logo

పాలమూరు సిబ్బందికి పరీక్ష!

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పాలమూరు విశ్వవిద్యాలయం (పీయూ)లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి అధికారులు ‘పరీక్ష’ నిర్వహించేందుకు సన్నాహాలు చేయటం దుమారం రేపుతోంది.

Published : 27 Apr 2024 04:06 IST

ఆందోళనకు సిద్ధమవుతున్న ఉద్యోగులు

డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ పీయూలో ఆందోళన చేస్తున్న బోధనేతర సిబ్బంది(పాతచిత్రం)

పాలమూరు విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే : రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పాలమూరు విశ్వవిద్యాలయం (పీయూ)లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి అధికారులు ‘పరీక్ష’ నిర్వహించేందుకు సన్నాహాలు చేయటం దుమారం రేపుతోంది. సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చాలీచాలని జీతమే ఇస్తున్నా మంచి రోజులు వస్తాయన్న ఆశతో 16 ఏళ్లుగా పనిచేస్తున్నామని, యాజమాన్యం వైఖరి పుండు మీద కారం చల్లినట్లుగా ఉందని వారు వాపోతున్నారు. రాష్ట్రంలోని మిగతా విశ్వవిద్యాలయాల్లో సిబ్బందిని ఒప్పంద, పొరుగు సేవలు, శాశ్వత ప్రాతిపాదికన నియమించారు. పీయూ అధికారులు మాత్రం తాత్కాలిక, అడ్‌హక్‌ పద్ధతిలో నియమించారు. ఇక్కడ 1993 నుంచి అంటే ఓయూ పరిధిలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో పీజీ సెంటర్‌ ప్రారంభమైనప్పటి నుంచి 2016 వరకు 120 మందికి పైగా పనిచేస్తున్నారు. 2008లో పీయూ ఏర్పాటైంది. తర్వాత పీయూ, పీజీ కేంద్రాల్లో పనిచేసేందుకు 150 మందికి పైగా బోధనేతర సిబ్బందిని తీసుకోగా వారంతా పనిచేస్తున్నారు.

ఆగిన వేతన పెంపుదల : మొదట్లో వసతి గృహాల్లో పనిచేసే వారికి రూ.1,800, కళాశాల, పీజీ కేంద్రాల్లో పనిచేసే వారికి రూ.2వేలు వేతనంగా చెల్లించేవారు. 2010 తర్వాత రూ.1,800 చెల్లించే వారికి రూ.3వేలు, రూ.2వేలు చెల్లించేవారికి రూ.4వేలు, 2012లో రూ.3వేల నుంచి రూ.5వేలు, రూ.4వేల నుంచి రూ.6వేలు వేతనాలు పెంచారు. 2016లో వేతనాలు పెంచాలంటూ ‘పాలమూరు యూనివర్సిటీ నాన్‌ టీచింగ్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌’ నాయకులు, బోధనేతర సిబ్బంది ఆందోళనలు చేపట్టారు. అప్పటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ స్పందించి ప్రొఫెసర్‌ టీఎల్‌ఎన్‌ స్వామి అధ్యక్షతన పీయూ అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఏటా 12 శాతం వేతనం పెంచాలని సిఫారసు చేశారు. అదే ఏడాది జూన్‌ నుంచి వేతనంపై 12 శాతం పెంపు అమలు చేశారు. అప్పట్నుంచి ఏటా జూన్‌లో 12 శాతం పెంపుదల చేస్తూ వచ్చారు. ఇలా 2021 జూన్‌ వరకు ఏటా 12 శాతం వేతనం పెంచుతూ వచ్చారు. ఆ తర్వాత వేతన పెంపు నిలిపివేశారు.

పరీక్ష నిర్వహణ ఇలా.. : వచ్చే నెల 3, 4 తేదీల్లో పీయూ బోధనేతర సిబ్బందికి పరీక్షలు నిర్వహిస్తామని, ఈ నెల 19న ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పీయూ పరిధిలోని అన్ని పోస్టుల వారికి జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ ఇంగ్లిష్‌, న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌, రీజనింగ్‌, కంప్యూటర్‌ ప్రాథమిక పరిజ్ఞానం అనే అంశాలపై పేపర్‌-1 పరీక్ష నిర్వహిస్తారు. కంప్యూటర్‌ ఆపరేటర్‌, డేటా ప్రాసెసింగ్‌ అధికారి, సీనియర్‌ అకౌంటెంట్‌, లైబ్రరీ అసిస్టెంట్‌, లేబరేటరీ అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు పేపర్‌-2 పరీక్ష నిర్వహించనున్నారు.

సామూహిక దీక్షకు సిద్ధం : మూడేళ్లుగా వేతనాలు పెంచకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వేతనాలు పెంచాలని అనేక దఫాలుగా విన్నవించినా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తామనడం బాధాకరం. కమిటీ సిఫారసుల మేరకు 12 శాతం వేతనం పెంచి ఖాతాల్లో జమచేయాలి లేదా జీవో నం.60 అమలు చేయాలి. లేదంటే నిరాహార దీక్షలు చేపడతాం.

రామ్మోహన్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ బోధనేతర ఒప్పంద ఉద్యోగుల ఐకాస

పాలనా సౌలభ్యం కోసమే : పాలనా సౌలభ్యం కోసం బోధనేతర సిబ్బంది విద్యార్హత, నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విధులు కేటాయించేందుకు మాత్రమే ఈ పరీక్ష నిర్వహిస్తున్నాం. బోధనేతర సిబ్బంది 152 మందికి పైగా ఉన్నా.. వసతి గృహాల్లో, కింది స్థాయిలో పనిచేస్తున్న వారిని మినహాయించి పీయూ క్యాంపస్‌, పీజీ కేంద్రాల్లో సిబ్బందికే పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని సూచించాం.

- డా.మధుసూదన్‌రెడ్డి, ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని