logo

సేవల సౌలభ్యానికి అంగన్‌వాడీల సర్వే

అయిజ పట్టణంలోని భరత్‌నగర్‌ కాలనీకి చెందిన శాంతమ్మ టీచర్స్‌ కాలనీలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రం పరిధిలో ఉంది. సుమారు అర కిలోమీటర్‌ దూరంలో ఉంటుంది. రోజూ వెళ్లి రావాలంటే ఇబ్బంది. చిన్నారులను కేంద్రానికి పంపాలన్నా ఇబ్బందే.

Published : 27 Apr 2024 03:52 IST

అయిజలో సర్వే చేస్తున్న అంగన్‌వాడీ టీచర్లు

అయిజ పట్టణంలోని భరత్‌నగర్‌ కాలనీకి చెందిన శాంతమ్మ టీచర్స్‌ కాలనీలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రం పరిధిలో ఉంది. సుమారు అర కిలోమీటర్‌ దూరంలో ఉంటుంది. రోజూ వెళ్లి రావాలంటే ఇబ్బంది. చిన్నారులను కేంద్రానికి పంపాలన్నా ఇబ్బందే. పోషకాహారం, గర్భిణులు, బాలింతలకు ఆహారం తీసుకోడానికి కేంద్రానికి వెళ్లాలంటే అవస్థలు పడాల్సిందే.

అయిజ, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ, గర్భిణులు, బాలింతలతో పాటు చిన్నారులకు అందించే సేవల్లో మార్పులు తీసుకొచ్చేందుకు అంగన్‌వాడీ కుటుంబ సర్వే మొదలుపెట్టారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అంగన్‌వాడీ టీచర్లు ఈ సర్వే నిర్వహిస్తున్నారు. కేంద్రం ఒక చోట ఉంటే లబ్ధిదారుల ఇళ్లు ఇంకోచోట ఉండటంతో చిన్నారులకు పోషకాహారం, గర్భిణులు, బాలింతలకు సేవలందించడంలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. లబ్దిదారులు కేంద్రాన్ని చేరుకోడానికి అవస్థలు పడాల్సి వస్తోంది. సమీపంలో ఉన్న కేంద్రాన్ని వదిలిపెట్టి దూరాన ఉన్న కేంద్రానికి కేటాయించడంతోనే ఇలాంటి పరిస్థితి తలెత్తింది. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని పరిష్కారం దిశగా మార్పులు తీసుకొచ్చే ప్రయత్నమే సర్వే. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4,321 కేంద్రాల పరిధిలో ఉన్న ఇళ్లను పరిగణలోకి తీసుకొని ఈ సర్వే చేస్తున్నారు.

ఆన్‌లైన్‌లో నమోదు: సర్వే నేరుగా ఆన్‌లైన్‌లో నమోదవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన రెండు రకాల యాప్‌లలో సర్వేను ఒకేసారి పొందుపరుస్తున్నారు. కేంద్రాన్ని ఆధారంగా చేసుకొని ఇంటి నంబర్‌, కాలనీ పేరు, చిన్నారులు, తల్లిదండ్రులు, గర్భిణులు, బాలింతలు, జనన, మరణాలు, ఇల్లు ప్రస్తుతం ఉన్న కేంద్రం పేరు, ఆ ఇంటికి దగ్గర్లో ఉన్న కేంద్రం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. సర్వే రెండు విధాలుగా ఉంది. ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, మరోటి కేంద్ర ప్రభుత్వానిది. సర్వే అనంతరం కేంద్రాలకు సంబంధించి ఇళ్ల సర్దుబాటు ప్రక్రియ చేపడతారు. కేంద్రానికి దూరంగా ఉండే ఇళ్లను సమీపంలో ఉన్న కేంద్రానికి బదిలీ చేస్తారు. ఒక కేంద్రానికి 250 ఇళ్ల నుంచి 300 ఇళ్లు ఉండేలా సర్దుబాటు చేయనున్నారు.

పకడ్బందీగా చేస్తున్నాం: కుటుంబ సర్వే నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ప్రతి గ్రామంలో అంగన్‌వాడీలు సర్వే చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు పోషకాహారం పంపిణీ సక్రమంగా జరిగేందుకు సర్వే ఉపయోగపడుతోంది. చాలా మంది పట్టణాల్లో లబ్ధిదారులు అద్దె ఇళ్లలో మారుతుంటారు. అలాంటి వారికి ప్రాధాన్యమిస్తూ సర్వే చేస్తున్నారు.

సుధారాణి, డీడబ్ల్యూవో, గద్వాల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని