అక్రమాలపై నిలదీస్తే కేసులు.. నిరసన తెలిపితే అణచివేశారు. అడుగడుగునా జగన్‌ నియంతృత్వ పోకడ ప్రదర్శించారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు, ఉద్యోగులు, వ్యాపారులు.. అన్ని వర్గాల ప్రజలు జగన్‌ ప్రభుత్వంలో బాధితులయ్యారు. సామాన్యులు కనీసం నోరెత్తలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో వైకాపా నేతల దుర్మార్గాలు.. కక్ష సాధింపు చర్యలతో అందరూ అల్లాడిపోయారు.

ఉద్యోగులపై ఉక్కుపాదం

హక్కుల సాధన విషయంలో ప్రభుత్వ ఉద్యోగులను పూర్తిగా అణగదొక్కారు. విజయవాడలో తలపెట్టిన నిరసన కార్యక్రమాలను పోలీసులతో భగ్నం చేయించేందుకు సీఎం యత్నించారు. ముందస్తు అరెస్టులు చేయించటం.. తాఖీదులు ఇవ్వటం, ఉద్యోగ సంఘాల నాయకులను గృహ నిర్బంధం చేయడం తదితర చర్యలతో ఉద్యోగులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. ఉపాధ్యాయుల విషయంలో జగన్‌ మరింత కాఠిన్యం ప్రదర్శించారన్న విమర్శలున్నాయి. చివరికి జిల్లా కేంద్రాల్లోనూ నిరసన వ్యక్తం చేసేందుకు వీలులేకుండా చేశారు.

జగనొస్తే ముందస్తు అరెస్టులు

ఉమ్మడి కర్నూలు జిల్లాకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దాదాపు 11 సార్లు వచ్చారు. వచ్చిన  ప్రతిసారీ ప్రతిపక్ష పార్టీ నాయకులు, విద్యార్థి, ప్రజాసంఘాల నాయకులు కనీసం నిరసన వ్యక్తం చేయకుండా పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. పలువురికి నోటీసులివ్వడం.. గృహ నిర్బంధం చర్యలకు పాల్పడ్డారు. సీఎం వస్తున్నాడంటే అరెస్టు అవుతామన్న భావనను ప్రజాసంఘాల నాయకుల్లో తెప్పించారు.


న్యాయవాదులకూ ఆటంకాలే

పీ భూయాజమాన్య హక్కు చట్టానికి వ్యతిరేకంగా ఉమ్మడి జిల్లాలో న్యాయవాదులందరూ సుదీర్ఘకాలం పోరాటం చేశారు. జిల్లా కేంద్రంలో దాదాపు రెండు నెలలపాటు ఆందోళన కార్యక్రమాలు, రిలే నిరాహార దీక్షలు చేశారు. ఈ చట్టంపై ప్రభుత్వం పునరాలోచన చేయకుండా అణచివేత చర్యలకు పాల్పడింది. చివరికి న్యాయవాదులు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఇటీవల దీనిని అమలుచేయాలంటూ ప్రభుత్వం మెమో జారీ చేయటంతో వారు తీవ్ర నిరాశకు గురయ్యారు.


నోరు విప్పితే రౌడీషీట్‌

పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అవినీతి అక్రమాలపై మాట్లాడిన తెదేపా నంద్యాల పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌పై ఓర్వకల్లు పోలీసుస్టేషన్‌లో ఏకంగా రౌడీషీట్‌ తెరిచారు. ఇటీవల కల్లూరు మండలం తడకనపల్లెకు ప్రచారం నిమిత్తం ఎమ్మెల్యే కాటసాని వెళ్లారు. ప్రశ్నించిన జనసేన నాయకుడిపై ఆయన  అనుచరులు ఒక్కసారిగా దాడికి దిగారు. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరులపై బాధితుడు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా కౌంటర్‌ కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పడంతో వెనుదిరిగారు. అంతకుముందే బాధితుడి తల్లిపై కుట్ర పన్ని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించి నోరు మెదపకుండా చేశారు. ఎమ్మెల్యే తీరు నచ్చక పార్టీ మారేందుకు సిద్ధమైన కార్పొరేటర్‌ జయరాముడు కుటుంబంపై కక్ష కట్టి రెండు కేసులు నమోదు చేయించారు.


అధికారం సేవలో పోలీసులు

  • కర్నూలు మండలం నిడ్జూరు గ్రామంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య విభేధాలు భగ్గుమన్నాయి. వైకాపా నాయకుల దాడిలో తెదేపా నేత మృతి చెందిన ఘటనలో నిందితులపై ఒక కేసు నమోదు కాగా బాధిత కుటుంబసభ్యులపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.
  • 2022, అక్టోబరులో తెదేపా నేత, కోట్ల అనుచరుడు.. గోనెగండ్ల మండలం కున్నూరుకు చెందిన కురువ సిద్ధప్పను వైకాపా నాయకులు కోడుమూరు పట్టణంలో దారుణంగా హత్య చేశారు. ఆయనకు భద్రత కల్పించాలని కోరినా పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
  • కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తల్లిని గతేడాది కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో చేర్పించిన సందర్భంలో వైకాపా నాయకులు మీడియాపై దాడికి పాల్పడ్డారు. విలేకరుల సంఘం నాయకులు పలుమార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు