logo

సారూ.. హామీలు నెరవేర్చరూ..!

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఆదివారం ఇక్కడ జరిగే బహిరంగ సభపై అందరిలో ఆసక్తి నెలకొంది.

Published : 04 Dec 2022 01:21 IST

నేడు మహబూబ్‌నగర్‌లో సీఎం కేసీఆర్‌ పర్యటన
ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఆదివారం ఇక్కడ జరిగే బహిరంగ సభపై అందరిలో ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా కేసీఆర్‌ ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటించి పలు హామీలను గుప్పించారు. ఇప్పటికీ చాలా హామీలు అలానే మిగిలిపోయాయి. ప్రధానంగా ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదు. రెండు పడక గదుల ఇళ్లపై లబ్ధిదారుల్లో అనిశ్చితి నెలకొంది.

ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదు.. : తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేసిన మొదటి సాగునీటి ప్రాజెక్టు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. 2015 జూన్‌ 11న మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూరు మండలంలో కర్వేన వద్ద ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఏడేళ్లు గడిచినా పనులు పూర్తి కాలేదు. 2019లో సీఎం పాలమూరు జిల్లాల్లో పర్యటించి ఈ ప్రాజెక్టు పనులను పరిశీలించి ఏడాదిలోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు పనులు పూర్తి కాలేదు. ప్రస్తుతం సవరించిన అంచనా రూ.52 వేల కోట్లతో పనులు చేపడుతున్నారు. ఇవీ త్వరతగతిన పూర్తి కావాలంటే భారీగా నిధులు అవసరం.

* నారాయణపేట జిల్లాకు ఈ ప్రాజెక్టు రెండోదశలో భాగంగా సాగునీటిని అందిస్తామని సీఎం గతంలో ప్రకటించారు. ఈ హామీ కూడా నెరవేరలేదు. ఉమ్మడి జిల్లాలోని కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టుల అదనపు ఆయకట్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే అదనంగా మరో 2లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది.  
* తుమిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా అలంపూర్‌ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని ప్రకటించారు. 2018లో పనులు ప్రారంభించి ఎనిమిది నెలల్లో పూర్తి చేశారు. 65 వేల ఎకరాల ఆయకట్టుకు సంబంధించిన జలాశయం, కాలువ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఈ పథకం కింద మల్లమ్మకుంట, జూలకల్లు, వల్లూరు జలాశయాలు నిర్మించాల్సి ఉంది. దీనికోసం రూ.380 కోట్లు అవసరం.
* జోగులాంబ గద్వాలలోని గట్టు, కేటీదొడ్డి మండలంలోని 33 వేల ఎకరాలకు సాగునీరు అందించే గట్టు ఎత్తిపోతల పథకానికి 2018లో ఈ పనులకు కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు మూడుసార్లు ఆకృతిని మార్చారు. ఈ పథకం వస్తే రెండు మండలాల రైతులకు సాగునీటి కష్టాలు తీరుతాయి. ఇటీవల టెండరు పనులు పూర్తయ్యాయి. పనులు వేగవంతంగా జరగాలంటే నిధులు అధికంగా అవసరం.

దివిటిపల్లిలో రెండు పడక గదుల ఇళ్ల సముదాయం

సొంతింటి కల నెరవేరేనా.. : కేసీఆర్‌ మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మహబూబ్‌నగర్‌లోని మురికివాడలైన పాత పాలమూరు, పాతతోట, వీరన్నపేటలో నివాసం ఉంటున్న పేదలకు రెండు పడక గదుల ఇళ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు సొంతింటి కల నెరవేరలేదు. అనర్హులకు లోపాయికారిగా ఇళ్లు కేటాయించడంతో సీఎం హామీ ఇచ్చిన పేదలకు ఇళ్లు దగ్గలేదన్న విమర్శలున్నాయి. ఉమ్మడి జిల్లాలో జడ్చర్ల, గద్వాల, మహబూబ్‌నగర్‌, అచ్చంపేట, వనపర్తి, కల్వకుర్తి, దేవరకద్ర నియోజకవర్గాల్లో కొన్ని ఇళ్లు పూర్తయినా లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అందలేదు.

హమీగానే ఉన్నత విద్య.. : కేసీఆర్‌ ఎన్నికల హామీలో భాగంగా ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌ కళాశాలలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది వనపర్తి జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రారంభమైంది. మిగతా పాలమూరు జిల్లాల్లో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలలు లేవు. కల్వకుర్తి, కొల్లాపూర్‌ నియోజకవర్గాల్లో పాలిటెక్నిక్‌ కళాశాలను ఏర్పాటు చేస్తామని గతంలోనూ సీఎం హామీ ఇచ్చినా ఇప్పటి వరకు నెరవేరలేదు.

ముంపు బాధితుల సమస్య తీరేనా.. : జోగులాంబ గద్వాల జిల్లా చిన్నోనిపల్లివాసులు పరిహారం, పునరావాసం కోసం ఎదురుచూస్తున్నారు. ఇక్కడ సుమారు 1,800 మంది బాధితులు  ముంపు ప్రాంతాన్ని ఖాళీ చేయడం లేదు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని కానాయపల్లి గ్రామస్థులు భీమా ఫేజ్‌-2లో శంకరసముద్రం జలాశయానికి భూములు ఇచ్చారు. ముంపు బాధితుల సమస్యలను మాత్రం పరిష్కరించలేదు. నారాయణపేట జిల్లా నేరడ్‌గం, భూత్పూరు, సంగంబండ జలాశయాల పరిధిలోలోనూ పూర్తిస్థాయి పరిహారం అందలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని