logo

భారాస ఎంపీ అభ్యర్థిగా మన్నె

మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానానికి భారాస అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి మరోసారి బరిలో నిలువనున్నారు.

Published : 06 Mar 2024 05:31 IST

మహబూబ్‌నగర్‌లో సిట్టింగ్‌కే మళ్లీ అవకాశం

వ్యక్తిగత వివరాలిలా.. 

పేరు: మన్నె శ్రీనివాస్‌రెడ్డి
పుట్టిన తేదీ: 02-01-1959
తల్లిదండ్రులు: అచ్చిరెడ్డి, సోమేశ్వరమ్మ
స్వస్థలం : గురుకుంట, నవాబుపేట మండలం, మహబూబ్‌నగర్‌ జిల్లా
విద్యాభ్యాసం: బీకాం
రాజకీయ ప్రవేశం: 2005లో కాంగ్రెస్‌ నుంచి ఎన్మన్‌గండ్ల సింగిల్‌విండో డైరెక్టర్‌గా.. 2009లో గురుకుంట నుంచి ఎంపీటీసీగా ఎన్నిక, 2019లో భారాస నుంచి మహబూబ్‌నగర్‌ ఎంపీగా ఎన్నిక

ఈనాడు, మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానానికి భారాస అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి మరోసారి బరిలో నిలువనున్నారు. మహబూబ్‌నగర్‌ టిక్కెట్‌ ఆయనకే కేటాయిస్తున్నట్లు మంగళవారం పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటించడంతో ఇక్కడ పోటీ చేసే అభ్యర్థిపై ఉత్కంఠకు తెరపడింది. ఈ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ నుంచి భారాస తరపున పోటీ చేసేందుకు పలువురు అభ్యర్థుల పేర్లు తెరపైకి వచ్చాయి. మహబూబ్‌నగర్‌ నుంచి మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి పేర్లు వినిపించాయి. ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్న కుమారుడు జీవన్‌రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోవడంతో భారాస టిక్కెట్‌పై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. చివరకు తానే బరిలో ఉంటానని శ్రీనివాస్‌రెడ్డి అధిష్ఠానానికి చెప్పడంతో కేసీఆర్‌ ఆయనకే టిక్కెట్‌ను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2019లో సార్వత్రిక ఎన్నికల్లో చివరి నిమిషంలో భారాసలో చేరి శ్రీనివాస్‌రెడ్డి టిక్కెట్‌ తెచ్చుకుని విజయం సాధించారు. దీని వెనుక ఎంఎస్‌ఎన్‌ ఫార్మా గ్రూప్‌ అధినేత సత్యనారాయణరెడ్డి కీలక భూమిక పోషించారు. ఎన్నికల సమయంలో జీవన్‌రెడ్డి కూడా తెర వెనుక ఉండి బాబాయి విజయానికి కృషి చేశారు. ఈ సారి జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో ఎంపీ ఎన్నికలు పాలమూరులో రసవత్తరంగా మారనున్నాయి.

నాగర్‌కర్నూల్‌ స్థానం ప్రవీణ్‌కుమార్‌?: రాష్ట్రంలో భారాస, బీఎస్పీలు పొత్తు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగా నాగర్‌కర్నూల్‌ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ బరిలో నిలిచే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడ సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న రాములు ఇటీవలే భాజపాలో చేరి తన కుమారుడు భరత్‌ ప్రసాద్‌కు టిక్కెట్‌ ఇప్పించుకున్నారు. నాగర్‌కర్నూల్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుగానీ ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న బరిలో ఉంటారని భావించారు. ప్రస్తుతం భారాస, బీఎస్పీ పొత్తు తెరపైకి రావడంతో పాలమూరులో మహబూబ్‌నగర్‌ నుంచి మాత్రమే గులాబీ పార్టీ పోటీ చేసే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని