logo

జగన్‌ మూకల భూస్మాసుర హస్తం

పంట కాల్వలు ఖతం .. ఎసైన్డు భూములు పరాధీనం.. ఆలయ భూముల ఆరగింపు.. ఇలా ‘ఖాళీ’ జాగా కనిపిస్తే చాలు పాదం మోపుతారు.. చదును చేసి.. స్థిరాస్తి జెండా పాతేస్తున్నారు. జాగా కనిపిస్తే.. పాగా వేసేయడమే అన్నట్లు జగన్‌ అనుచరగణం ఊరూరా చెలరేగిపోతోంది.

Updated : 08 May 2024 07:08 IST

ఖాళీ స్థలాలపై గద్దల్లా వాలిపోతున్న వైనం
వివాదాలు రాజేసి సొంతం చేసుకుంటున్నారు
న్యూస్‌టుడే, నిఘా విభాగం

ఐదేళ్ల అరాచకం

పంట కాల్వలు ఖతం .. ఎసైన్డు భూములు పరాధీనం.. ఆలయ భూముల ఆరగింపు.. ఇలా ‘ఖాళీ’ జాగా కనిపిస్తే చాలు పాదం మోపుతారు.. చదును చేసి.. స్థిరాస్తి జెండా పాతేస్తున్నారు. జాగా కనిపిస్తే.. పాగా వేసేయడమే అన్నట్లు జగన్‌ అనుచరగణం ఊరూరా చెలరేగిపోతోంది. రాళ్లు.. రప్పలు.. కొండలు.. గుట్టలు.. ఇలా ఏదైతేనేం.. రూ.లక్షల విలువ ఉండి, ఆక్రమణకు అనువుగా ఉంటే చాలు అధికార పార్టీ నాయకులు వాటిని గద్దల్లా తన్నుకుపోతున్నారు. ఎసైన్డ్‌, దేవాదాయ, వక్ఫ్‌, శ్మశాన భూములు వైకాపా నాయకుల భూ దాహానికి కరిగిపోయాయి. కర్నూలు నగర శివారుతో పాటు కల్లూరు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, నందికొట్కూరు, ఆత్మకూరు, గూడూరు, ఆళ్లగడ్డ, పాణ్యం నియోజకవర్గాల్లో ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. ఐదేళ్ల జగన్‌ జమానాలో వైకాపా శ్రేణులు రెచ్చిపోయారు.. భయపెట్టి ‘ఖాళీ’ భూములను కబ్జా చేశారు.. వివాదాలు రాజేసి పంచాయితీల పేరుతో స్వాధీనం చేసుకున్నారు.

జనం ఆందోళన

గత ఐదేళ్లలో ఎక్కడ ఖాళీ భూమి కనిపిస్తే చాలు.. వైకాపా నాయకులు గద్దల్లా వాలిపోయారు. ఆక్రమణల జెండా పాతేశారు. ఆంధ్రప్రదేశ్‌ భూయాజమాన్య హక్కు చట్టం (ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్‌్్ట)-2023 అంటూ కొత్త చట్టాన్ని వైకాపా ప్రజలపై ప్రయోగిస్తోంది. ‘‘ ఇది భూ రక్షణ చట్టం కాదని.. భూ భక్షణ చట్టం.. దీనిని అడ్డుపెట్టుకొని అక్రమార్కులు ప్రజల భూములను స్వాధీనం చేసుకునే ప్రమాదముందని విశ్రాంత రెవెన్యూ అధికారులు, న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల స్థలాలకు రక్షణ ఉంటుందా ? ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ ఉంటే మన సొంతూళ్లో ఉన్న భూమి పరిస్థితి ఏంటి ? ఆలయ భూములు మిగులుతాయా ? ఎసైన్డు భూములు ఏమైపోతాయోనన్న భయం అందరిలో నెలకొంది.

దళితుల భూములపై కన్ను

కర్నూలు మండలం మునగాలపాడు గ్రామ రెవెన్యూ పరిధిలోని కాల్వ భూమిలో దళిత రైతులకు గతంలో పట్టాలు ఇచ్చారు. వారు పట్టాదారు పాస్‌పుస్తకాలు తీసుకోలేకపోయారు. ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోలేదు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నారు. రెండు వందల ఎకరాల మేర ప్రభుత్వ భూములు ఉన్నాయి. రూ.200 కోట్లు విలువ చేసే భూములపై అధికార పార్టీకి చెందిన ముగ్గురు కన్నేశారు. ఖాళీ చేయాలని సాగులో ఉన్న దళితులకు అధికారులతో మౌఖిక ఆదేశాలు జారీ చేయించారు. అంతలోనే ఎన్నికల ప్రకటన రావడంతో కబ్జా కథ తాత్కాలికంగా ఆగింది.

సైనికుల భూమిపై కన్ను

దేశ సరిహద్దులో రక్షణగా నిలిచిన వారికి ఓర్వకల్లు మండలం పూడిచర్లలో సర్వే నంబర్లు 386, 402లో వంద ఎకరాలకుపైగా భూములను సుమారు 30 మంది వరకు విశ్రాంత సైనిక కుటుంబాలకు కేటాయించారు. అసైన్డు కమిటీలో పెట్టలేదని, సాగు చేసుకోవడం లేదని కారణాలు చెబుతూ వాటిని ఎందుకు వెనక్కి తీసుకోకూడదో చెప్పాలంటూ తాఖీదులు జారీ చేయించారు. వాటిని స్వాధీనం చేసుకొని ఇతరులకు పంపిణీ చేయాలని కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

శ్మశానంలో కబ్జా బేతాళులు

ఎమ్మిగనూరు శివారులోని కర్నూలు రహదారిలో 24 బీసీ కులాలకు స్థలాలు కేటాయించారు. 183-ఏలో 1.45 ఎకరాల భూమి ఉన్నట్లు రికార్డులున్నాయి. వీటిలో ప్రైవేటు వ్యక్తులు 50 సెంట్లకుపైగా స్థలం తమదేనని దస్త్రాలు పుట్టించారు. పోరంబోకు భూములకు 2002లో పట్టాలు పుట్టించి తమవిగా చలామణి చేసుకుంటున్నారు. ఇక్కడ సెంటు భూమి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పలుకుతోంది. వీటి విలువ రూ.3 కోట్లకుపైగా ఉంటుంది.

భయపెట్టి రూ.2 కోట్లు వెనకేసుకొన్నారు

ఆదోని పట్టణంలోని ఆర్టీసీ కాలనీ సమీపంలో సర్వే నంబరు-352లో 4.64 ఎకరాల్లో 30 ఏళ్ల కిందట ఓ వ్యక్తి వెంచర్‌ వేసి 1.50 సెంటు ప్రకారం ప్లాట్లు వేసి విక్రయించారు. నెలవారీ కంతులు చెల్లించే అవకాశం కల్పించడంతో చాలా మంది పేదలు చేరారు. ఒక్కో ప్లాటును రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు కొనుగోలు చేశారు. ఆ స్థలం మాదంటూ పట్టణానికి చెందిన ఓ మహిళ నాలుగేళ్ల కిందట ట్రాక్టర్‌తో దున్నేసి విత్తనం వేశారు. కొందరు బాధితులు అధికార పార్టీ ముఖ్య నేతను కలిసి గోడు వినిపించారు. నేనున్నాను.. న్యాయం చేస్తానని నమ్మిస్తూ వచ్చారు. ప్రస్తుతం అక్కడ సెంటు స్థలం రూ.10 లక్షలు పలుకుతోంది. ధర పెరగడంతో సదరు నేత కన్ను ఆ భూమిపై పడింది. కన్నేసిన ‘అధికారం’ అక్కడ నెలకొన్న వివాదాన్ని ఆసరా చేసుకుని బలవంతంగా సొంతం చేసుకున్నారు. బాధితులకు నామమాత్రంగా సెంటున్నరకు రూ.2 లక్షల చొప్పున చెల్లించేలా బేరం పెట్టారు. అక్కడ కొత్త వెంచర్‌ వేసి ప్రస్తుతం ఒక సెంటు స్థలాన్ని రూ.15 లక్షలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా భయపెట్టి కబ్జా చేసినవారు ఇప్పటి వరకు రూ.2 కోట్ల వరకు వెనకేసుకున్నారు.

72 సెంట్లు.. రూ.10 కోట్లు

ఆదోని పట్టణ శివారు మండిగిరి పంచాయతీ పరిధిలో తిరుమలనగర్‌లో 35 ఏళ్ల కిందట 20.05 ఎకరాల్లో వెంచర్‌ వేశారు. అందులో 230 ప్లాట్లు చేసి విక్రయించారు. నిబంధనల ప్రకారం ప్రజాహిత కార్యక్రమం కోసం(పార్కు) దాదాపు 72 సెంట్లు వదిలేశారు. పంచాయతీకి సంబంధించిన స్థలమని గతంలో బోర్డు పాతారు. ప్రస్తుతం అక్కడ సెంటు స్థలం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు పలుకుతోంది. ఖాళీ స్థలం విలువ రూ.10 కోట్లకుపైగా ఉండటంతో అధికార పార్టీ నాయకుల కన్ను పడింది. అధికార పార్టీ ముఖ్యనేతను సంప్రదించి స్థలాన్ని శుభ్రం చేయించి ప్లాట్లుగా విభజించి రాళ్లు పాతేశారు. పంచాయతీ వారు పాతిన బోర్డును తొలగించారు. నాన్‌లేఅవుట్‌ కింద ప్లాట్లు విక్రయానికి ఉంచారు.

అక్రమ కంచెలు

కర్నూలు నగర పరిధిలో జొహరాపురం శివారులోని సర్వే నంబరు 124లో 4.22 ఎకరాల పొలం ఉంది. 2008లో ఓ స్థిరాస్తి వ్యాపారి కొనుగోలు చేసి 44 ప్లాట్లుగా విభజించి విక్రయించారు. ఒక్కరూ ఇల్లు నిర్మించుకోలేదు.. ప్రస్తుతం అక్కడ సెంటు రూ.10 లక్షలు పలుకుతోంది. ధరలు పెరగడంతో ‘అధికారం’ కన్నేసింది..ఆ స్థలాలు తమ పూర్వీకులవని, వారు ఎవరికీ విక్రయించలేదు.. తమకే చెందుతాయంటూ కంచెలు వేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఓ ప్రజాప్రతినిధి, ఆయన అనుచరులు పంచాయితీ పెట్టారు. ఆ భూమి జోలికి రాకుండా ఉండాలంటే రూ.10 కోట్లు చెల్లించాలంటూ రంగంలోకి దిగారు. సెంటుకు రూ.3 లక్షలు ఇవ్వాలంటూ హుకుం జారీ చేశారు. అంత సొమ్ము చెల్లించుకోలేమని పేదలు విన్నవించుకున్నా పెద్దలు వినిపించుకోవడం లేదు.

వక్కెరు వాగు ఆక్రమించారు

కల్లూరులో సర్వే నంబరు 258/బిలో 5.45 ఎకరాల భూమి ఉంది. సదరు సర్వే నంబరులోని పొలం కర్నూలు పెద్దమార్కెట్‌ సమీపంలోని బుడ్డాబుడ్డీ మసీదుకు చెందినదని ఆరు దశాబ్దాల కిందటే గెజిట్‌ చేశారు. అక్కడి భూములకు విలువ పెరగడంతో ‘అధికార’ పార్టీకి చెందిన నేత కన్నుపడింది. సర్వే నంబరును సబ్‌ డివిజన్‌గా మార్చి మూడెకరాల విస్తీర్ణంలో వెంచర్‌ వేశారు. అక్కడ 98 ప్లాట్లు వేసి బేరం పెట్టారు. సెంటు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు విక్రయిస్తున్నారు. వక్ఫ్‌ దస్త్రాల్లో సర్వే నంబరు 258/బి ఉండగా.. 258/బి1ఏగా చూపుతూ లేఅవుట్‌ వేశారు. అయితే రెవెన్యూ దస్త్రాల్లో వెంచర్‌ సబ్‌ డివిజన్‌ కాలేదు.. రిజిస్ట్రేషన్‌ కాకపోవడం గమనార్హం. పక్కనే ఉన్న వక్కెర వాగును ఆక్రమించారు. ఏకంగా రహదారి (ఎర్రమట్టి రోడ్డు) ఏర్పాటు చేశారు. వాగు స్థలంలో రహదారితోపాటు కొన్ని ప్లాట్లు ఉన్నాయి.

దళితులపై దగా

గూడూరు మండలం జూలకల్‌లో సర్వే నంబరు-105లో 1.70 ఎకరాల భూమి గంగమ్మ బావి పేరుతో దళితుల స్థలం ఉంది. ఈ భూమి గ్రామంలో బస్టాండుకు సమీపంలో ఉండటంతో మార్కెట్‌లో మంచి డిమాండు ఉంది. ఇక్కడ సెంటు స్థలం రూ.2 లక్షల వరకు పలుకుతోంది. ఇల్లు నిర్మించుకోవడానికి అనుకూలంగా ఉండటంతో ఆ స్థలంపై స్థానిక అధికార పార్టీ నాయకుల కన్ను పడింది. ఎలాగైనా దీన్ని తమ సొంతం చేసుకోవాలని, తమకు అనుకూలమైన ఎస్సీల పేర్లతో ఆ భూమి వారికి చెందినట్లుగా దస్త్రాలు పుట్టించారు. ఆ స్థలంలో ప్లాట్లు వేసి అమ్మకానికి పెట్టారు.

అనుచరులకు రాసిచ్చేశారు

కల్లూరు అర్బన్‌లోని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు భూసేకరణ చేపట్టాలని 2007-08లో నిర్ణయించారు. ఇందులో భాగంగా పందిపాడు గ్రామ పరిధిలోని సర్వే నంబరు 217లో 53.16 ఎకరాలు సేకరించారు. అక్కడ గతంలో రూ.50 వేల విలువ చేయని సెంటు స్థలం.. ప్రస్తుతం రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షలకు పైగా పలుకుతోంది. ఆ కాలనీలో ‘ఖాళీ’ స్థలాలపై ‘అధికారం’ కన్నుపడింది. ప్రజా అవసరాలకు కేటాయించిన ఖాళీ స్థలాలను ప్లాట్లుగా విభజించి రైతుల ముసుగులో కొందరికి గుట్టుగా పంచేశారు. లబ్ధిదారుల ఎంపికకు ఎక్కడా గ్రామసభ పెట్టిన దాఖలాలు లేవు. అంతా లోలోపల సాగిపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు