logo

నిధి వెక్కిరింత.. పర్యాటకం ఓ వింత

కొలిమిగుండ్ల మండలంలోని బెలూం గుహల్లో బ్లోయర్లు పనిచేయక పోవడంతో పర్యాటకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రంగుల దీపాలు సైతం వెలగని దుస్థితి. తెదేపా హయాంలో అప్పటి పర్యాటక మంత్రి భూమా అఖిలప్రియ రూ.50లక్షలు కేటాయించి 12 బ్లోయర్లు ఏర్పాటు చేశారు.

Published : 09 May 2024 03:21 IST

గుహల్లో ఉక్కిరిబిక్కిరి : కొలిమిగుండ్ల మండలంలోని బెలూం గుహల్లో బ్లోయర్లు పనిచేయక పోవడంతో పర్యాటకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రంగుల దీపాలు సైతం వెలగని దుస్థితి. తెదేపా హయాంలో అప్పటి పర్యాటక మంత్రి భూమా అఖిలప్రియ రూ.50లక్షలు కేటాయించి 12 బ్లోయర్లు ఏర్పాటు చేశారు. వైకాపా పాలనలో నిధులు కేటాయించకపోవడంతో బ్లోయర్లు పని చేయడంలేదు.

ఈనాడు, కర్నూలు: పర్యాటక ప్రాంతాలు రూపు కోల్పోయాయి. చుట్టేసొద్దామంటే.. మచ్చుకైనా కనిపించని పరిస్థితి. ఐదేళ్లలో పర్యాటక రంగం ఆనవాలు లేకుండా పోయింది. వైకాపా ప్రభుత్వం పైసా విదల్చలేదు. అంతటా అసౌకర్యాలు రాజ్యమేలుతున్నాయి. ఓ వెలుగు వెలిగిన శాఖలో నేడు చీకట్లు కమ్ముకున్నాయి. కళకళలాడిన నిర్మాణాలు కళావిహీనంగా మారాయి. ఆహ్లాదం పంచిన ప్రకృతి సంపదలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాలు ఉనికి కోల్పోయే పరిస్థితి నెలకొంది. నిర్వహణ భారంగా మారింది. పేరెన్నికగన్న పర్యాటక ప్రాంతాల దుస్థితి ఇది.

రాతివనం అధ్వానం: ఓర్వకల్లు వద్ద ఉన్న రాతివనాలకి (రాక్‌ గార్డెన్స్‌) ప్రస్తుతం నిర్వహణ లేక పర్యాటకుల సంఖ్య తగ్గిపోయింది. ఐదేళ్లలో చిల్లిగవ్వ కేటాయించకపోవడంతో అధ్వానంగా మారింది. సందర్శకుల కోసం నిర్మించిన గృహాలు సైతం నిరుపయోగంగా మారాయి.

ఆహ్లాదం దూరం: కర్నూలు నగర శివారులోని నగరవనం పక్కనే ఉన్న చెరువులో పర్యాటకుల ఆహ్లాదం కోసం  బోట్లు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం బోట్లు మరమ్మతులకు గురై మూలకు చేరాయి.

తిరగబడిన బోటు: అవుకు జలాశయం వద్ద పర్యాటకశాఖ ఏర్పాటు చేసిన బోటింగ్‌ తిరగబడింది. నిర్వహణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గతంలో బోటు తిరగబడి ప్రాణాలు కోల్పోయిన ఘటనతో అది నిలిపివేశారు.

కూల్చారు.. నిర్మించేదెప్పుడో: శ్రీశైలంలోని హరిత రిసార్ట్స్‌ భవనాలు కూల్చేశారు. శ్రీశైలానికి వచ్చే పర్యాటకులు బస చేసేందుకు సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడంలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని