logo

లక్ష్యం బారెడు... సేకరణ మూరెడు

జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణ లక్ష్యం సుదూరంగా కనిపిస్తోంది. పౌరసరఫరాలశాఖ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 27 రోజులు కావస్తున్నా ఇంతవరకు అనుకున్న లక్ష్యంలో కనీసం ఒకశాతం కూడా సేకరించలేదు.

Published : 27 Apr 2024 03:54 IST

తీలేర్‌ విండో సమీపాన సేకరిస్తున్న ధాన్యం

న్యూస్‌టుడే, నారాయణపేట న్యూటౌన్‌: జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణ లక్ష్యం సుదూరంగా కనిపిస్తోంది. పౌరసరఫరాలశాఖ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 27 రోజులు కావస్తున్నా ఇంతవరకు అనుకున్న లక్ష్యంలో కనీసం ఒకశాతం కూడా సేకరించలేదు. ఈ నెలాఖరు దాటితే కోతలు పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం పరిస్థితులను గమనిస్తే లక్ష్యంలో సగం మేరకైనా ధాన్యం కొంటారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.

  • జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు ప్రారంభించిన వందకుపైగా కేంద్రాల్లో కేవలం 972.800 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారు. ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రూ.66 లక్షలు జమచేశారు. ప్రస్తుత యాసంగిలో పౌరసరఫరాలశాఖ 1.35 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని నిర్ణయించింది. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరాలంటే మరో 99శాతం పైగా ధాన్యం సేకరించాలి. ఇది సాధ్యమయ్యే పనిలా కనిపించడంలేదు.

బయట ధర మెరుగు: యాసంగిలో రైతులు ఆర్‌ఎన్‌ఆర్‌తో పాటు 1010 రకం వరిని సాగు చేశారు. ఆర్‌ఎన్‌ఆర్‌కు బయట మెరుగైన ధర ఉంది. క్వింటాలుకు రూ.2500 నుంచి రూ. 3 వేలకు పలుకుతుండటంతో అందరూ ప్రైవేటుగానే విక్రయించారు. కొందరు జిల్లాకు సమీపంలోని కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌ మార్కెట్కు తరలించారు. 1010 విషయానికొస్తే సాగుచేసిన రైతుల్లో కొందరు ముందే వ్యాపారులతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. పెట్టుబడి కోసం నిధులు తెచ్చుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం వారికే అమ్ముకున్నారు. ఇంకొందరు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో నగదు జమ జాప్యమవుతుందన్న ఉద్దేశంతో అత్యవసర అవసరాల కోసమంటూ ప్రైవేటుగా అమ్ముకున్నారు. మిగతా వారు మాత్రమే కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకుంటున్నారు. మొదట్లో ధాన్యం అమ్మకానికి సిద్ధంగా ఉన్నప్పటికీ మిల్లుల కేటాయింపులో జాప్యం జరిగింది. ఇదే సమయంలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. వర్షం పడటం, ఈదురుగాలులు వీయడం వంటి సంఘటనలతోనూ పలువురు బయట విక్రయించారు. ఇవన్నీ పోగా మిగలిన ధాన్యం మాత్రమే కొనుగోలు కేంద్రాలకు వస్తోంది..గతంలో ఎన్నడూ లేనంత అథమ స్థాయిలో సేకరణ ఉందనడంలో అతిశయోక్తి లేదనిపిస్తోంది.

ఇంకా సమయం ఉంది

ధాన్యం సేకరణకు ఇంకా సమయం ఉంది. ఇప్పటి వరకు 973 మెట్రిక్‌ టన్నులు సేకరించాం. లక్ష్యానికి అనుగుణంగా కేంద్రాలను తెరిచాం. ఇంకా కోతలు పూర్తి కాలేదు. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని భావిస్తున్నాం.

దేవదాసు జిల్లా పౌరసరఫరాలశాఖ మేనేజరు, నారాయణపేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని