logo

పరిశ్రమల్లో అగ్నికీలలు

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పరిశ్రమలు, వ్యాపార సంస్థల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. యజమానులు పరిశ్రమల్లో తగిన అగ్నిమాపక సాధనాలు ఏర్పాటు చేసుకోకపోవటం వల్లనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

Published : 27 Mar 2024 02:22 IST

కనీస రక్షణ పరికరాలు లేక ప్రమాదాలతో తీవ్రనష్టం
న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ నేరవిభాగం

  • ఈ నెల 23న అర్ధరాత్రి నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలోని ఓ పత్తి పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఆర్పడానికి సరైన పరికరాలు లేక ఇబ్బంది పడాల్సి వచ్చింది. అగ్నిమాపక శాఖ అధికారులు వచ్చి మంటలను ఆర్పినా... అప్పటికే రూ.కోట్లల్లో నష్టం వాటిల్లింది. గింజల తీసి వేసి బేళ్ల రూపంలో కట్టిన పత్తి కాలిపోయింది.
  • ఈ నెల 23న రాత్రి మహబూబ్‌నగర్‌ మండల పరిధిలోని ఓ ఆయిల్‌ మిల్లులో అగ్ని ప్రమాదం జరిగింది. మిల్లులో తవుడు బస్తాలతో పాటు మామూలు గోనె సంచులు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. సకాలంలో మంటలను అర్పకపోవడంతో రూ.లక్షల్లో నష్టం వాటిల్లింది. ప్రమాదంలో ట్రాక్టర్‌, డోజరు, ఇతర వస్తువులన్నీ కాలిపోయాయి.

మ్మడి జిల్లావ్యాప్తంగా పరిశ్రమలు, వ్యాపార సంస్థల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. యజమానులు పరిశ్రమల్లో తగిన అగ్నిమాపక సాధనాలు ఏర్పాటు చేసుకోకపోవటం వల్లనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు వెచ్చించి పరికరాలు ఏర్పాటు చేసుకుంటే చాలావరకు నష్టాన్ని నివారించే అవకాశం ఉన్నా ఆ దిశగా దృష్టి సారించటం లేదు. 95 శాతం పరిశ్రమల వాళ్లు అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచుకోవడం లేదు. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 10వేలకు పైగా పరిశ్రమలు ఉన్నాయి. ఒక్క మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే 2,864 పరిశ్రమలు ఉన్నాయి. జడ్చర్ల సెజ్‌లో 100కు పైగా పరిశ్రమలు ఉంటే పదింటికే అగ్నిమాపక శాఖ అనుమతులు తీసుకున్నాయి.

నిబంధన అడ్డం పెట్టుకుని నిర్లక్ష్యం : తెలంగాణ అగ్నిమాపక శాఖ సేవాచట్టం - 1999 సెక్షన్‌ 13 ప్రకారం 15 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న పరిశ్రమలు, భవనాల వాళ్లు తప్పనిసరిగా అగ్నిమాపక శాఖ నుంచి ఎన్‌వోసీ తీసుకోవాల్సి ఉంటుంది. 15 మీటర్ల కంటే ఎత్తు తక్కువగా ఉంటే ఎన్‌వోసీ అవసరం లేదు. వాటిపై అగ్నిమాపక శాఖ పర్యవేక్షణ ఉండదు.
పరిశ్రమల శాఖ నుంచి అనుమతి తీసుకుంటే సరిపోతుంది. అందుకే పరిశ్రమలు, గిడ్డంగులు, వాణిజ్య సముదాయాల యజమానులు 15 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో నిర్మిస్తున్నారు. వాటిలో ఎలాంటి అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసుకోకపోవటంతో ప్రమాదాలు జరిగినప్పుడు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఒక్కోసారి ప్రాణనష్టం కూడా జరగొచ్చు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అగ్నిమాపక శాఖ నుంచి 15 పరిశ్రమలే ఎన్‌వోసీ తీసుకున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పరిశ్రమల శాఖ నుంచి 176 పరిశ్రమల వాళ్లు అనుమతి తీసుకున్నారు.

ఈ ఏర్పాట్లు ఉంటే మేలు : ప్రతి పరిశ్రమలో నీటిసంపు, నిమిషానికి 2,280 లీటర్లు లేదా 1,620 లీటర్ల నీటిని పంపింగ్‌ చేయగల మోటార్లు ఏర్పాటు చేసుకోవాలి. పరిశ్రమ చుట్టూ 150 మి.మీ.ల వ్యాసార్థం గల ఇనుప పైపులు, వాటికి ప్రతి 45 మీటర్ల దూరంలో ఒక అవుట్‌ లెట్‌ ఉండాలి. షార్ట్‌ సర్క్యూట్‌ సంభవించినా, మంట, పొగ వచ్చినా గుర్తించే ఆటోమెటిక్‌ డిటెక్షన్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేసుకోవాలి. పరిశ్రమలో ప్రతి 200 చదరపు మీటర్లకు ఒక అగ్నిమాపక పరికరం ఉండాలి. ఉపరితల నీటిట్యాంకు ఉండాలి. ఇవి ఉంటే మంటలను అర్పివేయొచ్చు.


జాగ్రత్తలు తీసుకోవాలి

- పి.కిశోర్‌, అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి, మహబూబ్‌నగర్‌

వేసవిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా అందరూ జాగ్రత్త తీసుకోవాలి. పరిశ్రమలతో పాటు పెద్ద భవనాలు, విద్యాసంస్థలు, దుకాణాల వాళ్లు కూడా అగ్నిమాపక పరికరాలు ఏర్పాటుచేసుకోవాలని సూచిస్తున్నాం. ప్రమాదాలు జరిగితే మా సిబ్బంది వెంటనే వెళ్లి మంటలు ఆర్పుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని