logo

భిన్న ఫలితాల వనపర్తి

వనపర్తి పేరు వినగానే గుర్తుకొచ్చేది సంస్థానాధీశుల రాజప్రాసాదం. నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపిన గడ్డ ఇది.

Published : 31 Oct 2023 04:48 IST

వనపర్తి, న్యూస్‌టుడే : వనపర్తి పేరు వినగానే గుర్తుకొచ్చేది సంస్థానాధీశుల రాజప్రాసాదం. నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపిన గడ్డ ఇది. చారిత్రక నేపథ్యమున్న ఈ నియోజకవర్గంలో ప్రతి ఎన్నికల్లో విలక్షణ ఫలితాలొచ్చాయి. మొత్తం 16 సార్లు (ఒక ఉప ఎన్నిక) ఎన్నికలు జరగగా, కాంగ్రెస్‌, కాంగ్రెస్‌(ఐ) అభ్యర్థులు పది సార్లు, తెలుగు దేశం పార్టీ అభ్యర్థులు నాలుగు సార్లు, ప్రజాసమితి పార్టీ ఒకసారి (ఉప ఎన్నిక), తెలంగాణ రాష్ట్ర సమితి ఒకసారి విజయం సాధించారు.

1952లో సురవరం ప్రతాపరెడ్డి

స్వాతంత్య్రానంతరం జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ చరిత్రకారుడు, గోల్కొండ పత్రికను నడిపిన సురవరం ప్రతాపరెడ్డి 1952లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1953లో ఉన్నప్పుడు చనిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన మృతితో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు చాలా సమయం తీసుకున్నట్లుగా అప్పటి పెద్దలు చెబుతారు. 1956లో జరిగిన ఉప ఎన్నికల్లో అడ్డాకుల మండలం కందూరు గ్రామానికి చెందిన రాంరెడ్డి ప్రజాసమితి పార్టీ తరఫున పోటీ చేసి సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి జయరామ్‌పై విజయం సాధించారు.

1957లో ఏకగ్రీవం

భారత్‌ యూనియన్‌లో సంస్థానాలు విలీనం అయినా.. సంస్థానాధీశులు రాజకీయాల్లో కొనసాగుతున్న కాలంలో 1957లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పద్మానాభారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇది నియోజకవర్గ ఎన్నికల చరిత్రలో రికార్డుగా పేర్కొంటారు.

1962, 1967లో సంస్థానాధీశుల వారసత్వం

వనపర్తి సంస్థానాధీశుల వంశస్థులు రాజకీయాల్లో రాణించారు. 1962, 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంస్థాధీశుడు రెండో రాజారామేశ్వరరావు చిన్నాన్న రామదేవరరావు సతీమణి రాణికుముదినీదేవి రెండు సార్లు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. చివరి రాజారామేశ్వరరావు కూడా 1962, 1967ల్లో పార్లమెంటు సభ్యునిగా ఎన్నికవడం గమనార్హం.

1972లో అయ్యప్ప

1972లో జరిగిన ఎన్నికల్లో సంస్థానాధీశుల వారసత్వానికి అడ్డుకట్ట పడినట్లయ్యింది. ఈ ఎన్నికల్లో వారెవరూ నిలబడలేదు. కొత్తకోటకు చెందిన అయ్యప్ప కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా నిలబడి సమీప స్వతంత్ర అభ్యర్థి, వనపర్తికి చెందిన బాలకృష్ణయ్యపై విజయం సాధించారు.

1978లో జయరాములు

1978లో జరిగిన ఎన్నికల్లో పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామానికి చెందిన జయరాములు ఇందిరా కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి జనతా పార్టీ అభ్యర్థి డా.బాలకృష్ణయ్యపై విజయం సాధించారు.

1983లో తెదేపా ప్రభంజనం

సినీ నటుడు ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగు దేశం పార్టీలో చేరిన డా.బాలకృష్ణయ్య ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో నిలబడి వరుసగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెదేపా ప్రభంజనంలో ఆయన 1983, 1985ల్లో విజయం సాధించారు.

1989లో చిన్నారెడ్డి

కాంగ్రెస్‌పార్టీలో వివిధ పదవులను అధిష్టించిన చిన్నారెడ్డి 1985లో పోటీ చేసి ఓడిపోయారు. గోపాల్‌పేట మండలం జయన్నతిరుమలాపురం గ్రామానికి చెందిన ఈయన కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా రెండో సారీ (1989లో) పోటీ చేసి తెదేపా అభ్యర్థి బాలకృష్ణయ్య మీద విజయం సాధించారు. ఇది ఆయనకు ఆరంగేట్రం. అనంతరం 1999, 2004, 2014లో విజయం సాధించారు.

1994లోరావుల చంద్రశేఖర్‌రెడ్డి

1994లో జరిగిన ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు తీర్పులో మార్పు చూపారు. కొత్తకోట మండలం కానాయపల్లికి చెందిన రావులచంద్రశేఖర్‌రెడ్డి తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా నిలబడిన మొదటి సారే సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డిపై విజయం సాధించారు. తిరిగి 2009లో అదే చిన్నారెడ్డిపై గెలుపొందారు.

2018లో నిరంజన్‌రెడ్డి

ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక వనపర్తి నుంచి నిరంజన్‌ రెడ్డి 2014లో తెరాస తరఫున పోటీ చేసి సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డిపై ఓడిపోయారు. 2018లో అదే చిన్నారెడ్డిపై పోటీ చేసి విజయం సాధించారు.

2007లో మార్పులు చేర్పులు

1952 నుంచి 2007 వరకు జరిగిన ఎన్నికల్లో వనపర్తి, పెద్దమందడి, ఖిల్లాగణపురం, కొత్తకోట, అడ్డాకుల, పెబ్బేరు మండలాల్లోని కొన్ని గ్రామాలు కలిసి వనపర్తి నియోజకవర్గం ఉండేది. 2007లో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం కొత్తకోట, అడ్డాకుల మండలాలు దేవరకద్ర నియోజకవర్గంలో కలిశాయి. గోపాల్‌పేట, పెబ్బేరు, ఖిల్లాగణపురం, వనపర్తి, పెద్దమందడి, శ్రీరంగాపురం, రేవల్లి మండలాలతో కలిసి నియోజకవర్గం ఏర్పడింది. మొత్తం ఓటర్ల సంఖ్య 2,65,622. వీరిలో పురుషులు 1,32,971, మహిళలు 1,32,644, ఇతరులు ఏడుగురు ఉన్నారు.

జిల్లాల పునర్విభజనతో ఒకే నియోజకవర్గం

2016లో జరిగిన జిల్లాల పునర్విభజనలో వనపర్తి జిల్లా ఏర్పడింది. అంతకు ముందు వనపర్తి రెవెన్యూ డివిజన్‌లో ఉన్న మండలాలతోనే జిల్లా ఏర్పడడం గమనార్హం. కొత్త మండలాల ఏర్పాటుతో రెండు మండలాలు జత కలిసి నియోజకవర్గంలో ఏడు మండలాలయ్యాయి. జిల్లాలోని మిగతా ఏడు మండలాలలో పాన్‌గల్‌, వీపనగండ్ల, చిన్నంబావి కొల్లాపూర్‌ నియోజకవర్గంలో కొత్తకోట, మదనాపూర్‌ మండలాలు దేవరకద్రలో, ఆత్మకూరు, అమరచింత మక్తల్‌ నియోజకవర్గంలో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని