logo

ఓ కంట కనిపెడుతుండాలి!

నాలుగు రోజుల కిందట అయిజ పట్టణంలోని నాలుగోవార్డు పరిధిలో ఉన్న ఎస్సీ కాలనీకి చెందిన ఏడేళ్ల చిన్నారిపై వరాహం దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.

Updated : 25 Aug 2023 05:32 IST

చిన్నారులకు పొంచి ఉన్న ప్రమాదాలు
చిన్నపాటి జాగ్రత్తలతో కడుపుకోతకు దూరం

గద్వాల పురపాలకం, న్యూస్‌టుడే: నాలుగు రోజుల కిందట అయిజ పట్టణంలోని నాలుగోవార్డు పరిధిలో ఉన్న ఎస్సీ కాలనీకి చెందిన ఏడేళ్ల చిన్నారిపై వరాహం దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. తల్లిదండ్రులు పొలానికి వెళ్లడంతో బాలుడు ఒక్కడే ఇంటి వద్ద ఉన్నాడు. మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం ప్లేటును శుభ్రం చేసుకోడానికి ఇంటి బయటికి వచ్చినప్పుడు ఘటన చోటుచేసుకుంది.

  • పది రోజులకిందట మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో నాలుగేళ్ల బాలుడు టీవీ సెట్టాప్‌ బాక్సు పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి మృత్యువాతపడ్డాడు.
  • ఇటీవల ముక్కుపచ్చలారని చిన్నారి తిరుపతి నుంచి తిరుమలకు అలిపిరి మెట్ల మార్గంలో వెళుతూ పులి విసిరిన పంజాకు బలైంది.
  • కరోనా సమయంలో ఇటిక్యాల మండలం ఎర్రవల్లిచౌరస్తాలో ఓ పదేళ్ల బాలుడు తమ ఇంటి మొదటి అంతస్తులోని బాల్కనీలో నిలబడి గాలిపటం ఎగరేస్తూ ఉండగా సమీపంలోని హైమాస్ట్‌ తీగలకు పతంగి ఇరుక్కుందని ఇనుపరాడ్డుతో తీసేందుకు ప్రయత్నించి విద్యుదాఘాతానికి గురవడంతో మోచేతి వరకు తొలగించాల్సి వచ్చింది.
  • ఆ మధ్యన ఓ చిన్నారి టీవీ స్టాండును పట్టుకుని కదిలించడంతో టీవీ మీద పడి కన్నుమూశాడు.
  • ఇటీవల కాలంలో ఊయల మెడకు చుట్టుకుని ఓ చిన్నారి ప్రాణాలు వదిలాడు.

నిత్యం ఎక్కడో ఒక చోట.. ఏదో రూపంలో చిన్నారులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. పెద్దల నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. చిన్నారులకు కొత్త పరికరాలు, విషయాలపై ఆసక్తి ఎక్కువ. దీంతో ప్రమాదాలకు గురవుతుంటారు. ఇంటా బయటా వారికి ముప్పు పొంచే ఉంటుంది. దీంతో వారిని ఓ కంట కనిపెట్టుకుని కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.

గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌

ప్రమాదం: బాలికలేకాక బాలురపైనా లైంగిక దాడులు జరుగుతున్న కాలమిది. ఒంటరిగా దొరికితే తినుబండారాలు తదితరాల ఆశ చూపించి చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ప్రాణాలు తీస్తున్నారు. ఒక్కోసారి ఇతర ప్రాంతాలకు తరలించి అమ్మేస్తున్నారు.

జాగ్రత్తలు: తల్లిదండ్రులు తమ పిల్లలను బంధుమిత్రుల వద్ద వదలి ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే ఎలా జాగ్రత్తగా ఉండాలో ముందే చెప్పాలి. పాఠశాలలు, ఇతర ప్రాంతాల్లో ప్రమాదాల నంచి బయట పడాలంటే వారికి గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌పై అవగాహన కల్పించాలి.

రహదారులు.. వాహనాలు..

ప్రమాదం: చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను బైక్‌ వెనుకాల కూర్చోబెట్టుకుని వేగంగా నడుపుతుంటారు. స్పీడ్‌బ్రేకర్లు వచ్చిన చోట ఒక్కసారిగా వెనుక ఉన్న పిల్లలు అదుపుతప్పి రహదారిపై పడిపోయే ప్రమాదముంది. నిలిపి ఉన్న కార్ల డోర్లు లాక్‌ చేయకుండా వెళితే ఆడుకునే పిల్లలు కారు లోపలకు వెళ్లే అవకాశముంది. వారు లోపలికి వెళ్లాక డోర్‌ లాక్‌ పడిపోయి ఎవరూ గుర్తించకపోతే ఆక్సిజన్‌ లభించక మృత్యువాత పడే అవకాశముంది.

జాగ్రత్తలు: రోడ్డు మీదకు వెళ్లినప్పుడు చిన్నారులను తమ వెంటే ఉంచుకోవాలి. వాహనంపై తీసుకెళుతున్నప్పుడు వీలయినంత వరకు వారిని ముందు కూర్చోబెట్టుకోవాలి. వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి. బస్సులుకానీ, ఆటోలుకానీ దిగిన చోట నుంచి ఇంటికి క్షేమంగా చేరేలా చూసుకోవాలి. కార్లు తప్పని సరిగా లాక్‌ చేసుకోవాలి.

బయట ప్రాంతాలకెళితే..

ప్రమాదం: నీళ్లు ఉన్న ఏ ప్రదేశమైనా ఈత రాని వాళ్లకు ప్రాణాపాయమే. ముఖ్యంగా నదులు, చెరువులు, బావులు తదతర ప్రాంతాల్లో మునిగి మృత్యువాతపడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

జాగ్రత్తలు: పిల్లలను ఒంటరిగా ఎక్కడికీ వెళ్లకుండా చూసుకోవాలి. నీటి వనరుల వద్దకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా పెద్దలు తోడుండాలి. ఫిÆట్స్‌ తదితర ఇబ్బందులున్న పిల్లలను అసలు పంపించకూడదు.

ఇంటిలోపల...

ప్రమాదం: ఇంట్లో విద్యుత్తుతీగలు అతుకులు పెట్టినవి ఉన్నా.. చరవాణి ఛార్జింగ్‌ పెట్టాక స్విచ్‌ ఆఫ్‌ చేసి బోర్డు నుంచి వైర్‌ తీసేయకున్నా.. వాటిని పట్టుకున్నప్పుడు విద్యుదాఘాతానికి గురయ్యే ప్రమాదముంది. చాకులు, తదితరాలతో గాయాల పాలయ్యే అవకాశముంది. చిన్నచిన్న వస్తువులను నోటిలో వేసుకుని ఊపిరాడక మృతిచెందుతున్న ఘటనలున్నాయి.

జాగ్రత్తలు: విద్యుత్తు బోర్డులు ఎత్తులో అమర్చాలి. ఎలక్ట్రానిక్స్‌ పరికరాలు, చాకులు తదితర ప్రమాదకర వస్తువులు, ప్రమాదకర రసాయనాలు, తదితరాలను పిల్లలకు అందుబాటులో లేకుండా చూసుకోవాలి. చిన్నారులను ఊయలలో పడుకోబెట్టినప్పుడు కూడా కనిపెడుతుండాల్సిందే.

పరిసరాల్లో..

ప్రమాదం: ఇంటి పెరట్లో, పార్కుల్లో పొదలు పెరిగితే అక్కడ ఆడుకుంటున్న చిన్నారులకు పాములు, తేళ్లు వంటి విషపుజీవుల నుంచి అపాయం పొంచి ఉంటుంది. వేసవిలో ఆరుబయట నిద్రిస్తున్నప్పుడు జెర్రులు, ఇతర హానికర కీటకాలు చెవులు, ముక్కుల్లోకి వెళ్లే ప్రమాదముంది.

జాగ్రత్తలు: వీలయినంత వరకు చిన్నారులను మంచాలపైనే, పెద్దలు తమతోపాటే పడుకోబెట్టుకోవాలి. దోమతెరలు ఏర్పాటు చేసుకుంటే దోమలతోపాటు, చిన్నచిన్న విషపురుగులు వచ్చే అవకాశం ఉండదు. ఇంటి పరిసరాల్లో శుభ్రత పాటించాలి. నీటి నిల్వలు, సంపులపై తప్పనిసరిగా మూతలు ఉండేలా చూసుకోవాలి.

శ్రద్ధ అవసరం: చిన్నారులకు బాహ్యకారకాల వల్లనే కాక సీజనల్‌గా వచ్చే వ్యాధులతోనూ ప్రమాదం పొంచి ఉంటుంది. రెండేళ్లలోపు పిల్లలకు మాటలు రావు కాబట్టి వాళ్లకు శరీరంలోపల ఉండే అనారోగ్యమేమిటనేది తల్లిదండ్రులే వారి అప్రమత్తతతో కనిపెట్టాలి. శిశువు నీరసంగా ఉంటే వైద్యులను సంప్రదించాలి. వారికి కాచి, వడబోసిన మంచి నీటినే తాగించాలి. చిన్నారుల కదలికలపై, వారి పట్ల ఇతరులు చూపుతున్న తీరును నిఘాతో కనిపెట్టుకుని కాపాడుకోవాలి.

పుట్ట చంద్రశేఖర్‌, చిన్నపిల్లల వైద్య నిపుణులు, గద్వాల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని