logo

గంజాయి దందా.. యువతే నిండా

పాలమూరు పట్టణంలో గంజాయి వ్యాపారం చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఎక్సైజ్‌, పోలీసు శాఖలు నిఘా పెట్టినా.. వారి కళ్లు గప్పి గంజాయిని విక్రయిస్తూనే ఉన్నారు. ఈ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన వాళ్లు కూడా బయటకు వచ్చాక మళ్లీ అదే దందా చేస్తున్నారు.

Published : 27 Apr 2024 04:08 IST

జిల్లాకేంద్రంలో నాలుగు ప్రధాన అడ్డాలు
కళాశాల విద్యార్థులకూ విక్రయం

మహబూబ్‌నగర్‌లో గంజాయి విక్రయిస్తున్న మోతీనగర్‌ యువకులు మహమ్మద్‌ రియాజ్‌, ప్రతాప్‌కుమార్‌లను అరెస్టు చేసిన అధికారులు

మహబూబ్‌నగర్‌ నేరవిభాగం, న్యూస్‌టుడే: పాలమూరు పట్టణంలో గంజాయి వ్యాపారం చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఎక్సైజ్‌, పోలీసు శాఖలు నిఘా పెట్టినా.. వారి కళ్లు గప్పి గంజాయిని విక్రయిస్తూనే ఉన్నారు. ఈ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన వాళ్లు కూడా బయటకు వచ్చాక మళ్లీ అదే దందా చేస్తున్నారు. అధికారులు పూర్తిస్థాయిలో కట్టడి చేయలేకపోతున్నారు. ఇలా పట్టణంలో విక్రయించే వారు మారుతున్నారే తప్ప వినియోగిస్తున్న వారికి గంజాయి సరఫరా మాత్రం ఆగటం లేదు. మహబూబ్‌నగర్‌ పట్టణంలో నలుగురు యువకులు ఈ దందాను కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఇద్దరిని గురువారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని బోయపల్లి గేటు వద్ద ఎక్సైజ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. విశేషమేమిటంటే గతంలో గంజాయి వ్యాపారం చేసి అరెస్టయిన యువకుడే మళ్లీ విక్రయిస్తూ పట్టుబడటం. జల్సాలకు అలవాటు పడిన యువకులు కష్టపడకుండా సులువుగా డబ్బులు సంపాదించడానికి గంజాయి దందాను ఎంచుకుంటున్నారు. హైదరాబాద్‌ నగరం ధూల్‌పేట్‌లో అర కేజీ, కేజీ చొప్పున ఎండు గంజాయిని కొనుగోలు చేస్తున్నారు. 5 గ్రాముల ప్యాకెట్లు చేసి మహబూబ్‌నగర్‌లో విక్రయిస్తున్నారు. ఆటో డ్రైవర్లు, కూలీలు, ఇతర రాష్ట్రాల కార్మికులు గంజాయిని ఎక్కువగా వాడుతుండటంతో డిమాండ్‌ పెరిగి దందా జోరుగా సాగుతోంది.

రూ.500లకు 5 గ్రాముల ప్యాకెట్‌ : చిన్న చిన్న పనులు చేసే యువకులే గంజాయి దందా చేస్తున్నారు. హైదరాబాద్‌లో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి మహబూబ్‌నగర్‌లో 5 గ్రాముల ప్యాకెట్లను రూ.500 నుంచి రూ.800లకు విక్రయిస్తున్నట్లు సమాచారం. పలు కళాశాలల వద్ద విద్యార్థులకు విక్రయిస్తున్నారు. టీడీగుట్ట, బోయపల్లి రైల్వే గేటు, బండమీదిపల్లి, మెట్టుగడ్డ ప్రాంతాలను గంజాయి విక్రయానికి ప్రధాన అడ్డాలుగా చేసుకున్నారు. క్రిస్టియన్‌పల్లి, అప్పన్నపల్లి, దొడ్లోనిపల్లి, పిల్లలమర్రి, బోయపల్లి, ఏనుగొండ, వీరన్నపేట, రైతుబజార్‌, రాజేంద్రనగర్‌, పాత పాలమూరు, మర్లు ప్రాంతాల్లోనూ విక్రయిస్తున్నారు. వాట్సాప్‌ ద్వారా రెగ్యులర్‌ వినియోగదారులకు గంజాయి సమాచార మిచ్చి విక్రయిస్తున్నారు.

87126 58872కు సమాచారం ఇవ్వండి : మహబూబ్‌నగర్‌లో గంజాయి దందా చేసే వారి కదలికలపై నిఘా పెట్టాం. అనుమానం వచ్చిన ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నాం. ఎవరైనా ఎక్కడైనా గంజాయి విక్రయిస్తున్నట్లు, తాగుతున్నట్లు తెలిస్తే వెంటనే 87126 58872 నంబర్‌కు ఫోన్‌ చేసి చెప్పండి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం.

వీరారెడ్డి, ఎక్సైజ్‌ శాఖ సీఐ, మహబూబ్‌నగర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని